ఏనుగులు, పులి భారి నుండి జిల్లా ప్రజలకు రక్షణ కల్పించాలి

  • ఏనుగుల బాధితులకు పరిహారం చెల్లించి, కుటుంబాలను ఆదుకోవాలి
  • పాలకులు, అధికారులు కళ్లు తెరవాలన్న జనసేన పార్టీ నాయకులు

పార్వతీపురం నియోజకవర్గం: పార్వతీపురం మన్యం జిల్లాలో సంచరిస్తున్న ఏనుగులు, పులి నుండి ప్రజలను రక్షించాలని జనసేన పార్టీ నాయకులు కోరారు. శుక్రవారం ఆ పార్టీ జిల్లా నాయకులు వంగల దాలినాయుడు, అన్నా భత్తుల దుర్గాప్రసాద్, కర్రి మణీ, అంబటి బలరాం తదితరులు విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటికే గత నాలుగేళ్లుగా పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం, పార్వతీపురం, పాలకొండ తదితర నియోజకవర్గాలలోని ఆయా మండలాల్లో సంచరిస్తూ 11 మంది రైతులను, సామాన్యులను పొట్టన పెట్టుకొని, సుమారు మూడు కోట్ల రూపాయల పంటలను, ఆస్తులను ధ్వంసం చేస్తూ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఏనుగుల బాధలు భరించలేని ప్రజలకు ఇప్పుడు తాజాగా పులి సంచరిస్తున్నట్లు తెలియడంతో ప్రజలు మరింత భయాందోళనకు గురవుతున్నారన్నారు. జిల్లాలో సీతంపేట, భామిని ప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు తెలియడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారన్నారు. అలాగే సాలూరు, గరుగుబిల్లి మండలాల్లో కూడా పులి సంచరిస్తున్నట్లు అడుగుజాడలు కనిపించడంతో పార్వతీపురం మన్యం జిల్లా ప్రజలు భీతిల్లుతున్నారన్నారు. గతంలో సంచరించిన పులి మూగజీవాలను పట్టని పెట్టుకున్న సంఘటనలు నేపథ్యంలో విషయం తెలిసిన ప్రజలు భయపడుతున్నారన్నారు. ఏనుగుల బాధలకు తోడు, పులి భయం తోడైందని వీటిపై తక్షణమే పాలకులు అధికారులు కళ్ళు తెరచి తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఏనుగులు, పులులు మరికొంతమందిని పట్టణ పెట్టుకోక ముందే కార్యాచరణ రూపొందించాలన్నారు. గత నాలుగేళ్లుగా ప్రజల్ని చంపుతూ, ఏనుగులు చస్తూ ఉన్నా ప్రభుత్వంలో కనీసం చలనం లేదన్నారు. ముఖ్యంగా జిల్లాలోని తాజా, మాజీ ఉప ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు దీనిపై దృష్టి సారించి ప్రజలకు భరోసా ఇవ్వాలన్నారు. సంబంధిత శాఖ అధికారులు తగు ప్రణాళికలు రచించి వాటి నుండి ప్రజలకు, ప్రజల నుండి వాటికి రక్షణ కల్పించాలన్నారు. అలాగే ఏనుగుల భారిన పడి మృత్యువాత పడిన బాధిత కుటుంబాలకు, ఆస్తి నష్టపోయిన రైతులకు, ప్రజలకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని కోరారు.