జనవాణి – జనసేన భరోసా కార్యక్రమానికి భారీ స్పందన

•శ్రీ పవన్ కళ్యాణ్ చెంతకు వెల్లువెత్తిన సమస్యలు
•సమస్యలు చెప్పుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు
•ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న సమస్యలు
•పాలకుల నిర్లక్ష్యంతో ఎదురవుతున్న సమస్యలు
•అధికార పార్టీ దాష్టీకాలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు
•టిడ్కో గృహాలు కేటాయించలేదంటూ పదుల సంఖ్యలో అర్జీలు
•విద్యార్ధులు, ఉద్యోగుల సమస్యలపైనా వినతులు
•పంట నష్టాలు, పాలకుల నిర్లక్ష్యంపై అన్నదాతల మండిపాటు
•వ్యవసాయ, రెవెన్యూ, విద్య, మున్సిపల్ శాఖల సమస్యలపై ఎక్కువ అర్జీలు
•గ్రామాల్లో గతుకుల రహదారులపై విన్నపాలు
•సమస్యలు చెప్పుకొనేందుకు భారీ క్యూ లైన్లు
•427 మంది నుంచి నేరుగా అర్జీలు స్వీకరించిన శ్రీ పవన్ కళ్యాణ్
•జనవాణి వేదికపై కౌలు రైతు బిడ్డలకి రూ.లక్ష ఆర్ధిక సాయం

బీసీల సంక్షేమాన్నిఈ ప్రభుత్వం గాలికి వదిలేసింది..ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దుర్వినియోగం అవుతున్నాయి… మైనారిటీలను నిర్లక్ష్యం చేస్తున్నారు… మాకు ఫీజు రీ ఎంబర్స్ మెంట్ రావడం లేదు…కాపు కార్పోరేషన్ నుంచి విదేశీ విద్యోన్నతి పథకాన్ని నిలిపివేశారు.. సంచార జాతులమైన మా పై దాడులు చేస్తున్నారు.. అయినా పోలీసులు పట్టించుకోవడం లేదు.
– జనవాణి… జనసేన భరోసా కార్యక్రమంలో వివిధ సంఘాల ప్రతినిధులు, బాధిత ప్రజలు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర తమ సమస్యలు విన్నవించుకున్నారు. దివ్యాంగులను ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.. కిడ్నీ వ్యాధిగ్రస్తుల్ని ముప్పతిప్పలు పెడుతోంది.. ఫించన్లు ఎత్తేసింది.. డయాలసిస్ కేంద్రాలు అందుబాటులో లేవు.. రోగం వస్తే సీఎం రిలీఫ్ ఫండ్ కోసం కాళ్లరిగేలా తిప్పుకుంటున్నారు.. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నా పాలకులకు కనికరం కలగడం లేదు.. అని బాధితులు చెబుతుంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారు చలించి పోయారు.
విజయవాడ మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో ఆదివారం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్వహించిన జనవాణి – జనసేన భరోసా కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఏళ్ల తరబడి తిష్ట వేసిన ఎన్నో సమస్యలు, పాలకుల నిర్లక్ష్యానికి ముందుకు కదలని సమస్యలు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి చెప్పుకుంటే ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుందన్న నమ్మకంతో వివిధ వర్గాల ప్రజలు సమస్యలు చెప్పుకునేందుకు మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంకు క్యూ కట్టారు. ఒక దశలో సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన బాధితులతో కిలోమీటర్ల మేర క్యూలైన్లు దర్శనమిచ్చాయి. జనవాణి – జనసేన భరోసా కార్యక్రమాన్ని అనుకున్న సమయం కంటే రెండు గంటల పాటు పొడిగించినప్పటికీ సమస్యలతో వచ్చే వారి క్యూ లైన్లు పెరుగుతూనే ఉన్నాయి. ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఏకదాటిగా ప్రజా సమస్యలు విన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారికి 427 అర్జీలు వచ్చాయి.
•ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబానికి భరోసా
కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలతోపాటు ఇతర జిల్లాల అన్నదాతలు ప్రభుత్వం నుంచి ఎదురవుతున్న ఇబ్బందులు వివరించేందుకు జనవాణి – జనసేన భరోసా కార్యక్రమానికి తరలివచ్చారు. పంట తగులబడిపోతే ఈ-క్రాప్ వర్తించదన్నారని ఓ మహిళా రైతు వాపోగా, మొన్నీ మధ్య ముఖ్యమంత్రిగారు 

ఆర్భాటంగా బటన్ నొక్కి విడుదల చేసిన బీమా సొమ్ములు తమకు అన్ని అర్హతలు ఉన్నా రాలేదని మరికొంత మంది రైతులు చెప్పారు. కోల్డ్ స్టోరేజ్ లు లేక, గిట్టుబాటు ధర రాక పడుతున్న కష్టాలు చెప్పుకున్నారు. గిట్టుబాటు ధర రాక పడుతున్న ఇబ్బందులు, కౌలు రైతుల సమస్యలు రైతులు వివరించారు. గత నెల 19వ తేదీన ప్రకాశం జిల్లా, ఇంకొల్లు మండలం, వంకాయలపాడు గ్రామానికి చెందిన కౌలు రైతు శ్రీ బాలినేని వినోద్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడడంతో పాటు అతని భార్య ఆత్మహత్యయత్నం చేసి చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయాన్ని తెలుసుకుని జనవాణి – జనసేన భరోసా వేదికపై ఆ రైతు కుమారులను పరామర్శించారు. వారికి జనసేన పార్టీ తరఫున రూ. లక్ష ఆర్థిక సాయాన్ని చెక్ రూపంలో అందచేశారు.
టిడ్కో గృహాల నిర్మాణం పూర్తయినప్పటికీ ఏళ్ల తరబడి వాటిని తమకు కేటాయించకుండా ప్రభుత్వం ఇబ్బందులు పెడుతున్న అంశంపై పట్టణ ప్రాంత వాసులు అర్జీలు సమర్పించారు. విద్యార్ధులు వైసీపీ ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్ మెంటు నిలిపివేసిన విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధులకు ఎదురవుతున్న ఇబ్బందులపై కూడా ఫిర్యాదులు వచ్చాయి. విదేశీ విద్యోన్నతి పథకం నిలిపివేతతో విద్యార్ధులకు ఎదురవుతున్న సమస్యలను మైనారిటీ, కాపు సంఘాలు వివరించాయి. గ్రామాల్లో రహదారులు, మౌలిక వసతుల కల్పన మీద భారీ ఎత్తున అర్జీలు అందాయి.
అధికార పార్టీ దాష్టికాలు, దౌర్జన్యాలపైనా, రాష్ట్రంలో శాంతి భద్రతల దుస్థితిపైనా పవన్ కళ్యాణ్ గారికి అర్జీలు భారీగా వచ్చాయి. ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్ చుట్టుపక్కల ఇళ్లు ఖాళీ చేయించిన విషయంపై జనసేన పార్టీకి ఫిర్యాదు చేసినందుకు ప్రభుత్వం నుంచి ఎదురైన వేధింపులపై ఆ ప్రాంత యువతి శివశ్రీ జనవాణిలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువచ్చారు. కైకలూరు నియోజకవర్గం కాళ్ల గ్రామంలో అధికార పార్టీ నాయకుల దాష్టికాలకు పడుతున్న ఇబ్బందులను ఆ గ్రామస్తులు చెప్పుకున్నారు. గ్రామ స్థాయిలో ఎదురవుతున్న వేధింపులను వివరించారు.
ప్రకాశం జిల్లా, కనిగిరి, కృష్ణా జిల్లా, తిరువూరు, మైలవరం, జగ్గయ్యపేట గ్రామాల్లో భూగర్భ జలాల కాలుష్యంతో కిడ్నీ వ్యాధులు ప్రబలి వారు పడుతున్న ఇబ్బందులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వచ్చాయి. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన ఫించన్లు, డయాలసిస్ సౌకర్యాలు అందడం లేదని బాధితులు వాపోయారు. ప్రభుత్వం నుంచి సౌకర్యాలు అందేలా ఒత్తడి తేవాలని పవన్ కళ్యాణ్ గారిని వేడుకున్నారు.
విజయవాడ ఆటో నగర్ కార్మిక సంఘాలు, ఆటో ఓనర్లు, వర్కర్స్ యూనియన్ల సభ్యులు.. టైలర్లు.. వెలిగొండ భూ నిర్వాసితులు, వరికపుడిసెల ప్రాజెక్టు సాధన సమితి సభ్యులు అర్జీలు ఇచ్చారు. ప్రతి సమస్యను ఓపికగా విన్న పవన్ కళ్యాణ్ బాధితుల పక్షాన ప్రభుత్వంపై పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు.
దివ్యాంగులు, వృద్దులు, కిడ్నీ వ్యాధులు లాంటి తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారు సమస్యలు విన్నవించుకోవడానికి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ వేదికపై నుంచి దిగి స్వయంగా బాధితుల వద్దకు వెళ్లి వారి సమస్యలు ఆలకించి, అర్జీలు స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ , పీఏసీ సభ్యులు కొణిదల నాగబాబు, విశ్రాంత ఐఏఎస్ అధికారి, పార్టీ నేత డి.వరప్రసాద్, పొలిట్ బ్యూరో సభ్యులు అర్హం ఖాన్, కోశాధికారి ఎ.వి. రత్నం, ప్రధాన కార్యదర్శులు చిలకం మధుసూదన్ రెడ్డి, పెదపూడి విజయ్ కుమార్, పార్టీ కార్యక్రమాల నిర్వహణ విభాగం కన్వీనర్ కళ్యాణం శివశ్రీనివాస్, చేనేత వికాస విభాగం ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాస్, విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్, కృష్ణా జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ, గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, పార్టీ కార్యదర్శులు అమ్మిశెట్టి వాసు, బేతపూడి విజయ్ కుమార్, సంయుక్త కార్యదర్శి రవికాంత్ తదితరులు పాల్గొన్నారు.