కులాలను కలిపే ఆలోచనా విధానం అనే సిద్ధాంతం కోనసీమలో కార్యరూపంలోకి వచ్చింది

•కులాల మధ్య ఐక్యతకు యువ నాయకులు చేస్తున్న కృషిని అందరం గుర్తించాలి
•జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్

‘జనసేన పార్టీ ఏడు సిద్ధాంతాల్లో ‘కులాలను కలిపే ఆలోచనా విధానం’ అనేది ఒకటి. ఇది కోనసీమలో కార్యరూపం దాల్చడం సంతోషంగా ఉంది’ అని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు స్పష్టం చేశారు. ఈ సిద్ధాంతాన్ని కోనసీమ ప్రజలు, ముఖ్యంగా యువత పరిపూర్ణంగా అర్థం చేసుకొందని తెలిపారు. కులాల మధ్య ఐక్యత తీసుకురావడం అనేది ఒక రోజులో అయ్యే పని కాదు అనీ… ఆ ఐక్యత విలువను ఎప్పటికప్పుడు అందరికీ తెలియచెబుతూ రావాలి అన్నారు. 2018 నుంచి కోనసీమ ప్రాంతానికి వెళ్ళిన సందర్భాల్లో వివిధ సామాజిక వర్గాలతో మాట్లాడటం, ఆయా సామాజిక వర్గాల ప్రతినిధులతో కులాల ఐక్యత సాధించడం గురించి మాట్లాడుతూ వచ్చాను అన్నారు. ఈ రోజు వివిధ సామాజిక వర్గాల ప్రతినిధులు ఒకతాటి మీద ఉండి ప్రజలతో మమేకం కావడం ఒక మార్పును సూచిస్తోంది అని చెప్పారు. కాబట్టే కోనసీమలో కులాల మధ్య గొడవలు సృష్టించాలని వైసీపీ ప్రయత్నించినా సాధ్యం కాలేదు అన్నారు. మంగళవారం రాజమండ్రిలో కోనసీమ ప్రాంతానికి చెందిన నాయకులు శ్రీ పవన్ కల్యాణ్ గారితో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో శ్రీ వాసంశెట్టి సుభాష్, శ్రీ గంటి హరీష్, శ్రీ గంధం పళ్లంరాజు, శ్రీ చిక్కాల గణేశ్, శ్రీ యర్రంశెట్టి కాశీ, శ్రీ మండెల బాబీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోనసీమ అల్లర్లు, తదనంతరం నమోదు చేసిన కేసుల గురించి వివరించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “కులాల మధ్య సఖ్యత ద్వారా సామాజిక అభివృద్ధి సాధ్యం అవుతుంది. కోనసీమలో చోటు చేసుకున్న దురదృష్టకర ఘటనల వెనక ఉన్న కుట్రను ప్రజలు అర్థం చేసుకున్నారు అంటే అందుకు కారణం – అన్ని వర్గాల ప్రజలు ఒక తాటి మీదకు రావడమే. ఈ సఖ్యత తీసుకురావడంలో వివిధ సామాజిక వర్గాల ప్రతినిధులు చేసిన ప్రయత్నాలు, కృషిని అందరం గుర్తించాలి. ముఖ్యంగా యువతరం నాయకులు ముందుకు రావడం శుభ పరిణామం. ఒక వేళ ఈ సఖ్యత లోపించి ఉంటే.. కోనసీమలో వైసీపీ కుట్ర సఫలమై అదో రావణ కాష్టంలా మారేది. వివిధ సామాజిక వర్గాల నాయకులు బాధ్యతగా నిలబడ్డారు కాబట్టే కోనసీమలో చాలా త్వరగా సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. నేను రాజమండ్రిలోనే చెప్పాను కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి అని. అన్ని వర్గాలను కలుపుకొని వెళ్తూ… సోదర భావంతో ముందుకు వెళ్తే కచ్చితంగా అది గొప్ప సంకేతం అవుతుంది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కచ్చితంగా కులాల ఐక్యత ప్రభావం కనిపిస్తుంది” అన్నారు. ఈ సమావేశంలో పిఠాపురం ఇంఛార్జ్ శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ పాల్గొన్నారు.