తుఫాను వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి

  • మలిశెట్టి వెంకటరమణ

రాజంపేట: మీచౌంగ్ తుఫాన్ వల్ల రాజంపేట నియోజకవర్గం పరిధిలోని రాజంపేట గ్రామీణ మరియు సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాల్లో అరటి, బొప్పాయి పంటలు పండించిన రైతులు తీవ్ర స్థాయిలో నష్టపోయారని, వారి వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన పార్టీ రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జి మలిశెట్టి వెంకటరమణ డిమాండ్ చేశారు. మంగళవారం జనసేన నాయకులతో కలిసి ఆయన మండల పరిధిలోని మేడావారి పల్లె, ఆకేపాడు తదితర గ్రామాలలో పర్యటించి నష్టపోయిన రైతులను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా మలిశెట్టి వెంకటరమణ మాట్లాడుతూ రైతులు ఎంతో కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో ప్రకృతి విపత్తు వల్ల నష్టపోతున్నారని అన్నారు. ఒక ఎకరా అరటి పండించడానికి సుమారు లక్ష రూపాయల ఖర్చు అవుతుందని, పంట పండి చేతికి వస్తే ఒక ఎకరాకు మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు రైతులకు ఆదాయం వస్తుందని, ఇటువంటి సమయంలో తుఫాన్ వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, ఉద్యానవన శాఖ అధికారులు వెంటనే రైతుల దగ్గరికి వెళ్లి నష్టపోయిన ప్రతి ఒక్క రైతును గుర్తించి వారి పంట నష్ట వివరాలను వెంటనే సేకరించి నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేసారు.