ఏలేరు, సుద్దగడ్డ ఆధునీకరణతోనే వేల ఎకరాలకు ప్రయోజనం

• రైల్వే ఓవర్ బ్రిడ్జి, తాగు నీరు, డంపింగ్ యార్డ్ స్థలాల సమస్యలతో జన సామాన్యం సతమతం
• పిఠాపురం నియోజకవర్గ సమస్యలను జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ కి నివేదించిన
నియోజకవర్గ ఇంఛార్జి శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్

అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన పిఠాపురంతోపాటు ఆ నియోజకవర్గంలో దశాబ్దాలుగా నెలకొన్న సమస్యలు, పెండింగ్ ప్రాజెక్టులపై జనసేన ప్రత్యేక దృష్టి పెడుతుందని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. నియోజకవర్గంలో దశాబ్దాలుగా ప్రజలను వెంటాడుతున్న సమస్యలు, స్థానికంగా ఉన్న పరిస్థితులను పిఠాపురం నియోజకవర్గ జనసేన ఇంఛార్జి శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువచ్చారు. నియోజకవర్గంలో ఉన్న ప్రజా సమస్యలపై నివేదిక అందించారు. వీటిని పరిశీలించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాబోయే జనసేన – తెలుగుదేశం ప్రభుత్వంలో పిఠాపురం నియోజకవర్గ అభ్యున్నతికి ప్రణాళికాబద్ధంగా పని చేస్తామని చెప్పారు. ప్రధానంగా రైతాంగానికి ఎంతో అవసరమైన ఏలేరు రిజర్వాయర్, సుద్ధగడ్డ ఆధునీకరణ పనులకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. పిఠాపురం నియోజకవర్గ రైతులతోపాటు జగ్గంపేట, ప్రత్తిపాడు, పెద్దాపురం నియోజకవర్గాల పరిధిలో ఉన్న 67,500 ఎకరాలకు రిజర్వాయర్ ద్వారా సాగునీరు అందుతోంది. రిజర్వాయర్‌ నిర్మాణం తర్వాత కాలువల ఆధునికీకరణ, సాగునీటి సరఫరా నియంత్రించేందుకు అవసరమైన వ్యవస్థ ఏర్పాటు చేయకపోవడంతో తరచూ వర్షాలు కురిస్తే వరదలు సంభవించి రైతాంగానికి పెద్ద ఎత్తున నష్టం జరుగుతోంది. ఏలేరుతో పాటు సుద్దగడ్డకు సంభవిస్తున్న వరదలతో ప్రతిసారీ భారీ పంట నష్టం జరుగుతోంది. ఈ అంశాలను శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నివేదించారు. పిఠాపురంలోని ఉప్పాడ సెంటర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం అంతుచిక్కని సమస్యగా మారిందని శ్రీ ఉదయ్ శ్రీనివాస్ శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొచ్చారు. నియోజకవర్గంలోని పిఠాపురం మున్సిపాలిటీ, గొల్లప్రోలు నగర పంచాయతీలో డంపింగ్ యార్డుల సమస్య తీవ్రంగా ఉందని శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తెలిపారు. నియోజకవర్గంలో తీవ్రంగా తాగునీటి సమస్య ఉందని చెప్పారు. పిఠాపురం బ్రాంచ్ కెనాల్ విస్తరణ, కాలువల ఏర్పాటుపైనా, శాంతిభద్రతల పరిరక్షణ, ప్రభుత్వ ఆస్పత్రులలో అత్యాధునిక పరికరాల ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ‘‘పిఠాపురంలో వారాహి విజయ యాత్ర సమయంలో నియోజకవర్గానికి సంబంధించి చాలా సమస్యలు నా దృష్టికి వచ్చాయి. వాటిని ప్రణాళికాబద్ధంగా తీర్చే బాధ్యతను జనసేన తీసుకుంటుంది’’ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *