వైసీపీ ప్రభుత్వం 89 మంది సలహాదారుల కోసం చేసిన ఖర్చు అక్షరాలా రూ.680 కోట్లు

• శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి కోసం పెట్టిన ఖర్చే రూ.140 కోట్లు
• వీరి జీతభత్యాలు ఏ పద్దు కింద చెల్లిస్తున్నారో వెల్లడించాలి
• సలహాదారుల పేర్లయినా ముఖ్యమంత్రి గారికి తెలుసా?
• వైసీపీ ప్రభుత్వంలో ప్రజాధనం సలహాదారులపాలు
• ఏ అర్హతలతో ఆ పదవులు ఇచ్చారో చెప్పాలి
• ఎవరు ఏ సలహా ఇచ్చారో… దానివల్ల ప్రజలకు కలిగిన మేలు ఏమిటో బయటపెట్టాలి?
• ప్రజలకు మేలు చేసే సలహాలు ఇద్దామనుకొన్నా వినే పరిస్థితి లేదని కొందరు సలహాదారులు రాజీనామా చేశారు
• కేంద్ర మధ్యంతర బడ్జెట్ ను జనసేన పార్టీ స్వాగతిస్తుంది
• జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో శ్రీ నాదెండ్ల మనోహర్

‘వైసీపీ ప్రభుత్వం సలహాదారులకు పెట్టిన ఖర్చు అక్షరాలా రూ.680 కోట్లు. ఇందులో ప్రధాన సలహాదారుడు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి కోసం పెట్టిన ఖర్చే రూ.140 కోట్లు. ఇంత భారీగా ప్రజాధనాన్ని వెచ్చించి ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వ సలహాదారులు ఈ ప్రభుత్వానికి ఇచ్చిన సలహాలు ఏమిటో.. ఆ సలహాల వల్ల తీసుకున్న నిర్ణయాలు, వాటి వల్ల అందిన అభివృద్ధి ఫలాలు.. అసలు ఎవరికి ఎంత మొత్తం ఖర్చు చేశారో ప్రభుత్వం శాసనసభ సమావేశాల్లో సమాధానం చెప్పాల’ని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు డిమాండు చేశారు. సుమారుగా 89 మంది సలహాదారులు ఉన్నారు… ఈ ముఖ్యమంత్రికి తన ప్రభుత్వంలో సలహాదారులు ఎంత మంది ఉన్నారో, వారి పేర్లేమిటో కూడా తెలియదన్నారు. అసలు ఈ సలహాదారుల వివరాలను ప్రభుత్వం అత్యంత రహస్యంగా ఎందుకు ఉంచుతుందో కూడా బయటపెట్టాలని కోరారు. గురువారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో శ్రీ నాదెండ్ల మనోహర్ గారు విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ ‘‘ ఇబ్బడిముబ్బడిగా, ఏ అర్హత లేకున్నా వైసీపీ ప్రభుత్వం నియమించిన సలహాదారుల విషయంలో ప్రభుత్వం మొదట్లోనే కేసును ఎదుర్కొంది. సలహాదారుల సంఖ్య చూసి జిల్లా కలెక్టర్లకు కూడా సలహాదారులను నియమిస్తారేమో అని గౌరవ హైకోర్టు ఆశ్చర్యపోయింది. సలహాదారులు కూడా ప్రజాసేవకు నియమితులైనవారే అనీ, అంతా తగిన అర్హతలు ఉన్నవారినే నియమించామని ప్రభుత్వం తెలియజేసింది. ప్రభుత్వం ఆయా శాఖలవారీగా ఏ నిర్ణయం తీసుకున్నా, సలహాదారులను అడిగే తీసుకుంటున్నామని తెలిపింది. ప్రభుత్వం వారి వివరాలను మాత్రం బయటపెట్టలేదు.
• సలహాలతో తీసుకువచ్చిన పాలసీలు ఏమిటి?
సలహాదారులు సైతం ముఖ్యమంత్రిని, ప్రభుత్వ ముఖ్య అధికారులను కలవలేని దౌర్భగ్య పరిస్థితి ఉంది. దీంతోనే వైసీపీ నియమించిన సలహాదారుల్లో కొందరు రాజీపడలేని వ్యక్తులు ఉన్నారు. వారు రాజీనామా చేసి వెళ్లిపోయారు. శ్రీ సుభాష్ గార్గ్, శ్రీ రామచంద్రమూర్తి, శ్రీ జుల్ఫీ లాంటి వారు ఈ ప్రభుత్వంలో తమ సలహాలు ఎవరూ వినేవారే లేరని తెలుసుకొని వెళ్లిపోయారు. అయితే వైసీపీ ప్రభుత్వంలో తమ అనుకున్న వారి కోసం వేతనాలు, వారి ఖర్చులు, ఇతర సిబ్బంది ఖర్చుల కోసం రూ.680 కోట్లు వెచ్చించారు. వీరు ఇచ్చిన సలహాలు ఏమిటో, దాని వల్ల తీసుకున్న పాలసీలు ఏమిటో ప్రజలకు తెలియజేయాలి.
• సమాంతర పాలన కోసమేనా?
అసలు ఇప్పటికీ ఎంత మంది సలహాదారులున్నారు, వారికి నెలవారీ అవుతున్న ఖర్చులు, వారిచ్చిన సలహాలు, సూచనలపై ప్రజలకు ప్రభుత్వం శాసనసభ వేదికగా సమాధానం చెప్పాలి. 89 మంది సలహాదారుల్లో ముఖ్యమంత్రికి ఎంత మంది తెలుసో కూడా చెప్పాలి. హైకోర్టు కూడా ఇది అనవసర ఖర్చు, అనవసర హంగామా అని ప్రభుత్వ తీరును తప్పుపట్టింది. ప్రభుత్వంలో ఎంతో మెరికల్లాంటి అధికారులను, మంత్రులను ఉపయోగించుకోకుండా ప్రభుత్వం కావాలనే వారిని పక్కన పెట్టింది. సమాంతర పాలన తీసుకువచ్చేందుకు రూ.680 కోట్లు దానికి వెచ్చించడం అంటే మాటలు కాదు. దీనిపై సమగ్ర విచారణ జరగాలి. అసలేం జరిగిందో ప్రజలకు తెలియాలి. వీరికి ఏ పద్దు కింద జీతాలు, అలవెన్సులు, ఇతర ఖర్చులను చేశారో సమాధానం చెప్పాలి. ఒక ముఖ్య సలహాదారుకి రూ.140 కోట్లు ఖర్చు చేయడంలో ఆంతర్యం ఏమిటో కూడా ప్రజలకు తెలియాలి. ఐబీ సిలబస్ ద్వారా అద్భుతాలు జరిగిపోతున్నట్లు ప్రభుత్వం ప్రకటనలు ఇస్తోంది. ఇప్పటి వరకు సీబీఎస్ఈ సిలబస్ అంటూ ప్రకటనలు ఇచ్చిన ప్రభుత్వం ఐబీ సిలబస్ తో విద్యార్థుల దశ మారుస్తామంటూ ప్రకటనలు ఇస్తోంది. అసలు ఇది ఏ సలహాదారుడు ఇచ్చిన సలహానో ప్రభుత్వం బయటపెట్టాలి. ఐబీ సిలబస్ కు పెడుతున్న ఖర్చుపై గతంలోనే జనసేన పార్టీ నిజానిజాలను మీడియా ముఖంగా బయటపెట్టినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఆ సిలబస్ వల్ల పెద్దగా ఒరిగేది లేకున్నా ప్రభుత్వం కావాలనే తొందరపెడుతూ సిలబస్ అమలు దిశగా ముందుకు వెళ్తోంది. దీనిలోని అసలు విషయాలు బయటకు రావాలి.
• కేంద్ర మధ్యంతర బడ్జెట్లో మంచి ఆలోచనలు
కేంద్రం గురువారం తీసుకొచ్చిన మధ్యంతర బడ్జెట్ భావిభారతాన్ని ఆవిష్కృతం చేసింది. మహిళలు, రైతులు, యువతతో పాటు దేశంలోని మౌలిక వసతులపై దృష్టి పెట్టడం మంచి పరిణామం. యువత ఆలోచనలకు స్టార్టప్ లుగా రూ.లక్ష కోట్ల కార్పస్ ఫండ్ ను 50 సంవత్సరాలు వడ్డీ లేని రుణాలుగా ఉపయోగించుకునేలా తీసుకున్న నిర్ణయం అభినందనీయం. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సైతం యువతను ప్రోత్సహించేలా రూ.10 లక్షల ఆర్థిక అండతో వారిని స్వయంశక్తి సాధకులుగా తీర్చిదిద్దాలనే ఆలోచన చేశారు. కేంద్ర ప్రభుత్వం సైతం యువతకు వెన్నుదన్నుగా నిలిచేలా నిర్ణయం తీసుకోవడం వల్ల యువశక్తికి మరింత బలం చేకూరుతుంది. మధ్య తరగతి వారికి ఇంటి కలను నెరవేర్చేలా కేంద్రం భరోసా ఇవ్వడం ఆహ్వానించదగింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద 2 కోట్ల ఇళ్లను నిర్మిస్తామని చెప్పడం మంచి నిర్ణయం. సోలార్ రూఫ్ టాప్ లో భాగంగా 300 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తు అందిస్తామని చెప్పడం మధ్యతరగతికి వరంగా చెప్పవచ్చు. అంత్యోదయ కార్డులకు రేషన్ సరఫరా నిర్ణయం 5 సంవత్సరాలకు పొడిగించడం పేదలకు ఎంతగానో తోడ్పాటునిస్తుంది. మహిళా రిజర్వేషన్ బిల్లు ద్వారా మహిళలకు సాధికారత వస్తుంది. అలాగే పొదుపు సంఘాల్లోని మహిళలు సొంతంగా తమ కాళ్లపై తాము నిలబడేలా కేంద్రం చేస్తున్న ప్రయత్నం అభినందనీయం. పర్యాటకరంగం మీద కేంద్రం దృష్టి పెట్టింది. అత్యంత తీర ప్రాంతం ఉన్న ఆంధ్రా పర్యటక రంగం మీద దృష్టి పెడితే అత్యధిక నిధులు కేంద్రం నుంచి తీసుకొచ్చే వీలుంటుంది. దీనిద్వారా యువతకు ఉపాధి పెరుగుతుంది. మెట్రో ప్రాజెక్టులను ఇతర నగరాలకు విస్తరిస్తామని బడ్జెట్ లో చెప్పడంతో భవిష్యత్తు ఆశలను చిగురింపచేస్తుంది. విభజన చట్టంలో చెప్పిన విధంగా విశాఖ నగరానికీ, విజయవాడ – గుంటూరు – మంగళగిరి – తెనాలికి మెట్రో ఇస్తే ఇవి గ్రోత్ కారిడార్లుగా అభివృద్ధి చెందుతాయి. కేంద్రం తీసుకొచ్చిన మధ్యంతర బడ్జెట్ అన్ని రంగాలకు, వర్గాలకు మేలు చేసేలా ఉండటాన్ని జనసేన పార్టీ స్వాగతిస్తుంది’’ అన్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు శ్రీ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, శ్రీమతి పాలవలస యశస్వి, పార్టీ నేతలు శ్రీ గాదె వెంకటేశ్వరరావు, శ్రీ పోతిన వెంకట మహేష్, శ్రీ నేరెళ్ల సురేష్, శ్రీ అమ్మిశెట్టి వాసు, శ్రీ మండలి రాజేష్, శ్రీమతి పార్వతి నాయుడు, డాక్టర్ పి.గౌతం రాజ్, శ్రీ అక్కల రామ్మోహనరావు, శ్రీ బేతపూడి విజయ శేఖర్, శ్రీ తాతంశెట్టి నాగేంద్ర పాల్గొన్నారు.