తెలంగాణలో లాక్ డౌన్ ఉండబోదు: సీఎస్‌

తెలంగాణలో లాక్ డౌన్ విధింపు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని కంట్రోల్ చేస్తున్నామని కార్యదర్శి సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు. కరోనాపై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారన్న సీఎస్.. ఇతర రాష్ర్టాలతో పోలిస్తే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తెలంగాణలో తక్కువగా ఉందన్నారు. తాత్కాలిక సచివాలయం బీఆర్కే భవన్‌లో సీఎస్ మీడియాతో మాట్లాడారు. రాష్ర్టంలో మందులు, ఆక్సిజన్‌తో పాటు నిత్యావసరాల కొరత లేదు. ప్రస్తుతం 62 వేల ఆక్సిజన్ బెడ్లు ఉన్నాయి. ఇంకా ఆక్సిజన్ బెడ్స్ పెంచాలని సీఎం ఆదేశించారు. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ర్టంలో ఎక్కడా ఆక్సిజన్, బెడ్ల కొరత లేకుండా చూస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని కోవిడ్ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ అడిట్ చేస్తున్నామని పేర్కొన్నారు.

తెలంగాణలో కోవిడ్ బాధితులందరికీ మెరుగైన వైద్యం అందడం వల్లే ఇతర రాష్ర్టాల రోగులు ఇక్కడి వస్తున్నారని సీఎస్ తెలిపారు. ఆస్పత్రుల్లో ఇతర రాష్ర్టాల రోగులే అధికంగా ఉన్నారని వెల్లడించారు. వైద్య సౌకర్యాలు మెరుగుపరిచేందుకు నిరంతరం కృషి చేస్తున్నాం. కరోనా వ్యాప్తి నివారణకు వైద్యారోగ్య సిబ్బంది తీవ్రంగా కష్టపడుతున్నారని తెలిపారు. ఒడిశా నుంచి ఒక ఆక్సిజన్ ట్యాంకర్ రావాలంటే కనీసం ఆరు రోజుల సమయం పడుతోంది. ఎయిర్‌లిఫ్ట్ చేయడం వల్ల మూడు రోజుల సమయం ఆదా అవుతోంది. రాష్ర్టానికి రోజుకు 125 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా సామర్థ్యం ఉందన్నారు. కర్ణాటక, తమిళనాడు నుంచి రావాల్సిన 45 టన్నుల ఆక్సిజన్ రావట్లేదు. ప్రతి జిల్లాలో ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసేందుకు సౌకర్యం కల్పిస్తామన్నారు. కరోనా నియంత్రణకు ఎంత డబ్బు అయినా ఖర్చు చేయడానికైనా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎస్ సోమేశ్ కుమార్ వెల్లడించారు.