వైసీపీ దాష్టీక విముక్త రాష్ట్రం కోసమే జనహిత పొత్తు

• జనసేన – తెలుగుదేశం పొత్తు సూపర్ హిట్
• రాష్ట్ర అభివృద్ధిపై కూటమి వద్ద బ్లూ ప్రింట్ ఉంది
• పొత్తు విజయం కోసం పనిచేసేవారందరికీ తగిన గౌరవం ఇచ్చే బాధ్యతను మేం తీసుకుంటాం
• ముఖ్యమంత్రి మానసిక స్థితే దుర్మార్గమైంది
• జగన్ కు రాజకీయం కేవలం వ్యాపారం మాత్రమే
• ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు చూపించగల బ్లఫ్ మాస్టర్ జగన్
• ఏం పొడిచావని వై నాట్ 175 అంటున్నావ్..?
• 2014లో రాష్ట్ర క్షేమం కోసం నిస్వార్థంగా మద్దతు తెలిపిన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్
• తెలుగు జన విజయకేతనం ‘‘జెండా’’ ఉమ్మడి సభలో మాట్లాడిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు

‘అమరావతిపై తన మాట శాసనమండలిలో నెగ్గలేదని ఏకంగా ఆ సభనే రద్దు చేయాలనుకున్న పెత్తందారుడు… మాస్కు అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ ను పిచ్చోడని ముద్ర వేసి చంపేసిన దుర్మార్గుడు.. గత ప్రభుత్వంలో అమరావతిలో విద్యాసంస్థలను నెలకొల్పారనే కోపంతో ఆ విద్యా సంస్థలకు నీళ్లు ఇవ్వకుండా, రోడ్లు వేయకుండా హింసించిన మూర్ఖుడు… పేదవాడికి రూ.5 లకే అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను రద్దు చేసిన దాష్టీకుడు… భారతదేశానికి క్రికెట్ ఆడిన రాష్ట్ర క్రికెటర్ హనుమ విహారిని సైతం వేధించి పంపేసిన టెర్రరిస్టు ఆలోచనలు కలిగిన రాష్ట్ర ముఖ్యమంత్రికి మానసిక స్థితే సరిగా లేద’ని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఆస్తి పంపకాల్లో సొంత చెల్లి తనకు అన్యాయం జరిగిందని వేరే పార్టీలోకి వెళితే, ఆమెపై సోషల్ మీడియాలో వికృత ప్రచారం చేయించిన మనస్తత్వం కలిగిన వ్యక్తి రాష్ట్రాన్ని పాలిస్తున్నాడని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకొని వచ్చే ఎన్నికల్లో ఓటు వేయాలని కోరారు. గత ఎన్నికల్లో పాదయాత్రలు చేసి కనిపించిన ప్రతి ఒక్కరికీ ముద్దులు పెట్టిన వ్యక్తి.. ముఖ్యమంత్రి అయ్యాక అదే ప్రజల్ని పిడి గుద్దులు గుద్దుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. జగన్ కు రాజకీయం అంటే కేవలం వ్యాపారం మాత్రమే అన్నారు. తాడేపల్లిగూడెం సమీపంలోని పత్తిపాడు వద్ద బుధవారం జనసేన – తెలుగుదేశం పార్టీల ఉమ్మడి మొదటి ఎన్నికల సభ తెలుగు జన విజయకేతనం ‘‘జెండా’’ సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ…‘‘ కొత్తగా పాలనలోకి వచ్చిన ఏ ముఖ్యమంత్రి అయినా ఏదైనా ప్రజలకు ఉపయోగపడే కార్యం చేసి పాలన మొదలుపెట్టాలనుకుంటాడు. ఈ సైకో మనస్తత్వం ఉన్న ముఖ్యమంత్రి మాత్రం ప్రజలు బాధలు, వెతలు చెప్పుకునే ప్రజా వేదికను కూల్చి పాలన మొదలుపెట్టాడు. జనవరి 1 వస్తుందంటే ప్రజలకు ఉపయోగపడే నిర్ణయం ఏ నాయకుడు అయినా తీసుకొని, వారికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు చెబుతాడు. ఈ క్రిమినల్ మెంటాలిటీ ఉన్న ముఖ్యమంత్రి మాత్రం జీవో నంబరు 1 ద్వారా పత్రికలపై ఆంక్షలు, నియంతృత్వం తీసుకొచ్చేలా, ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టేలా ఆదేశాలు ఇస్తాడు. ప్రజాస్వామ్యాన్ని ప్రతిక్షణం అపహాస్యం చేయడమే ఇతడికి తెలిసిన విద్య. తనకు ఎదురు చెప్పేవారిని అంతమొందించడమే అసలు నైజం. ఇతడి మానసిక స్థితే సరిగా లేదు. ఇప్పటి వరకు దేశంలో ఏ ముఖ్యమంత్రిని అయినా సైకో అని పిలిచారా..? తీసుకునే నిర్ణయాలు సైకో నిర్ణయాలు అన్నారా..? మన రాష్ట్ర ముఖ్యమంత్రిని మాత్రమే ప్రజలు ఇలా పిలుచుకునే దుస్థితి వచ్చింది.
• 2014లో నిస్వార్థంగా మద్దతు ఇచ్చిన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్
రాష్ట్రం కోసం నిస్వార్థంగా ఆలోచించే బలమైన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కనీసం రాజధాని కాని, సరైన వసతులు గాని లేకుండా ఆర్థిక కష్టాలు ఉన్న సమయంలో 2014 ఎన్నికల్లో నిస్వార్థంగా అప్పటి తెలుగుదేశం, బీజేపీ కూటమికి మద్దతు పలికిన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు ఆయన అందించిన సహకారం ఎనలేనిది. ఇప్పుడు మరోసారి విధ్వంసం అయిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి దశదిశా చూపించడానికి మళ్లీ ఇప్పుడు రెండు పార్టీలు ఏకమయ్యాయి. రాష్ట్రాన్ని వైసీపీ విముక్తం చేసి, మళ్లీ పునర్నిర్మించే బాధ్యతను తీసుకుంటాం. ఓ వ్యక్తి అహంకారం వల్ల రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది. ప్రశ్నించే, పోరాడే తత్వం ఉన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో జరుగుతున్న పాలన చూసి కలిసి ప్రయాణం చేయాలని నిర్ణయించడం శుభ సూచకం. రాష్ట్రానికి ఏ అన్యాయం జరిగినా దానిపై చాలా సీరియస్ గా స్పందించే నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
• మాది ప్రజలు కుదిర్చిన పొత్తు
నాకు కాని, శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కాని అధికారంకావాలనే లక్ష్యంతో పెట్టుకున్న పొత్తు కాదు. వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి చాలా కీలకం. రాష్ట్రానికి నవోదయం రావాలంటే ఈ దాష్టిక వైసీపీ పాలన పోవాలి. మాది ప్రజలు కోరుకుంటున్న, కుదిర్చిన పొత్తు. రాష్ట్రానికి వెలుగులు తీసుకొచ్చే పొత్తు. కష్టాల్లో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్న పొత్తు. పుట్టబోయే బిడ్డల భవిష్యత్తును నిర్దేశించే పొత్తు. కష్టాలు, కడగండ్లలో నిండిన విధ్వంసం అయిన రాష్ట్రాన్ని ఒడ్డుకు చేర్చబోయే పొత్తు. హత్యకు గురవుతున్న ప్రజాస్వామ్యాన్ని బతికించే పొత్తు. వైసీపీ దొంగలపై సమరనాదం చేసే పొత్తు. రెండు పార్టీల తాడేపల్లిగూడెం సభ తాడేపల్లి ప్యాలెస్ వణికేలా చేస్తుంది. ప్రజలంతా మళ్లీ మనకు మంచి రోజులు రాబోతున్నాయని అర్ధం చేసుకుంటారు. రాష్ట్రాన్ని ఎలా ముందుకు నడిపించాలనే దానిపై కూటమి ప్రభుత్వానికి బ్లూ ప్రింట్ ఉంది. అధికారంలోకి రాగానే దీన్ని సమర్థంగా అమలు చేస్తాం. ఆంధ్రప్రదేశ్ కు సమర్ద వనరులు ఉన్నాయి. నదులు, విశాలమైన తీరం, మంచి నేల, ఖనిజాలతో కూడిన అపార సంపద ఉంది. అభివృద్ధి చేసుకునేందుకు అనేక దారులు ఉన్నాయి. వీటిని వినియోగించుకోవాలి. కోతలు లేని పథకాలు, బాదుడు లేని సంక్షేమం, పెట్టుబడులు తెచ్చే సంపద సృష్టి, సమృద్ధిగా నీళ్లు ఇచ్చి రైతును బతికించే ఆలోచన, ఉద్యోగాలతో యువతకు దారి చూపించే ఉత్సాహాన్ని ఇచ్చే ప్రణాళిక మా దగ్గర ఉంది. ఉమ్మడి మేనిఫెస్టోలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది. బీసీ, ఎస్సీల కోసం ప్రత్యేక డిక్లరేషన్ ఉంటుంది. అలాగే అన్ని రంగాలను గాడిలో పెట్టే విజన్ కూడా ఉంది. త్వరలోనే ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేస్తాం.
• మన పొత్తు సూపర్ హిట్ సినిమా
ఒక్క ఛాన్స్ అని అడుగుతూ ఊరురా తిరుగుతున్నాడని ప్రజలు బాహుబలి రేంజ్ లో జగన్ ను ఊహిస్తే అది పూర్తిగా ఫ్లాప్ సినిమా అయిందని గ్రహించారు. ఈ ఫ్లాప్ సినిమాకు మరో సీక్వెల్ ఉండదు. జగన్ కు మరోసారి అవకాశం ఉండదు. జనసేన – తెలుగుదేశం పొత్తును ప్రజలే సూపర్ హిట్ చేశారు. రాష్ట్రాన్ని నాశనం చేసిన వైసీపీని తగులబెట్టడానికి అగ్నికి వాయువు తోడైంది. ఈ వాయువే శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఇక రాష్ట్రంలో వైసీపీ బుగ్గి కావడం ఖాయం. మన గెలుపును ఎవరూ ఆపలేరు. చాలా బాధ్యతగా అభ్యర్థులను ఎంపిక చేశాం. మన అభ్యర్థులంతా చదువుకున్న వాళ్లయితే, వైసీపీ అభ్యర్థులంతా బూతులు, మాఫియా నేతలు ఉన్నారు. కులాలు కూడుపెట్టవు. మంచి పాలన వలనే మన బతుకులు బాగు పడతాయని ప్రజలు గుర్తించాలి. చెడు వ్యక్తి పాలన చేస్తే ఆ కులంలోని వారు కూడా సుఖంగా ఉండరు. రాష్ట్రం కోసం మేం ఎలాంటి త్యాగాలకు అయినా సిద్ధంగా ఉన్నాం. తెలుగు జాతిని ప్రపంచంలోనే నంబరు 1గా తయారు చేయాలి. వైసీపీ నాయకుడు మాట్లాడితే వై నాట్ 175 అంటున్నాడు. ప్రజలంతా నువ్వేం పొడిచావ్ అని వై నాట్ 175 అంటున్నావ్ అని ప్రశ్నిస్తున్నారు. వై నాట్ జాబ్ క్యాలెండర్… వై నాట్ డీఎస్సీ, వై నాట్ ఉచిత ఇసుక అని ప్రశ్నిస్తున్నారు. మనం ఇప్పుడు వై నాట్ పులివెందుల అందాం. అక్కడ కూడా జగన్ లేకుండా చేద్దాం. ఈ ముఖ్యమంత్రి ఎంత నియంత ధోరణితో పాలించాడంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారు విమానంలో వెళ్లేందుకు అనుతించరు.. ప్రజలకు అభివాదం చేసేందుకు అనుమతించరు… శ్రీ చిరంజీవి గారిని, శ్రీ రాజమౌళి వంటి దర్శకులను అవమానిస్తాడు. అసలు ముందుగా హు కిల్డ్ బాబాయ్ అనేది జగన్ జవాబు చెప్పాలి. ప్రజలకు ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్లు చేసి కనికట్టు చేయడానికి జగన్ బాగా అలవాటు పడ్డాడు. కుప్పం ప్రజలకు సైతం బ్రాంచ్ కెనాల్ ద్వారా నీరు ఇస్తున్నామని సెట్టింగ్ వేసి, ఉదయానికి నీరే కాదు.. ఏకంగా కాలువే లేకుండా చేసిన బ్లఫ్ మాస్టర్.
• అందరికీ న్యాయం చేస్తాం
పొత్తులో భాగంగా అందరికీ సీట్లు ఇవ్వడం సాధ్యం కాదు. కాని శ్రీ పవన్ కళ్యాణ్ గారు నేను ఆలోచించింది ఏమిటంటే ఎన్నికల్లో బలంగా పని చేసిన ప్రతి కార్యకర్త, నాయకుడికి తగిన గౌరవం ఇచ్చే బాధ్యతను మేం తీసుకుంటాం. కలిసి అడుగులు వేస్తున్నాం. ఏ పార్టీ ఎక్కువా కాదు… ఎవరూ తక్కువ కాదు. కలిసి, కలివిడిగా పనిచేయాలి. ఈ సైకో పాలనను అంతం చేయాలి. 40 రోజులు విశ్రమించకుండా పనిచేద్దాం. ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ అన్ స్టాపబుల్ కావాలి.’’ అన్నారు.