మలేరియా రహిత మన్యం జిల్లా కావాలి…!

  • దోమల నివారణ మందులు గ్రామాలతో పాటు పట్టణ మురికివాడలో సైతం పిచికారి చేయాలి
  • మలేరియా మందులు సరిపడా అందుబాటులో ఉంచాలి
  • దోమతెరలు పంపిణీ చేయాలి
  • డెంగ్యూ జ్వరాల పట్ల అధికార యంత్రాంగం అప్రమత్తమవ్వాలి
  • వసతి గృహాల విద్యార్థుల ఆరోగ్యం పట్ల ముందస్తు చర్యలు చేపట్టాలి
  • జనసేన పార్టీ నాయకులు డిమాండ్

పార్వతీపురం: మలేరియా రహిత జిల్లా కావాలని జనసేన పార్టీ నాయకులు కోరారు. శనివారం జనసేన పార్టీ జిల్లా నాయకులు వంగల దాలి నాయుడు, అన్నాబత్తుల దుర్గాప్రసాద్, కొల్లి వెంకటరావు తదితరులు పార్వతీపురంలో విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటికే పార్వతీపురం మన్యం జిల్లాలో రోగాల సీజన్ ఆరంభమయిందన్నారు. వర్షాలు కురవడంతో దోమల విజృంభణ ఆరంభం అయిందన్నారు. దీనిలో భాగంగా మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, వైరల్ జ్వరాలు జిల్లాలో అక్కడక్కడ నమోదు అవుతున్నాయన్నారు. కాబట్టి జిల్లా యంత్రాంగం తక్షణమే అప్రమత్తమై దోమల నివారణకు అవసరమయ్యే ఎబేట్, ఏసీఎం ఐదు శాతం తదితర వాటిని గ్రామాలతో పాటు పట్టణ మురికివాడల్లో ఇంటింటికి పిచికారి చేయాలన్నారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు . అలాగే మలేరియా జ్వరాలకు సరిపడా మందులు అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉంచాలన్నారు. దోమతెరలు పంపిణీ చేసి వాటి వినియోగంపై అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలో ఉన్న విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలన్నారు. అలాగే జిల్లాలో పారిశుద్ధ్య పనులు చేపట్టి ప్రజలకు మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, పచ్చకామెర్లు, వైరల్ జ్వరాల పట్ల అప్రమత్తం చేయాలన్నారు. జిల్లాలో జ్వరాలతో మృతి చెందే వారి సంఖ్య తగ్గుముఖం పట్టేలా చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలన్నారు. మలేరియా జ్వరాలకు ప్రజలు ఆర్థికంగా ఆరోగ్యపరంగా నష్టపోతున్నారన్నారు. జిల్లా ఆస్పత్రిలో డెంగ్యూ జ్వరాలకు చికిత్స కోసం అందించేందుకు చర్యలు చేపట్టాలని జనసేన పార్టీ నాయకులు కోరారు.