పేదలు కుబేరులై పోయారు.. అందుకే టికెట్ రేట్లు పెంచారు!

‘పేద ప్రజలకు సినిమా వినోదం అందించాలన్నదే ఆలోచన. అందుకే టికెట్ రేట్లు తగ్గించాం. దాన్ని కూడా కొందరు తప్పుపడుతున్నారు’ అని ఘనమైన మాటలు చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు ఏం చెబుతారు. రాత్రికి రాత్రే టికెట్ ధర పెంచారు. అంటే రాష్ట్ర ప్రజలు ఒక్క రాత్రిలో కుబేరులుగా మారిపోయారా? సినిమా టికెట్ రేటు తగ్గించడం, పెంచడం అనే పేరుతో వైసీపీ ప్రభుత్వం ఆడిన రాక్షస క్రీడకు నేపథ్యం… వాళ్ళ కక్ష సాధింపు ధోరణి. ఇది రాష్ట్ర ప్రజలకు అర్థం అవుతూనే ఉంది. జగన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే గొంతుకను నొక్కివేయాలి అనే బూర్జువా ఆధిపత్య విధానాలకు ఒక తార్కాణం ఇది.
సినిమా టికెట్ ధరలను ఒక కప్పు టీ ధర కంటే తగ్గించేసిన ప్రభుత్వం ఇప్పుడు అమాంతం పెంచడం వరకూ సాగించిన వికృత ప్రహసనం, చేసిన వ్యాఖ్యలు ఎవరూ మరచిపోరు. సినిమా రంగం పట్ల ప్రభుత్వ వైఖరిని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ‘రిపబ్లిక్’ వేడుకలో నిలదీసి ప్రశ్నించారు. సినిమా పరిశ్రమవాళ్లు మాట్లాడాలని సూచించారు. ఉన్న మాటను అనడానికి… తప్పులను ఎత్తిచూపి ప్రశ్నలు సంధించిన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై రాష్ట్ర మంత్రులు పేర్ని నాని, బొత్స సత్యనారాయణ, నారాయణ స్వామి లాంటివాళ్లు ఇష్టానుసారం మాట్లాడి అసలు విషయం పక్కదోవ పట్టించాలని చూశారు. అదే విధంగా సినిమా ఇండస్ట్రి వాళ్లపై ఒత్తిడి తెచ్చి ప్రకటనలు, లేఖలు ఇప్పించుకొని చేసిన పనులు ప్రభుత్వాన్ని నవ్వులపాలు చేశాయి.
• అధికారుల బతుకు సినిమా హాలే
అధ్యక్షులు పవన్ కళ్యాణ్ లక్ష్యంగా 2021 ఫిబ్రవరిలో వకీల్ సాబ్ విడుదల నుంచి ఈ యేడాది వచ్చిన భీమ్లా నాయక్ వరకూ వైసీపీ వాళ్ళు ఆడిన ఆటలు అందరికీ తెలిసినవే. ఇక 2021 సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకూ ప్రభుత్వం సినిమా హాల్స్ నిర్వాహకులపై చేసిన దాడులు టాలీవుడ్ ను పూర్తి ఆందోళనలోకి నెట్టేశాయి. సినిమా టికెట్ల ధరల తగ్గింపును ప్రశ్నించిన ప్రతి ఒక్కరినీ వెంటాడి వేధించడమే తమ నైజమని వైసీపీ వాళ్ళు ఆచరణలో చూపించారు. హీరో నాని ‘శ్యాం సింగరాయ్’ సినిమా విడుదలకు ముందు థియేటర్ కౌంటర్ కలెక్షన్ కంటే పక్కన ఉన్న కిరాణా కొట్టు వ్యాపారం ఎక్కువగా ఉంది అని ఆవేదన చెందారు. అంతే ఆ సినిమా ఆడుతున్న హాల్స్ దగ్గర అధికారులు చేసిన హడావిడికి ఎగ్జిబిటర్లు బెంబేలెత్తిపోయారు. నిబంధనల పేరుతో వేధించారు. డిసెంబర్ నెలలో రాష్ట్రవ్యాప్తంగా ఎగ్జిబిటర్లు హాల్స్ మూసేందుకు సిద్ధమయ్యారు. దాదాపు 200 సినిమా హాల్స్ కు తాళాలు వేశాక ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ సిఫార్సుల మేరకు ఆలోచన చేస్తామని చెప్పారు. ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ఉన్నవారికే ఆ కమిటీలో పెద్ద పీట వేశారు. ఇండస్ట్రి క్షేమం గురించి సిఫార్సులు చేసినవారిని కమిటీ సమావేశాల్లోనే అధికారులు రకరకాల ప్రశ్నలతో, నిబంధనలతో సంబంధం లేని అంశాలు చెబుతూ ఇబ్బంది పెట్టారని సమాచారం.
ఈ ఏడాది ఫిబ్రవరి 25న భీమ్లా నాయక్ విడుదల సమయంలో జిల్లా కలెక్టర్ నుంచి గ్రామ రెవెన్యూ అధికారి వరకూ చేసిన హంగామా అందరూ చూశారు. రెవెన్యూ యంత్రాంగం అంతటినీ భీమ్లా నాయక్ ప్రదర్శించే హాల్స్ దగ్గర మోహరించి అక్కడ కర్ఫ్యూ వాతావరణం సృష్టించారు. ఎలాగైనా బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు లేకుండా చూడాలనే ప్రభుత్వ కుటిల యత్నం అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇమేజ్ ముందు వెలవెలపోయింది. అందుకే సినిమా విడుదలైన సాయంత్రమే రాష్ట్ర మంత్రులు మీడియా దగ్గర తమ కడుపు మంట చల్లార్చుకొనేందుకు విఫల యత్నం చేశారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యోదయాన్ని ఆపలేరనే వాస్తవం అప్పుడుగానీ ఐ.ఏ.ఎస్.లకు బోధపడలేదు. మెజిస్టీరియల్ అధికారాలు ఉన్న అధికారులు సినిమా హాల్స్ దగ్గర కాపలా ఉద్యోగాలు చేసే దుస్థితి రాష్ట్రంలో నెలకొందనే విషయం జాతీయవ్యాప్తం అయింది.
• అవసరార్థం అంధత్వం
అధిక ధరలకు టికెట్లు అమ్మకుండా చూస్తున్నాం అని రాష్ట్ర మంత్రి పేర్ని నాని చెప్పారు. ఈ నిబంధన ఒక్క భీమ్లా నాయక్ సినిమాకు మాత్రమే ఎందుకు వర్తించింది అనేదానికి వైసీపీ వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. వైసీపీ ప్రభుత్వానికి అవసరార్థం అంధత్వం వస్తుంది. వాళ్ళ దగ్గరకు వెళ్ళి చేతులు కట్టుకొంటేనో… ఫోన్లు చేసి బతిమలాడుకొంటేనో వదిలేస్తారు. ఆ విషయాన్ని పేర్ని నాని స్వయంగా మీడియాతోనే చెప్పారు. నూజివీడు ఎమ్మెల్యే కొడుకు ద్వారా కథానాయకుడు బాలకృష్ణ తనతో మాట్లాడారని, ముఖ్యమంత్రితో కూడా మాట్లాడతాను అని చెప్పారని మంత్రి సెలవిచ్చారు. అలాగే వైసీపీ మంత్రివర్గంలో ఒక మంత్రి కుటుంబానికి సంబంధం ఉన్నవారు తీసిన సినిమా సంక్రాంతి సీజన్లో వచ్చింది. ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడే హీరో. ఫోన్లో మాట్లాడినవాళ్ళ, సన్నిహితుల సినిమాలకు ఎలాంటి అడ్డంకులు రాలేదు. భీమ్లా నాయక్ విడుదలకు ముందు రోజు కూడా హాలీవుడ్ డబ్బింగ్ సినిమాలకు కూడా భారీ రేట్లకు టికెట్లు అమ్మారు. ఆ సమయంలో ప్రేక్షకులు… పేదవారు అనే ఈక్వెషన్ వైసీపీ ప్రభుత్వానికి గుర్తుకు రాలేదు. అప్పుడు కళ్ళు మూసుకొన్నారు.
• ప్రశ్నిస్తే ఇగో హర్ట్ అవుతుంది
సినీ పరిశ్రమ బృందం చిరంజీవి నేతృత్వంలో ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్ళి టికెట్ రేట్లు పెంచాలని అడిగిన విధానం ప్రజలు చూశారు. వారికి అక్కడ ఎలాంటి మర్యాదలు అందాయో కూడా తెలిసిందే. ప్రభుత్వం తన కక్ష సాధింపుకి తోడు పీఠం మీద ఉన్నవారి అహం చల్లార్చుకొనేందుకు ఏ విధంగా చేస్తుందో కూడా అర్థం అయింది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన ప్రతి ఒక్కరి మీద ఇగోతో విరుచుకుపడితే పాలన ఏం చేస్తారు?
• ఇప్పుడేం చెబుతారు
భీమ్లా నాయక్ విడుదల అయ్యే వరకూ ఆగడం వెనక ఆంతర్యం అర్థం కాకుండా పోతుందా? టికెట్ ధర 10 రోజులపాటు పెంచుకొనే వెసులుబాటు ఇస్తూ 20 శాతం షూటింగ్ ఏపీలో చేసి ఉండాలి అన్నారు. ఈ వారం నుంచి వచ్చే భారీ సినిమాలకు పెంచుతారా లేదా అనేది చూస్తున్నారు. సినీ పెద్దలు అమరావతి వెళ్ళి భీమ్లా నాయక్ ను బలి వేసి వరాలు తెచ్చుకొన్నామని సంబరపడితే అది అమాయకత్వమే అవుతుంది. ధీరుడు ఎదురు నిలుస్తాడే తప్ప సాగిలపడడు. గద్దెనెక్కిన వాళ్ళు కూడా ఒకటి గ్రహించాలి- సముద్రం ఒకడి కాళ్ళ దగ్గర కూర్చుని మొరగదు… తుపాను గొంతు చిత్తం అనడం ఎరగదు…. పర్వతం ఎవ్వడికీ ఒంగి సలామ్ చెయ్యదు. వరాలు పొందామనుకొనేవాళ్లూ తెలుసుకోవాల్సింది ఏమిటంటే – నియంత చేతిలో కత్తి ఎప్పుడు ఎవరిని బలి కోరుతుందో ఎవరికి తెలుసు. ఆ కత్తికి ఎదురువెళ్లే ధైర్యం… తెగువ ఉంటే చేతులు కట్టుకొని ప్రాధేయపడేవారా?
పేదల కోసమే టికెట్ రేట్లు తగ్గించాం అని సెలవిచ్చిన మంత్రులు భీమ్లా నాయక్ విడుదల తరవాత అఘమేఘాల మీద టికెట్ ధరలు పెంచారు. అంటే రాష్ట్ర ప్రజలు రాత్రికి రాత్రే కుబేరులుగా మారిపోయారా? ఎనలేని అభివృద్ధిని వైసీపీ చేసి చూపడంతో ప్రజల ఆదాయాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయినందున టికెట్ రేట్లు పెంచాలని నిర్ణయించారా? బహిరంగ సభలోనే పేదల కోసమే సినిమా టికెట్ ధరలు తగ్గించాను అని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు పెంచడం గురించి ఏ బహిరంగ సభలో సెలవిస్తారో? చూద్దాం.