ప్రజా సమస్యలు పరిష్కరించలేని అధికారం ఎందుకు?
* ప్రజలను నేరుగా కలిస్తే వారి వద్దే పరిష్కారాలు లభిస్తాయి
* అధికారం లేకున్నా సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాం
* ప్రతి సమస్యను అనుశీలన చేస్తాం
* ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతాం
* మా దగ్గరకు రాలేక పోయిన బాధితుల వద్దకే మేమే వెళ్తాం
** విజయవాడ లో ‘జనవాణి – జనసేన భరోసా’ కార్యక్రమాన్ని ప్రారంభించిన శ్రీ పవన్ కళ్యాణ్
ఒక సామాజిక సమస్య పరిష్కారం కావాలంటే ఏదో చేయనక్కర్లేదు.. ప్రజల వద్దకు స్వయంగా వెళ్లి సమస్యను తెలుసుకుంటే పరిష్కారం కూడా ప్రజల వద్దనే ఉంటుంది. మానవతా దృక్పథంతో వారు చెప్పింది వింటే కచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. ఎన్ని పబ్లిక్ పాలసీలు, ఎన్ని పథకాలు ఉన్నప్పటికీ సాధారణ ప్రజా సమస్యలు తీర్చని పాలన వృధా అని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన “జనవాణి – జనసేన భరోసా” కార్యక్రమాన్ని ఆదివారం ఆయన విజయవాడలోని మాకినేని బసవ పున్నయ్య ఆడిటోరియంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి కానీ ఏవీ పరిష్కారం కావడం లేదు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లే వారిపై కక్ష కడుతున్నారు. ఈ క్రమంలో సమస్యలను ఓ ప్రత్యేక పద్ధతిలో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు, ఏ సమస్యను ఆ శాఖకు ప్రత్యేకంగా తీసుకువెళ్లి పరిష్కరించేందుకు ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. సమస్య ఏమిటి? ఎందుకు? ఎలా? అనేది పూర్తిగా తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాం. సమస్య వేగవంతంగా పరిష్కారం అయ్యేందుకు జనసేన పార్టీ తరఫున ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతాం.
*ఆ పుస్తకమే ఓ దిక్సూచి
ప్రజల సమస్యలను తెలుసుకుంటున్న క్రమంలో, ఒక సినిమా హీరోగా కొన్ని సమస్యలను పరిష్కరించలేని సమయంలో ఓ లాయర్ మిత్రుడితో మాట్లాడుతున్నపుడు.. నా భావాలను పంచుకున్నప్పుడు నాకు ఓ పుస్తకం బహూకరించాడు. పెరువియన్ ఆర్థికవేత్త హార్నాండో – డీ సోటో రాసిన “ది అథెర్ పాత్ ” పుస్తకం ఇచ్చాడు. పెరూ దేశానికి ఒక సందర్భంలో జపాన్ సంతతి వ్యక్తి ఫిజీ మోరా ప్రెసిడెంట్ గా ఎన్నికవుతారు. అయితే అప్పటికే పెరూ దేశం తీవ్రవాదంతో నిండిపోయింది. అభివృద్ధి కొందరికే అన్నట్లు పూర్తిగా వ్యవస్థలన్నీ కుంటుపడ్డాయి. యువత తీవ్రవాదం వైపు మొగ్గుచూపుతున్న సమయంలో ప్రెసిడెంట్ ఫిజిమోరా ఆర్థికవేత్త హార్నాండో – డీ సోటో ను సమస్యల పరిష్కారానికి దారి చూపాలని అడుగుతారు. దేశంలో ఇంత మంచి పాలసీలు, నిబంధనలు ఉన్నా ప్రజల సమస్యలు ఎందుకు పరిష్కారం కావడం లేదని, దీనికి పరిష్కారం చూపాలని కోరతాడు. దీనికి ఆర్థిక వేత్త డీ సోటో చెప్పే ఏకైక పరిష్కారం ప్రెసిడెంట్ ను ప్రత్యక్షంగా ప్రజలను కలుసుకోమని చెబుతారు. ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకోవడం వల్ల ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి. వారి వేదన విన్నప్పుడు, కన్నీటిని తుడిచినప్పుడు వారికి కొండంత సాంత్వన కలుగుతుంది. అప్పుడే ప్రజా సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కారం అవుతాయి అని వివరిస్తారు. అప్పట్లో ఇలాంటి భావాలతోనే కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్సును నెలకొల్పాను. ఇప్పుడు జనసేన నిర్వహిస్తున్న జనవాణి – జనసేన భరోసా కార్యక్రమానికి అదే మూల కారణం. ప్రజలతో నేరుగా మాట్లాడినప్పుడు కచ్చితంగా ఏ సమస్యకైనా ఒక పరిష్కారం లభిస్తుంది. సమస్య చెప్పే క్రమంలో బాధితుల వేదన కచ్చితంగా ఎదుట వారిని కదిలిస్తుంది. మాకు అధికారం లేకపోయినా ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాం. మా దృష్టికి వచ్చిన సమస్యలను ఓ ప్రణాళిక ప్రకారం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి, వాటిని పరిష్కరించేలా ఒత్తిడి పెంచుతాం. మాజీ ఐఏఎస్ అధికారి, జనసేన నాయకులు శ్రీ వరప్రసాద్ ఆధ్వర్యంలో సమస్యల అనుశీలన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తాం.
*ఆ ఆడపడుచు వేదన ఆలోచింప చేసింది
ముఖ్యమంత్రి ఇంటి భద్రత కోసం తాడేపల్లిలో 40 ఏళ్లుగా నివాసం ఉంటున్న గృహాలను కూల్చేశారు. సరైన పరిహారం ఇవ్వలేదు. అప్పటికప్పుడు ఇళ్లను తొలగించడంతో ఇదేం తీరు అని అడిగిన ఓ సచివాలయ ఉద్యోగిని కుటుంబాన్ని రోడ్డు మీదకు తెచ్చారు. ఆ ఆడపడుచు సోదరుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందితే కనీసం ఎవరూ పట్టించుకోలేదు. ఆ సోదరి నా దగ్గరకు వచ్చి మాట్లాడితే కదిలిపోయాను. ప్రభుత్వంలో సచివాలయ ఉద్యోగిగా పనిచేస్తున్న ఆమెకు జరిగిన అన్యాయాన్నే ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. సొంత అన్నయ్య కనిపించకుండా మాయమై, శవంగా మారితే కనీసం దానిమీద పోస్టుమార్టం కూడా జరిపించలేదు. ఇలాంటి వేదనలు ఎన్నో వినాలని, ఇంకెన్నో సమస్యలు ఉన్నాయని భావించడం వల్లనే ఈ జనవాణి కార్యక్రమం మొదలుపెట్టాం. ప్రజల వద్ద నుంచి వచ్చిన అన్ని సమస్యలను కచ్చితంగా వింటాం. ఆ సమస్యల పరిష్కారానికి కార్యాచరణ రూపొందిస్తాం. వాటిని ఎందుకు పరిష్కరించడం లేదో.. ప్రభుత్వం నుంచి వివరణ తీసుకుంటాం.
*ప్రభుత్వం తలచుకుంటే కాదా?
జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు శాసన సభాపతిగా ఉన్న సమయంలో మొత్తం మూడు వేల అర్జీలను స్వీకరించారు. వాటిని 21 రోజుల్లోపు కచ్చితంగా పరిష్కరించేలా చూసారు. పరిష్కారం కాని సమస్య ఏదైనా ఉంటే బాధితులకు ప్రత్యేకంగా తెలియజేశారు. ఎందుకు పరిష్కారం కాలేదో కూడా వారికి చెప్పారు. మరి ప్రభుత్వం తలుచుకుంటే ఎన్ని సమస్యలు పరిష్కరించాలి? సమస్యల మీద ఎందుకు అంత అలసత్వం? ప్రజా సమస్యలు పరిష్కరించలేని ప్రభుత్వం ఎందుకు? కచ్చితంగా జనసేన పార్టీ దీని మీద దృష్టి పెడుతుంది. మా దగ్గరకు రాని ప్రజల వద్దకు మేమే వెళ్తాం. జనసేన నాయకులకు, నియోజకవర్గ ఇన్చార్జిలకు సైతం ప్రజల సమస్యలు స్వీకరించేలా త్వరలోనే తగిన సూచనలు ఇస్తాం ” అని శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలిపారు.
*మూడేళ్లుగా సీఎం సామాన్యుడిని పట్టించుకోలేదు : శ్రీ నాదెండ్ల మనోహర్
జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ… “సామాన్యుడికి అండగా ఉండి, వారి సమస్యలు విని పరిష్కారం చూపాలనే సదుద్దేశంతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనవాణి కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్యమంత్రి మూడేళ్లుగా పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి దృష్టికి సమస్యలను తీసుకెళ్లాలని ప్రయత్నించి విఫలమైన సామాన్యుల నుంచి శ్రీ పవన్ కళ్యాణ్ గారు వినతులు స్వీకరించి… విశ్రాంత ఐఏఎస్ అధికారి శ్రీ వరప్రసాద్ గారి ఆధ్వర్యంలో రేపు 32 ప్రభుత్వ శాఖలకు పంపిస్తారు. వారం, పది రోజుల్లో సమస్యలు పరిష్కారమయ్యే విధంగా పార్టీ తరఫున కృషి చేస్తాం. ఇదే నెల 10వ తేదీన ఇక్కడే ఈ కార్యక్రమం మళ్లీ నిర్వహిస్తాం. అలాగే ఉత్తరాంధ్రలో ఒక ప్రాంతంలో.. రాయలసీమలో ఒక చోట.. ఉభయగోదావరి జిల్లాలో ఒక ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని” అన్నారు.