ఆది నుంచీ అదే భరోసా

• గంగపుత్రులపై జనసేనాని ప్రత్యేక శ్రద్ద
• పోరాట యాత్రలో మత్స్యకారులతోనే తొలి సమావేశం
• తీర ప్రాంత పర్యటనల్లో వారి సమస్యలపై అధ్యయనం
• జనసేన మ్యానిఫెస్టోలో ప్రత్యేక స్థానం
• పల్లెకారుల ఉన్నతి కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు
• జీవో 217 రద్దుకు పోరాటం
• జనసేనానిపై గంగపుత్రులకూ ఎనలేని అభిమానం

ఏడాది పొడుగునా ఏటికి ఎదురీతే.. వేటకు వెళ్తే తిరిగి వస్తారో రారో తెలియని ఆందోళనకర పరిస్థితి.. అయినా నిత్య పోరాటానికి సిద్ధంగా ఉంటారు. ఆ పోరాటంలో సముద్రాన్ని జయించినంత తేలికగా సమస్యల్ని జయించలేకపోతున్నారు. ప్రాణాలకు తెగించి కడలి గర్భాన ఉన్న మత్స్య సంపదను ఒడిసి పట్టి ఒడ్డుకు చేర్చడం ఒక సమస్య అయితే ఒడ్డుకు తెచ్చిన కష్టాన్ని అమ్మి సొమ్ము చేసుకోవడం మరో సమస్య. తీర ప్రాంత జీవనం.. పాలకుల నిర్లక్ష్యం.. సదుపాయాల కల్పనలో వైఫల్యాలు మత్య్యకారుల పాలిట శాపంగా మారుతున్నాయి. పాలకులే దోపిడి దారులుగా మారి వారి జీవితాల్లో చీకట్లు నింపుతున్న సమయంలో ఆ చీకట్లో చిరు దివ్వెలా వారికి భరోసా ఇచ్చేందుకు, వారి తరఫున పోరాటం చేసేందుకు ముందుకు వచ్చారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ పూర్తి స్థాయి ప్రజా ప్రస్థానం ప్రారంభించిన తొలి నాళ్ల నుంచి మత్య్సకారుల సంక్షేమానికి, సమస్యల పరిష్కారానికి తనవంతు గళం విప్పుతూనే ఉన్నారు. జనసేన పార్టీ పక్షాన పోరాడుతూనే ఉన్నారు. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేస్తూ క్షేత్ర స్థాయిలో మత్స్యకారుల సమస్యలపై అధ్యయనం చేసి వారి పక్షాన పోరాటం చేసేందుకు మత్స్యకార వికాస విభాగం పేరిట ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. గంగపుత్రుల జీవితాల్లో వెలుగులు నింపడం కోసం ప్రత్యేక విధానాలకు రూపకల్పన చేస్తున్నారు.

• గంగమ్మ సాక్షిగా తొలి అడుగు

కులం, మతం, వర్గం, ప్రాంతంతో సంబంధం లేకుండా సమస్య ఉన్న చోటుకే వెళ్లి పోరాటం చేసే తత్వమున్న జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు మత్స్యకారులతో ఆది నుంచి మంచి అనుబంధం ఉంది. గంగపుత్రుల్ని తన హృదయానికి దగ్గరగా ఉన్న వ్యక్తులుగా జనసేనాని చెబుతారు. అందుకు నిదర్శనమే జనసేన పోరాట యాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం. రాష్ట్ర ప్రజల సమస్యలు స్వయంగా తెలుసుకుని వాటిపై అధ్యయనం చేసేందుకు 2018 మే 20వ తేదీన మొదలైన పోరాట యాత్ర తొలి అడుగు ఆ మత్స్యకారుల సాక్షిగా, సాగర తీరాన పడింది. అంతేకాదు పోరాట యాత్రలో తొలి సమావేశం మత్స్యకారులతోనే జరగడం గమనార్హం. నాడు ఇచ్చాపురం నియోజకవర్గ పరిధిలోని కవిటి మండలం, కపాసకుర్ధి సముద్ర తీరాన్ని తన తొలి అడుగుకు పవన్ కళ్యాణ్ ఎంచుకున్నారు. మత్స్యకారుల జీవన విధానాన్ని అమితంగా ఇష్టపడే ఆయన వారి సాంప్రదాయాలకు అనుగుణంగా ప్రత్యేక పూజలు నిర్వహించి పోరాట ప్రస్థానానికి నాంది పలికారు. వేటకు వెళ్లే ముందు తమకు ఎలాంటి ఆపద రాకూడదంటూ గంగమ్మకు మొక్కడం వారి సాంప్రదాయం. పవన్ కళ్యాణ్ జనబాట పట్టే ముందు అదే సంప్రదాయాన్ని అనుసరించారు. అంతేకాదు పోరాట యాత్రలో తొలి సమావేశం జరిగింది కూడా మత్స్యకారులతోనే. దళారుల దోపిడి, తుపాను నష్టాల పట్ల పాలకుల అలసత్వం, పడవలు నిలుపుకునేందుకు కనీసం జెట్టేలు లేకపోవడం, సమస్యల సుడితో పోరాడలేక వలసలు పోతున్న వైనాన్ని కపాసకుర్ధి ఆడపడుచులు పవన్ కళ్యాణ్ ముందు ఉంచారు. జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ప్రత్యేక ప్రణాళిక రూపొందించి మత్స్యకారులకు అండగా ఉంటామని ఆ సందర్భంలో హామీ ఇచ్చారు. తీర ప్రాంతం వెంబడి ఉన్న ప్రతి నియోజకవర్గంలోనూ మత్స్యకారుల సమస్యలపై గళం విప్పి ప్రభుత్వాన్ని కదిలించారు. పోరాట యాత్ర ప్రారంభానికి ముందే గంగవరం పోర్టు కాలుష్యానికి జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు అండగా నిలిచారు. పోరాట యాత్రలో భాగంగా మత్స్యకార గ్రామాలు ఉన్న ప్రతి నియోజకవర్గంలోనూ వారితో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి వారి సమస్యలు తెలుసుకున్నారు. తిత్లీ తుపాను అనంతరం శ్రీకాకుళం జిల్లాలోని తీర ప్రాంత గ్రామాల్లో పర్యటించిన పవన్ కళ్యాణ్ నష్టపోయిన ప్రతి మత్స్యకార గ్రామాన్ని సందర్శించారు. వరుస తుపానుల కారణంగా జరుగుతున్న నష్టాన్ని, జెట్టీలు లేక పడుతున్న ఇబ్బందులను, ప్రభుత్వ పథకాల అమలు సమయంలో ఎదురవుతున్న వేధింపులు, తీర ప్రాంత గ్రామాల్లో అభివృద్ధి పూర్తిగా కుంటుపడడాన్ని గమనించారు. వారం రోజుల పర్యటనలో పదుల సంఖ్యలో మత్స్యకారులతో స్వయంగా మాట్లాడారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పోరాట యాత్రలో భాగంగా ఉప్పాడ తీరంలో గంగపుత్రులతో ప్రత్యేక సభ ఏర్పాటు చేశారు. మంచి ధర వచ్చేంత వరకు సరుకు నిల్వ ఉంచుకునే అవకాశం లేక దళారుల చేతిలో ఏ విధంగా మోసమోతున్నారన్న విషయాన్ని మత్స్యకారులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. పోరాట యాత్రలో మత్స్యకారులు తన దృష్టికి తీసుకువచ్చిన ప్రతి సమస్యపై మరింత లోతుగా అధ్యయనం చేశారు. పాలకుల విధానాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 28.3 లక్షల మత్స్యకారుల కుటుంబాల జీవితాలు అగమ్యగోచరంగా మారిపోయాయన్న విషయాన్ని 2019 ఎన్నికలకు ముందే గమనించారు. పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో గంగపుత్రుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రత్యేక స్థానాన్ని కల్పించారు.

• మ్యానిఫెస్టోలో వరాల జల్లు

మత్స్యకారుల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా జనసేన పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రత్యేకంగా చోటు కల్పించారు. చేపల వేట మీద ఆధారపడి జీవించే ప్రతి మత్స్యకారుడికీ 300 రోజుల ఉపాధి కల్పన, తుపాను హెచ్చరికలు, వేట విరామ సమయాల్లో ఒక్కో మత్స్యకారుడికి రోజుకి రూ. 500 భృతి, ప్రభుత్వం ఏర్పాటైన రెండేళ్లలోపు అన్ని మత్స్యకార గ్రామాలకు రక్షిత మంచినీటి సరఫరా, మత్స్యకారులు పడవలు నిలుపుకునేందుకు జెట్టీలు, హార్బర్ల నిర్మాణం వంటి హామీలు అందులో పొందుపర్చారు. సముద్రం లోపల వేటకు వెళ్లేందుకు పెద్ద మర పడవలు కూడా ప్రభుత్వం తరఫున అందచేస్తామని హామీ ఇచ్చారు. మత్య్సకారుల సంక్షేమం కోసం పవన్ కళ్యాణ్ మ్యానిఫెస్టోలో చేర్చిన అంశాల పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

• లాక్ డౌన్ లో చిక్కుకున్న వారికి జనసేన అండ

కోవిడ్ మహమ్మారి మొదటి విడత వ్యాప్తి సందర్భంగా దేశ వ్యాప్తంగా కఠిన లాక్ డౌన్ అమల్లో ఉన్న సమయంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొంత మంది మత్స్యకారులు చెన్నై తీరంలో చేపల వేటకు వెళ్లి అక్కడే చిక్కుకుపోయారు. లాక్ డౌన్ కారణంగా సొంత ఊరికి రాలేక, ఉన్న చోట తినడానికి తిండిలేక ఇబ్బంది పడ్డారు. జనసేన నాయకుల ద్వారా వారి అవస్థలు తెలుసుకున్న పవన్ కళ్యాణ్ వెంటనే తమిళనాడు ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ట్విట్టర్ ద్వారా సంప్రదించారు. చెన్నై తీరంలో చిక్కుకున్న సిక్కోలు మత్స్యకారులను ఆదుకోవాలని కోరారు. పవన్ కళ్యాణ్ వినతిని స్వీకరించిన నాటి ముఖ్యమంత్రి పళని స్వామి వెంటనే వారికి భోజన వసతితో పాటు బస ఏర్పాటు చేశారు. మీ మత్స్యకారులు క్షేమం అంటూ పవన్ కళ్యాణ్ కి స్వయంగా సమాచారం ఇచ్చారు. జీవనోపాధి కోసం గుజరాత్ వెళ్లి అక్కడ తీర ప్రాంతంలో చిక్కుకపోయిన వారిని తిరిగి ఇళ్లకు చేర్చేందుకు కృషి చేశారు. దారిపొడుగునా జనసేన శ్రేణుల ద్వారా వారికి ఆహారపానీయాలు అందచేశారు.

• రంగంలోకి జనసేన ప్రత్యేక విభాగం

గంగపుత్రుల అభివృద్ధి, సమస్యల పరిష్కారం ధ్యేయంగా జనసేనాని మరో ముందడుగు వేశారు. దశాబ్దాల తరబడి మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై క్షేత్ర స్థాయి అధ్యయనం, వాటి పరిష్కారం లక్ష్యాలుగా జనసేన పార్టీకి అనుబంధంగా మత్స్యకార వికాస విభాగాన్ని ఏర్పాటు చేశారు. నరసాపురానికి చెందిన పార్టీ ముఖ్యనాయకులు బొమ్మిడి నాయకర్ కు ఈ విభాగం బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి మత్స్యకార గ్రామం నుంచి సభ్యులు ఉండేలా ఏర్పాటు చేసిన మత్స్యకార వికాస విభాగం ప్రస్తుతం తీర ప్రాంతం మొత్తం పర్యటిస్తోంది. క్షేత్ర స్థాయిలో మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కార మార్గాలు అన్వేషించే పనిలో ఉంది. రానున్న సార్వత్రిక ఎన్నికల నాటికి జనసేన పార్టీ రూపొందించే మ్యానిఫెస్టోలో మత్స్యకారులకు ఒక ప్రత్యేక పేజీ ఉండాలన్న లక్ష్యంతో ఈ కమిటీ ముందుకు వెళ్తోంది. ముఖ్యంగా మారుమూలన అభివృద్ధికి ఆమడ దూరంలో కులవృత్తి మీద ఆధారపడి జీవిస్తున్న గంగపుత్రుల నిత్యపోరాటాన్ని వెలుగులోకి తీసుకురావాలన్నది పవన్ కళ్యాణ్ ఆకాంక్ష. మత్స్యకారుల ఆర్ధిక మూలాలను దెబ్బతీసే విధంగా వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నంబర్ : 217కి వ్యతిరేకంగా జనసేన పార్టీ పోరాడుతోంది.

• 20న మత్స్యకార అభ్యున్నతి సభ

217 జీవో రద్దు డిమాండ్ తో సహా మత్స్యకారుల అన్ని సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఈ నెల 20 వ తేదీ జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరగనున్న మత్స్యకార అభ్యున్నతి సభలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. ఇందులో భాగంగా ఈ నెల 13వ తేదీ పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రారంభించిన మత్స్యకార అభ్యున్నతి యాత్ర అప్పటి వరకు సాగుతుంది. రాజకీయ ప్రస్థానంలోని ప్రతి అడుగులో పవన్ కళ్యాణ్ మత్స్యకారుల మీద తనకున్న మమకారాన్ని ఇలా చాటుకుంటూ వస్తున్నారు. జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన రోజున పాలకుల నిరంకుశ ధోరణులతో ఉనికిని కోల్పోతున్న గంగపుత్రుల జీవితాల్లో వెలుగులు నింపుతామన్న భరోసా ఇస్తున్నారు.