జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా అధ్యక్షులుగా వంగల దాలి నాయుడు

పార్వతీపురం: జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్.హెచ్.ఆర్.సి) పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షులుగా వంగల దాలి నాయుడు నియమింపబడ్డారు. విశాఖపట్నం ప్రేమ సమాజంలో ఆదివారం అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవంలో భాగంగా జాతీయ మానవ హక్కుల కమిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రెసిడెంట్, జాతీయ వైస్ ప్రెసిడెంట్ కదిరి రాము ఆధ్వర్యంలో రాష్ట్ర మానవ హక్కుల కమిటీ సెమినార్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్వతీపురానికి చెందిన వంగల దాలి నాయుడును పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షులుగా నియమించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ మానవ హక్కుల కమిటీ ఉద్దేశం ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలన్నారు. అలాగే భావితరాలకు మానవ హక్కులు, వాటికి భంగం కలిగేటప్పుడు తీసుకోవలసిన చర్యలు తదితరు వాటిపై అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో ఏ విషయంలోనైనా మానవ హక్కులకు భంగం కలిగితే వారి వెంట నిలబడి వారికి న్యాయం చేయాలన్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు వంగల దాలినాయుడు మాట్లాడుతూ జాతీయ మానవ హక్కుల కమిటీ తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానన్నారు. పోరాటంతోనే హక్కుల సాధన సాధ్యమన్నారు. మానవ హక్కుల పై ప్రజలకు, యువత, మహిళలు, విద్యార్థులకు చైతన్యం చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాలకు చెందిన జాతీయ మానవ హక్కుల కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.