రేపు టీఎస్ ఎంసెట్ ఇంజనీరింగ్ ఫలితాలు.. పూర్తి వివరాలు!
తెలంగాణ ఎంసెట్ ఇంజినీరింగ్ ఫలితాలను రేపు విడుదల చేస్తున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఉదయం 11 గంటలకు ఫలితాలను ప్రకటిస్తామని ఆమె వెల్లడించారు. ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాల కోసం తొలి విడత కౌన్సిలింగ్ ప్రక్రియ ఈ నెల 30న ప్రారంభం కానుంది.
ఈ నెల 30 నుంచి సెప్టెంబర్ 9 వరకు ఆన్ లైన్ లో ఫీజు చెల్లించి ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 4 నుంచి 11 వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. సెప్టెంబర్ 4 నుంచి 13వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఉంటుంది. సెప్టెంబర్ 15న ఇంజినీరింగ్ తొలి విడత సీట్లను కేటాయిస్తారు. సెప్టెంబర్ 15వ తేదీ నుంచి 20 వరకు విద్యార్థులు ఆన్ లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. రెండో విడత కౌన్సిలింగ్ తేదీలను త్వరలోనే ప్రకటించనున్నారు.