పేదలకు వైద్య సేవలు అందించడంపై కనీస శ్రద్ధ లేదు

• వైద్య ఆరోగ్య శాఖకు కేటాయించిన రూ.వేల కోట్ల బడ్జెట్ ఏం చేస్తున్నారు?
• ప్రజారోగ్యం కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను ఎటు మళ్లించారో చెప్పాలి

పేద ప్రజలకు సరైన వైద్య సేవలు అందించడంలో వైసీపీ ప్రభుత్వానికి ఒక ప్రణాళికగానీ, శ్రద్ధగానీ లేవని ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గర కనిపిస్తున్న అమానవీయ సంఘటనలే చెబుతున్నాయని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటనలో విమర్శించారు. రుయా ఆసుపత్రిలో ఒక పేద తండ్రి తన బిడ్డ మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లడానికి ఎంత మానసిక క్షోభ అనుభవించాడో కొద్ది రోజుల కిందటే చూశాం. ఇప్పుడు నెల్లూరు జిల్లా సంగం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనూ అలాంటి పరిస్థితినే దారా వెంకటేశ్వర్లు కుటుంబం ఎదుర్కొంది. దారా శ్రీరామ్ అనే బాలుడి మృతదేహాన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి ఇంటికి తరలించేందుకు 108 అంబులెన్స్ గానీ, మహాప్రస్థానం వాహనంగానీ ఏర్పాటు చేయలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. బాధను దిగమింగుకొని ఆ బాలుడి మృతదేహాన్ని బైక్ మీద ఇంటికి తీసుకువెళ్లాల్సి వచ్చింది. సిబిఐ దత్తపుత్రుడయిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు వందల కొద్దీ వాహనాలను విజయవాడ నగరంలో పెరేడ్ మాదిరి పెట్టి జెండా ఊపి ప్రారంభించారు. ఈ వాహన సేవలను ఆయన సన్నిహితుల సంస్థకే అప్పగించిన మాట వాస్తవం కాదా? వాటిని ఏ సేవలకు వినియోగిస్తున్నారు? నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ముదిరాజు అనే వలస కూలీ మృతదేహానికి పోస్టుమార్టం చేయడానికి రూ.15వేలు లంచం తీసుకున్నారు అంటే రాష్ట్రంలో వైద్య సేవలు ఏ రీతిన అందుతున్నాయో అర్థం అవుతోంది. గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో శ్రీ రెడ్డెయ్య అనే మధుమేహ రోగి తీవ్ర అనారోగ్య సమస్యలతో వెళ్తే కనీస వైద్యం చేయకుండా బెడ్ కూడా ఇవ్వకపోవడంతో మండు వేసవిలో ఫుట్ పాత్ మీదే ఉండాల్సి వచ్చింది. ఇవేనా ప్రభుత్వ ఆసుపత్రిలో ఇస్తున్న సేవలు? రాష్ట్ర బడ్జెట్లో వైద్య ఆరోగ్య శాఖకు వేల కోట్లు కేటాయిస్తున్నాం అని ప్రచారం చేసుకొనే ప్రభుత్వం ఆసుపత్రుల్లో కనీస సేవలు కూడా అందించలేకపోతోంది. 2021-22 బడ్జెట్లో రూ.14,088 కోట్లు ప్రతిపాదించి ఆ తరవాత ఆ మొత్తాన్ని రూ.13 వేల కోట్లకు తగ్గించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.15 వేల కోట్లు ప్రతిపాదించారు. వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో చూపించి గారడీ చేస్తున్నారు తప్ప ప్రజలకు మాత్రం వైద్య సేవలు సక్రమంగా ఇవ్వలేకపోతున్నారు. కరోనా మృతులకు పరిహారంగా ఇవ్వాల్సిన రూ.11 వందల కోట్లను ఏం చేశారో సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్న వైసీపీ ప్రభుత్వం కేంద్రం నిధులను ఏం చేసిందో అనే సందేహం ఉంది. కేంద్ర ప్రభుత్వం నేషనల్ రూరల్ హెల్త్ మిషన్, నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ కార్యక్రమాలకు ఇస్తున్న నిధులను ఎటు మళ్లిస్తుందో ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలు కట్టిపెట్టి ప్రజలకు అవసరమైన వైద్యం అందించడం మీద దృష్టి పెట్టాలని నాదెండ్ల మనోహర్ హితవు పలికారు.