వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు: గురాన అయ్యలు

  • జనసేన నేత గురాన అయ్యలు

విజయనగరం: రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి కనువిప్పు కలిగేలా యువగళం నవశకం విజయోత్సవ సభ విజయవంతం కావడంతో వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని జనసేన నేత గురాన అయ్యలు అన్నారు. శుక్రవారం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అయ్యలు మాట్లాడుతూ.. యువగళం ముగింపు సభ జగన్‌ పాలనకు చరమగీతం పాడిందన్నారు. టీడీపీ-జనసేన కూటమికి అధికారం ఇచ్చేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. వైసీపీ పాలనపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని చెప్పడానికి పోలిపల్లి సభ విజయవంతమే సాక్ష్యమన్నారు.
టీడీపీ జనసేన పొత్తు ప్రకటన నుంచి వైసీపీ నేతలకు నిద్రపట్టడం లేదన్నారు. యువగళం నవశకం సభలో నేతలు మాట్లాడిన అంశాలను వైకాపా ప్రజాప్రతినిధులు తెలుసుకోవాలని, అవగాహన లేకుండా ఏదంటే అది మాట్లాడొద్దని హితవు పలికారు. ప్రజలు కట్టిన పన్నుల సొమ్ముతో విజయనగరం పట్టణంలో సుందరీకరణ పేరుతో జిమ్మిక్కులు చేస్తున్న ఎమ్మెల్యే కోలగట్ల.. గ్రామాల్లో ఎందుకు అభివృద్ధి పనులు గురించి మాట్లాడటం లేదని ప్రశ్నించారు. విజయనగరం నియోజకవర్గ అభివృద్ధికి వైకాపా పాలనలో రాష్ట ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు తీసుకువచ్చారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విజయనగరం పట్టణ పరిధిలో వైఎస్ఆర్ నగర్ లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని మండిపడ్డారు. సుమారు 2500 నివాస గృహాలను కలిగి ఉన్న వైఎస్ఆర్ నగర్ లో కాలువలు, రోడ్లతోపాటు రక్షిత మంచి నీటి కోసం ట్యాంకు నిర్మించకపోవడం సిగ్గుచేటు అన్నారు. అలాగే జగన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ్యమంత్రి ఫ్లెక్సీలను విద్యార్థులే స్వయంగా తయారుచేసి ప్రదర్శించాలని ఆదేశాలివ్వడం సిగ్గుచేటు అన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించే జగన్ ప్రతిసారీ మాట్లాడుతున్నారని తప్పుబట్టారు. పవన్ విడాకులు తీసుకొని పెళ్లి చేసుకుంటే జగన్ కు వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. జగన్ కుటుంబంలో జరిగిన
పెళ్లిళ్లు గురించి, వైకాపా ప్రజాప్రతినిధుల పెళ్లిళ్ళు గురించి ఎందుకు నోరిప్పరని ప్రశ్నించారు. సైకో జగన్ రెడ్డికి కౌంట్ డౌన్ మొదలైందని, రానున్న ఎన్నికల్లో జనసేన టీడీపీ ప్రభుత్వమే వస్తుందని, ప్రజలకు ఆమోదయోగ్య పాలన అదింస్తుందన్నారు.