ప్రస్టేషన్ తో నియోజకవర్గానికి ప్రతినిధిని అనే విషయం మర్చిపోతున్నారు – శేషుబాబు

కృష్ణాజిల్లా, అవనిగడ్డ నియోజకవర్గం, మోపిదేవి మండలంలో పెన్షన్ పొందటానికి అర్హత గల 328 మందిలో 158 మందికి అర్హత చూపించి 170 మందిని అనర్హులుగా చూపించిన విషయంపై, జరిగిన తప్పిదం గురించి వివరణ ఇవ్వవలసిన నియోజకవర్గ శాసనసభ్యులు తప్పు చేసిన వారిని పక్కన పెట్టి, విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన జర్నలిస్టులపై స్థానిక ఎమ్మెల్యే మాటల దాడి చేయడం, మీడియా మిత్రులపై విరుచుకుపడటం తగదని అవనిగడ్డ మండల జనసేన పార్టీ అధ్యక్షులు గుడివాక శేషుబాబు దుయ్యబట్టారు. ఫైనల్ వెరిఫికేషన్ లో అర్హులుగా చూపించినప్పటికీ, కంప్యూటర్ లో 155 మందిని చనిపోయినట్లుగా చూపిస్తూ పెన్షన్ పొందడానికి అనర్హులుగా గుర్తించడానికి గల కారణాలను, తప్పు ఏ స్థాయిలో జరిగిందో తెలుసుకొని, తప్పు చేసిన వారిపై చర్యలకు సిఫారసు చేస్తూ, సదరు విషయమును ప్రజలకు వివరించాల్సిన శాసనసభ్యులు అసలు తప్పే జరగనట్లు మాట్లాడుతూ, సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు సేకరించి, న్యూస్ పేపర్ లో వార్తలు వ్రాసిన విలేకరుల పై దుర్బాషలడటం ఎంతవరకు కరెక్ట్ అని శేషుబాబు అన్నారు. ఈ విధంగా అర్హులైన వారిని అనర్హులుగా చూపించడం అనేది ఒక్క మోపిదేవి మండలంలోనే కాదని, ఉంగుటూరు మరియు గన్నవరం లాంటి ఇంకా కొన్ని మండలాలలో జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇది ఏ ఒక్క అధికారి కావాలని చేసిన తప్పు కాదని ప్రభుత్వ స్థాయిలో కావాలని చేసిన తప్పిదంగానే భావించాల్సి వస్తుందని, ఈ విషయంలో వివరణ ఇవ్వటంలో స్థానిక శాసనసభ్యులు విఫలమయ్యారని చెప్పారు. ఇప్పటికైనా పూర్తి వివరాలు చెప్పి, చనిపోయినట్లుగా చూపించబడుతున్న 155 మందికి వచ్చేనెల 1వ తేదీ నాటికి పెన్షన్ మంజూరు చేయించి, వారికి అందించి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఫ్రస్టేషన్ లో ఉంటూ నియోజకవర్గ ప్రజలందరికీ ప్రతినిధిని అన్న విషయాన్ని మర్చిపోయి, తన స్థాయిని దిగజార్చుకుంటూ సమస్య లేవనెత్తిన వారిపై మాటల దాడి చేయడం శాసనసభ్యుల వారికి పరిపాటి అయిందని ఇప్పటికీ అయినా తన స్థాయిని గుర్తుకు తెచ్చుకుని సమస్య లేవనెత్తిన వారిపై ఎదురుదాడి చేయకుండా, సమస్య పరిష్కారానికి కృషిచేసి ప్రజల మన్ననలు పొందాలని సూచించారు. జెసిబి మరియు ట్రాక్టర్లతో పట్టపగలు ఎటువంటి అనుమతులు తీసుకోకుండా దక్షిణ చిరువోలులంక గ్రామంలో మట్టి తోలుతూ ప్రజలకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తున్న తమ పార్టీ నేతలు పై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం, స్థానిక అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ చోద్యం చూస్తూ ఉండటం, స్థానిక లంకమ్మ మాన్యం కాలనీలో సిసి రోడ్డుకు ఇరువైపులా గ్రావెల్ తో సైడ్ బెర్మ్స్ వేయాల్సిన చోట పాత ఇంటి పునాదులలోని రాళ్ళు, ప్లాస్టిక్ డబ్బాలతో కూడిన మిగులు మట్టిని తీసుకొచ్చి వేయడం మరియు అధికార పార్టీ ఎంపీటీసీ సమీప బంధువులపై దాడి చేస్తే బాధితులపైనే ఎదురు కేసులు పెట్టడం లాంటి సమస్యలు మీ కళ్ళకు కనపడటం లేదా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుందని ఇలాంటి విషయాలన్నింటినీ నియోజకవర్గ ప్రజలు గుర్తెరిగి వైసిపి పాలనకు చరమగీతం పాడాలని ఆయన పిలుపునిచ్చారు. నియోజక వర్గం లోని వైసీపీ లోని ఇద్దరు పెద్ద నాయకులు తప్పుడు పద్దతులతో, వక్ర మార్గంలో పాలన సాగిస్తూ, ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారని, ద్వితీయ శ్రేణి నాయకత్వం వారిని అనుసరిస్తూ అభాసుపాలు కావద్దని, మీరైనా ప్రజలకు సేవ చేయాలని హితవు పలికారు. స్థానిక ఎమ్మెల్యే తనను పిచ్చి వాడితో పోల్చారని, క్రీస్తు పూర్వం సోక్రటీస్ ను కూడా అప్పటి పాలకులు పిచ్చి వాడిగా ముద్ర వేశారని, కానీ ఈనాటికి కూడా మనం సోక్రటీస్ పేరును గుర్తు పెట్టుకుంటున్నాం అని అలాగే ప్రజల కోసం నేను ఎలాంటి మాటలు పడటానికి అయినా, ఎలాంటి దాడులు ఎదుర్కోవడానికి అయినా సిద్ధంగా ఉన్నానని, కానీ అధికార పార్టీ నాయకులు చేసే తప్పిదాలను ప్రశ్నిస్తూనే ఉంటానని, భయపడి పారిపోనని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బొప్పన భాను, మండల పార్టీ ఉపాధ్యక్షులు బొప్పన పృద్వి, తుంగల నరేష్ లు, ప్రధాన కార్యదర్శిలు బచ్చు శ్రీహరి, మండలి శివ, కోసూరి అవినాష్ తదితరులు పాల్గొన్నారు.