రైతుల బాధ పట్టని ప్రభుత్వాన్ని ఇంటికి పంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు

* అన్నదాతను అడుగడుగునా దగా చేశారు
* రైతు భరోసా యాత్రకు భయపడే లక్ష రూపాయలు ఖాతాల్లో వేస్తున్నారు
* రూ. 7 లక్షల పరిహారం ఇచ్చే వరకు పోరాటం
* శిరివెళ్ళ రచ్చబండ కార్యక్రమంలో పి.ఎ.సి. ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్

రాష్ట్ర చరిత్రలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అన్నారు. రైతు లేకపోతే రాష్ట్రం లేదని, రైతాంగం ఎదుర్కొంటున్న కష్టాలపై మానవతా దృక్పథంతో స్పందించలేని పనికిమాలిన ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పాలిస్తున్నాడన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక దాదాపు 3 వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, వ్యవసాయం అంటే భయపడే స్థితికి రైతాంగం వెళ్లిపోయిందని విమర్శించారు. పాలన దక్షత లేని ఈ ముఖ్యమంత్రిని ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. జనసేన కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా ఆదివారం సాయంత్రం ఉమ్మడి కర్నూలు జిల్లా శిరివెళ్ళ గ్రామంలో రచ్చబండ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక 3 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అందులో అత్యధికంగా ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి 400 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. మాది రైతు ప్రభుత్వం అని చెప్పుకొని అడుగడుగునా అన్నదాతను దగా చేస్తున్నారు. ఎరువులు, విత్తనాల సబ్సిడిని ఎత్తేశారు. వ్యవసాయ పరికరాలపై సబ్సిడి తీసేశారు. ఇలా ప్రతి చోట వైసీపీ ప్రభుత్వం మోసం చేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక పేదవాడు ఇంకా పేదవాడిగా మారిపోతుంటే… వైసీపీ నాయకులు మాత్రం కోటీశ్వరులుగా అవతరిస్తున్నారు.
* రాష్ట్ర చరిత్రలో ఇటువంటి కార్యక్రమం లేదు
రాష్ట్ర రాజకీయ చరిత్రలో జనసేన కౌలు రైతు భరోసా యాత్ర వంటి కార్యక్రమం జరగలేదు. ఆళ్లగడ్డ, పాణ్యం, నందికొట్కూరు, శ్రీశైలం ఇలా ఉమ్మడి కర్నూలు జిల్లా నలుమూలల నుంచి 130 మంది కౌలు రైతు కుటుంబాలకు ఈ రోజు లక్ష చొప్పున అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆర్ధిక సాయం అందించనున్నారు. అంతకుముందు అనంతపురంలో 30 కుటుంబాలకు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 41 మంది కౌలు రైతు కుటుంబాలకు జనసేన పార్టీ తరఫున లక్ష చొప్పున ఆర్ధిక సాయం అందించాం. కౌలు రైతుల ఆత్మహత్యలు చూసి చలించిపోయి శ్రీ పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బులు రూ.5 కోట్లు విరాళంగా ఇస్తే… ఆత్మహత్యకు పాల్పడిన కౌలు రైతు కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ ఎక్కడా కనిపించలేదు. ఏ రైతు కుటుంబానికి కూడా వన్ టైమ్ సెటిల్మెంట్ చేయలేదు. రూ.7 లక్షల నష్టపరిహారం అందించలేదు. జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్ర ప్రారంభించినప్పటి నుంచి ఆత్మహత్యకు పాల్పడ్డ ప్రతి కౌలు రైతు కుటుంబానికి లక్ష చొప్పున ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారు. ప్రతి బాధిత కుటుంబానికి రూ. 7 లక్షల నష్టపరిహారం అందే వరకు జనసేన పార్టీ పోరాటం చేస్తుంది.
* రైతు భరోసా కేంద్రాల పేరిట మోసం చేశారు
రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల బతుకులు మారుస్తామని చెప్పిన ముఖ్యమంత్రి… ఇవాళ అదే కేంద్రాలతో మోసం చేస్తున్నారు. రైతు భరోసా కేంద్రాలు ఒక్క వడ్ల బస్తా కొనవు. ఒక్క ప్యాకెట్ విత్తనాలను అందించవు. బడ్జెట్ లో మాత్రం రూ.6,300 కోట్లు కేటాయించినట్లు గొప్పులు చెప్పుకొంటారు. మరో వైపు రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టారు. రోజు కనీసం 8 గంటలు పవర్ కట్ చేస్తున్నారు. బోర్లు ఎండిపోతున్నాయి. రైతులు అధికారులు, ఎమ్మెల్యేల చుట్టు తిరిగినా ఫలితం ఉండటం లేదు. ఎమ్మెల్యేలకు రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద ఉన్న శ్రద్ధ రైతును కాపాడుకోవడంలో లేదు. ఈ విషయం ఎన్నిసార్లు ప్రభుత్వానికి చెప్పినా దున్నపోతు మీద వాన కురిసినట్లే వ్యవహరిస్తోందని అన్నారు.
* 128 రైతు కుటుంబాలకి రూ. లక్ష ఆర్థిక సాయం
కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు 128 కౌలు రైతు కుటుంబాలను పరామర్శించి రూ. లక్ష ఆర్థిక సాయం చేశారు. 124 కుటుంబాల వారితో శిరివెళ్ల గ్రామంలోని రచ్చబండ కార్యక్రమంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి చెక్కులు అందచేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి, శ్రీ బొలిశెట్టి సత్య, శ్రీ పెదపూడి విజయ్ కుమార్, పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ అర్హమ్ ఖాన్, పార్టీ నేతలు శ్రీ టి.సి. వరుణ్, డా.పి.హరి ప్రసాద్, శ్రీ చింతా సురేష్ బాబు, శ్రీమతి రేఖా గౌడ్, శ్రీమతి హసీనా బేగం, శ్రీ బాల వెంకట్, శ్రీ ఎస్. వెంకప్ప, శ్రీ లక్ష్మన్న, శ్రీ మూర్తి, శ్రీ మైలేరి మల్లయ్య, శ్రీ అర్షద్ తదితరులు పాల్గొన్నారు.