కౌలు రైతు కుటుంబాల కన్నీరు తుడుస్తూ.. అన్నదాత ఇంట భరోసా నింపుతూ..

• ఉమ్మడి కర్నూలు జిల్లాలో పవన్ కళ్యాణ్ కౌలు రైతు భరోసా యాత్ర
• 128 కుటుంబాలకు రూ.లక్ష ఆర్ధిక సాయం

వ్యవసాయంలో వరుస నష్టాలతో పేరుకుపోయిన అప్పుల కుప్పలు.. ఉన్న పొలం అమ్ముకుని అదే పొలంలో కౌలు చేసిన దుస్థితి.. వరి సాగు కలసిరాలేదని మిరప వేస్తే అదీ బెడిసికొట్టింది.. అప్పులు తీర్చేదారి కనబడక కుటుంబాన్ని పోషించలేని దిక్కుతోచని స్థితిలో భవిష్యత్తుపై భయంతో కౌలు రైతులు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. ఎన్నికల ముందు రైతు ప్రభుత్వం, రైతుల్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పిన నేటి పాలకులు ఆ కుటుంబాలను కనీసం పలుకరించేందుకు కూడా ముందుకు రాలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాల ధైన్య స్థితిని తెలుసుకున్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వారి కన్నీరు తుడిచేందుకు కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టారు. ఆదివారం ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొదటి విడత కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా 128 కుటుంబాలకు రూ. లక్ష ఆర్ధిక సాయం చేశారు. బలవన్మరణాలకు పాల్పడిన కౌలు రైతు కుటుంబాల కన్నీరు తుడుస్తూ.. ఆ అన్నదాతల కుటుంబ సభ్యులకు భరోసా ఇస్తూ.. ధైర్యం నింపుతూ ఉమ్మడి కర్నూలు జిల్లాలో కౌలు రైతు భరోసా యాత్ర సాగింది. యాత్రలో భాగంగా ఆత్మహత్యకు పాల్పడిన నలుగురు కౌలు రైతు కుటుంబాలను పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఇళ్లకు వెళ్లి పలుకరించారు. వారి పరిస్థితి విని చలించిపోయారు. పవన్ కళ్యాణ్ గారు పలకరించిన ఒక్కో కుటుంబానిది ఒక్కో దీన గాధ. పాణ్యం నియోజకవర్గానికి చెందిన కౌలు రైతు మేకల నాగసుబ్బారాయుడు రెండేళ్ల క్రితం వ్యవసాయంలో నష్టాలు వచ్చి, అప్పుల బాధలు తాళలేక ఆత్మహత్య చేసుకున్నారు. వెంకటేశ్వరపురంలో ఆయన భార్య శ్రీమతి భూలక్ష్మిని పరామర్శించారు. జనసేన పార్టీ తరఫున రూ. లక్ష ఆర్ధిక సాయం అందచేశారు. రెండేళ్ల క్రితం తన భర్త ఆత్మహత్య చేసుకున్నారనీ, సాయం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగానని వాపోయారు. సుమారు 300 సార్లు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినట్టు వివరించారు. అయినా ఫలితం లేదనీ, ఎలాంటి సాయం అందలేదని చెప్పారు. జనసేన పార్టీ తరఫున ఆర్ధిక సాయంతో పాటు వారి బిడ్డల భవిష్యత్తుకు అండగా ఉంటామని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు. అనంతరం దీబగుంటకు చెందిన కౌలు రైతు దూదేకుల పండ్లాపురం చిన్న హుస్సేనీ కుటుంబానికి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆర్థిక సాయం అందచేశారు. వ్యవసాయంలో అప్పులపాలు కావడంతో హుస్సేనీ ఏడాదిన్నర క్రితం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఐదు ఎకరాల్లో మిర్చి, ఐదు ఎకరాల్లో జొన్న సాగు చేయగా పంట నష్టం, గిట్టుబాటు దక్కక నష్టం వచ్చినట్టు హుస్సేనీ భార్య శ్రీమతి శ్యామిర్బీ వివరించారు. ఇంటి పెద్ద చనిపోయి దిక్కులేని పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి కనీసం పలకరింపు కరువయ్యిందని వాపోయారు. ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. పార్టీ తరఫున రూ. లక్ష ఆర్ధిక సాయాన్ని అందచేశారు.
• ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి రాలేదు
నంద్యాల నియోజకవర్గం, జిల్లెళ్ల గ్రామానికి చెందిన కౌలు రైతు గైని నరహరి రెండేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్నారు. ఎనిమిది ఎకరాల్లో వేరుశనగ సాగు చేసి దిగుబడి రాక, కౌలు కూడా చెల్లించడానికి డబ్బులు లేని పరిస్థితుల్లో దిక్కుతోచక పొలంలోనే పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. నరహరి ఆత్మహత్య చేసుకునే సమయానికి కుదువ పెట్టిన నగలు వడ్డీలు పెరిగిపోయిన పరిస్థితుల్లో ఇప్పటికీ బ్యాంకుల నుంచి విడిపించుకోలేకపోయినట్టు అతని కుటుంబ సభ్యులు రైతు భరోసా యాత్రలో పవన్ కళ్యాణ్ గారికి తెలిపారు. నరహరి భార్య, బిడ్డలకు పవన్ కళ్యాణ్ గారు ధైర్యం చెప్పి రూ. లక్ష ఆర్దిక సాయం అందించారు. ఆళ్లగడ్డ నియోజకవర్గం వనికెందిన్నే గ్రామానికి చెందిన మరో కౌలు రైతు బండి సురేంద్ర వ్యవసాయంలో వరుస నష్టాల కారణంగా అప్పుల పాలై రెండేళ్ల క్రితం ఆత్మహత్యకు పాల్పడ్డారు. జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా ఆదివారం మధ్యాహ్నం పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సురేంద్ర కుటుంబాన్ని పరామర్శించి, అతని భార్య శ్రీమతి నాగలక్ష్మికి రూ. లక్ష ఆర్ధిక సాయం అందించారు. బిడ్డల భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఆ మొత్తాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
• దారి పొడవునా పూల వర్షం
అంతకు ముందు కౌలు రైతు భరోసా యాత్ర కోసం ఉమ్మడి కర్నూలు జిల్లాకు వచ్చిన పవన్ కళ్యాణ్ గారికి ఓర్వకల్లు విమానాశ్రయంలో పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ఎయిర్ పోర్టు వెలుపల భారీ గజమాలలతో పవన్ కళ్యాణ్ గారిని ముంచెత్తారు. అక్కడి నుంచి భారీ ర్యాలీగా శిరివెళ్ళ రచ్చబండ కార్యక్రమానికి బయలుదేరారు. గడివేముల, బేతంచర్ల, నంద్యాలల్లో పవన్ కళ్యాణ్ గారి యాత్రకు సంఘీభావంగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు, ప్రజలతో రహదారులు కిక్కిరిశాయి. దారిపొడుగునా జనసైనికులు, వీర మహిళలు పూల వర్షం కురిపించారు. రచ్చబండ కార్యక్రమం జరిగిన శిరివెళ్ల గ్రామ ప్రజలు పవన్ కళ్యాణ్ గారికి అపూర్వ స్వాగతం పలికారు. వేల సంఖ్యలో రహదారికి ఇరు వైపులా బారులుతీరి హారతులు పట్టి, పూల వర్షం కురిపించారు. ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున రోడ్డు మీదకు వచ్చి జై జనసేన అంటూ నినాదాలు చేశారు. శిరివెళ్ల గ్రామ ప్రజలు రచ్చబండ వేదికకు ముందు మరో గజమాలతో పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించారు.

Avatar