రాజకీయ లబ్ధి కోసమే వాలంటీర్ వ్యవస్థ

* వాలంటీర్లు మా పార్టీ కార్యకర్తలే అని వైసీపీ నాయకులే చెప్పారు
* లబ్ధిదారులు కానివాళ్ల సమాచారం కూడా ఎందుకు సేకరిస్తున్నారు?
* డేటా ఎక్కడికి వెళ్తుందని అడిగితే ఇంత అలజడి ఎందుకు?
* తాడేపల్లిగూడెం మీడియా సమావేశంలో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థలను ఏర్పాటు చేసిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పేర్కొన్నారు. వాలంటీర్లు సేకరిస్తున్న సమాచారం ఎవరి చేతికి వెళ్తుందని అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తే వైసీపీ నాయకుల్లో ఎందుకింత అలజడి అని నిలదీశారు. సంక్షేమ పథకాలు అందని ఇళ్లకు కూడా వెళ్లి వాలంటీర్లు ఎందుకు సమాచారం సేకరిస్తున్నారో సమాధానం ఇవ్వాలన్నారు. బుధవారం తాడేపల్లిగూడెంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “తాము సేకరిస్తున్న సమాచారం ఎక్కడికి వెళ్తుందో? ఏ సర్వర్ లో నిక్షిప్తం అవుతుందో? ఎవరి చేతుల్లోకి చేరుతుందో వాలంటీర్లకయినా తెలుసా? సంక్షేమ పథకాలు అందని కుటుంబాల ఇళ్లకు వెళ్లి వివరాలు ఎందుకు తీసుకుంటున్నారు? చిన్న పిల్లలు, పెద్దలు, మహిళల ఫోటోలు తీసుకుంటున్నారు. అడిగితే గ్యాస్ కనెక్షన్, రేషన్ కార్డు ఇంకేదో ఇంకేదో అని మాటలు చెబుతున్నారు. వ్యక్తిగత సమాచారం తీసుకునే హక్కు వాళ్లకెవరు ఇచ్చారు. వాలంటీర్లు నిజంగా ప్రభుత్వం నుంచి రిప్రజెంట్ చేస్తుంటే.. మేం లేవనెత్తిన సందేహాలపై ప్రభుత్వ అధికారులు ఎందుకు మాట్లాడటం లేదు? కేవలం వైసీపీ నాయకులే ఎందుకు స్పందిస్తున్నారు? అంటే వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలే కదా? వైసీపీ పార్టీ కోసం పని చేస్తున్నట్లే కదా? ఈ విషయాన్ని వైసీపీ నాయకులే చెప్పుకొంటున్నారు. జనవాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదుల అనంతరం దీనిపై చాలా లోతుగా అధ్యయనo చేసిన తరువాతే శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ పాలసీల్లో ఉన్న లొసుగుల గురించి మాట్లాడుతుంటే దానికి సమాధానం చెప్పలేని వైసీపీ నాయకులు ఆయన్ను వ్యక్తిగతంగా దూషిస్తున్నారు. చాలా సందర్భాల్లో వైసీపీ నాయకులు బహిరంగంగానే చెప్పారు. వాలంటీర్లు మా పార్టీ కార్యకర్తలే. మనం నియమించిన వారేనని. దానిని ప్రశ్నిస్తే ఇంత అలజడి ఎందుకు? శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది మన భవిష్యత్తు, మన భద్రత కోసమే. శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై వ్యక్తిగత విమర్శలు మానుకొని, వ్యక్తిగత సమాచారం సేకరించడానికి వాలంటీర్లకు ఉన్న అర్హత ఏమింటో ప్రభుత్వ అధికారులు సమాధానం చెప్పాలి.
* వారాహి విజయ యాత్రకు బహ్మరథం
వారాహి విజయయాత్ర దిగ్విజయంగా జరుగుతోంది. ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. ప్రభుత్వ అరాచక పాలనతో విసిగిపోయిన ప్రజలు.. మార్పు రావాలనే ఆకాంక్షతో యాత్రకు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు తాడేపల్లిగూడెంలో జరగనున్న బహిరంగ సభలో అనేక విషయాలపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. స్థానిక సమస్యలు, ప్రజాప్రతినిధుల అవినీతిపై అనేక అర్జీలు వచ్చాయి. వాటితో పాటు వాలంటీర్ వ్యవస్థ సేకరిస్తున్న వ్యక్తిగత డేటాపై ప్రజలకు అర్ధమయ్యే విధంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు” అని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ బొలిశెట్టి సత్యనారాయణ, తాడేపల్లిగూడెం నియోజవర్గ ఇంఛార్జ్ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు శ్రీ కొటికలపూడి గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.