శ్రీ జగన్ రెడ్డి ఏలుబడిలో అన్ని రంగాలూ కుదేలు

• రామచంద్రపురం నియోజకవర్గ జనసేన క్రియాశీలక సభ్యుల సమావేశంలో శ్రీ నాదెండ్ల మనోహర్

శ్రీ జగన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా విఫలమైంది.. పరిపాలన దక్షత లేని ఈ ముఖ్యమంత్రి ఏలుబడిలో ప్రజలు కష్టనష్టాలు చవిచూస్తున్నారని, అన్ని రంగాలు కుదేలైపోయాయని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అన్నారు. గతంలో ముఖ్యమంత్రులు సభ నిర్వహిస్తే మహిళలు స్వచ్ఛందంగా వచ్చేవారు ఇప్పుడు మాత్రం ముఖ్యమంత్రి వేలమంది పోలీసుల రక్షణతో సభ పెట్టుకోవాల్సిన దుస్థితి నెలకొందని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో నియోజకవర్గ క్రియాశీలక సభ్యుల సమావేశంలో శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పాల్గొన్నారు. ఈ సభకు ముందు నియోజకవర్గంలోని ఏరుపల్లి గ్రామానికి వెళ్ళి క్రియాశీలక సభ్యుడు శ్రీ అబ్బిరెడ్డి వీరబాబు కుటుంబాన్ని పరామర్శించారు. శ్రీ వీరబాబు ఇటీవల ప్రమాదంలో మరణించారు. ఆయన కుటుంబానికి రూ.5లక్ష ప్రమాద బీమా చెక్కును అందించారు. సభలో శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ప్రసంగిస్తూ “అన్నపూర్ణలాంటి ఈ జిల్లాలో పంట నష్టం జరిగితే రైతులను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ప్రభుత్వ అధికారులు రైతులను రైతు భరోసా కేంద్రం వద్దకు రమ్మని అంటున్నారు కానీ అవి భరోసా ఇచ్చే కేంద్రాలు కావు. అభద్రత భావం కలిగించే కేంద్రాలుగా మారాయి. రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వకుండా కాలయాపన చేస్తూ, కష్టాల్లో ఉన్నవారి నుంచే రకరకాల ఫీజులు, పెనాల్టీలు వసూలు చేస్తున్నారు. రాష్ట్రంలో రైతులు అవమానాలు ఎదుర్కొంటుంటే, మహిళలు అభద్రతాభావంతో, యువకులు నిస్సహాయ స్థితిలో బతుకుతున్నారు. రూ.ఆరు లక్షల కోట్ల అప్పులు తెచ్చినప్పటికీ రోడ్లు బాగు చేయలేదు. యువతకు ఉపాధి కల్పించలేదు. వరదల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోతే వన్ టైం సెటిల్మెంట్ పేరుతో పదివేలు కట్టమని వాలంటీర్ల ద్వారా బెదిరింపులకు దిగడం దుర్మార్గం. ఇలాంటి అస్థవ్యస్థ పాలనను చూసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.

• ఉచిత ఇసుక విధానం జనసేన ఉద్దేశం

ఇసుక కొరత సృష్టించింది ఈ ప్రభుత్వమే. ఒక ట్రక్కు ఇసుక రూ.70 వేలకు అమ్ముతున్నారు. సామాన్యునికి అందుబాటులో లేకుండా చేశారు. కేవలం ఇసుక మాఫియాను రక్షించేందుకు మాత్రమే ఇలాంటి కుయుక్తులకు రాష్ట్ర ప్రభుత్వం పాల్పడుతోంది. మన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తే పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వం తరఫున ఉచితంగా ఇసుక సరఫరా చేస్తాం. కరోనా కష్టకాలంలో ప్రభుత్వ అధికారులు కాదు కదా కనీసం అధికార పార్టీ కార్యకర్తలు కూడా వచ్చి ప్రజలను ఆదుకోలేదు. ఆ సమయంలో జన సైనికులు తమ ప్రాణాలకు తెగించి ప్రజలను ఆదుకున్నారు. తమ సొంత ఖర్చులతో నిత్యావసరాలు ఇవ్వడమే కాదు.. ఆర్థిక సహకారం చేశారు. అంకితభావంతో నిజాయితీగా పనిచేసే జనసైనికుల శ్రమను గుర్తించి వారికి సముచిత స్థానం కల్పిస్తాం. రాష్ట్ర ప్రజలు రెండు పార్టీల పాలనతో విసుగు చెందారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి భావజాలం పట్ల ఆకర్షితులై జనసేనకు పట్టం కట్టేందుకు ముందుకు వస్తున్నారు. ఇటీవల ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో జనసేన పార్టీ గట్టి పోటీ ఇచ్చింది. పెద్ద సంఖ్యలో పార్టీ అభ్యర్థులు గెలుపొందడమే అందుకు తార్కాణం. ఈ అవకాశాన్ని జనసైనికులు సద్వినియోగం చేసుకుని రాబోవు రోజుల్లో మరింతగా బలపడాలి” అన్నారు. రామచంద్రపురం నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శ్రీ కందుల దుర్గేష్, పి.ఏ.సి.సభ్యులు శ్రీ పంతం నానాజీ, శ్రీ ముత్తా శశిధర్, శ్రీ పితాని బాలకృష్ణ, పార్టీ నేతలు శ్రీ తుమ్మల బాబు, శ్రీ వరుపుల తమ్మయ్య బాబు, శ్రీమతి మాకినీడు శేషుకుమారి, శ్రీ మర్రెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.