పేదోడికి భరోసా కల్పిస్తాం

* సమస్యలు వేగంగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాం
* 17 వ తేదీన భీమవరంలో జనవాణి
* విజయవాడలో రెండో విడత జనవాణి – జనసేన భరోసా ప్రారంభ కార్యక్రమంలో నాదెండ్ల మనోహర్

పవన్ కళ్యాణ్ గారికి తమ బాధ చెప్పుకుంటే తీరుతుంది అనే భరోసా సాధారణ ప్రజలకు ఉందని, దీనిని కచ్చితంగా నిలబెట్టుకునేలా పార్టీ శ్రేణులు పని చేస్తాయని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. గత వారం వచ్చిన అన్ని ఫిర్యాదులు ఆయా శాఖలకు పంపి, అవి పరిష్కారం అయ్యేలా ఇప్పటికే పని మొదలు పెట్టామని చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా సమస్యల్లో ఉన్న వాడిలో పోరాడాలనే ధైర్యం, భరోసా నింపామన్నారు. రెండో విడత జనవాణి – జనసేన భరోసా కార్యక్రమం విజయవాడ లోని మాకినేని బసవ పున్నయ్య ఆడిటోరియంలో ఆదివారం మొదలయింది. కార్యక్రమ ప్రారంభం సందర్బంగా శ్రీ మనోహర్ గారు మాట్లాడుతూ “గత వారం సుమారు 150 ఫిర్యాదులు మిగిలిపోయాయి. వాటితో పాటు ఈ ఆదివారం ఉదయం నుంచే భారీగా బాధితులు తమ సమస్యలు చెప్పుకునేందుకు వచ్చారు. పేర్లు నమోదు చేసుకున్నారు. ఇప్పటికే గత వారం వచ్చిన సమస్యలపై ఆయా శాఖలకు ఉత్తరాలు రాసి, సమస్యలు పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకున్నాం. దీనికి సంబంధించిన అక్నాలెడ్జిమెంట్లను బుధవారం అందిస్తాం. వాటిని బాధితులకు వాట్సాప్ ద్వారా పంపుతాం. గత వారం 213 అర్జీలు విజయవాడ నగరం నుంచి వచ్చాయి. మిగిలిన ప్రాంతాల నుంచి సైతం వచ్చిన ఫిర్యాదులను ఆయా జిల్లాల్లోని శాఖల అధికారులకు పంపించాం. అవి పూర్తిస్థాయిలో పరిష్కరించేలా గట్టి కృషి జరుగుతుంది. గత వారం కొన్ని సమస్యలు సహాయం అర్ధిస్తూ వచ్చాయి. ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకుండా, కనీసం సీఎం సహాయ నిధి సొమ్ములు సైతం రాకుండా తిరిగి తిరిగి విసిగిపోయిన వారు వచ్చారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు తనకున్న పరిమిత వనరుల్లో సహాయం కోసం వచ్చిన కొందరికి అయినా చేతనైన సహాయం చేయాలని తలచారు. జనవాణి అనంతరం ఈ కార్యక్రమం ఉంటుంది.
*17న భీమవరంలో జనవాణి – జనసేన భరోసా కార్యక్రమం
ఉభయ గోదావరి జిల్లాల్లో జనవాణి కార్యక్రమం నిర్వహణలో భాగంగా వచ్చే 17 వ తేదీ ఆదివారం భీమవరంలో ప్రజా ఫిర్యాదుల సేకరణ కార్యక్రమం ఉంటుంది. దీనిని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు వినియోగించుకోవాలి. సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం అయ్యేలా ప్రత్యేక యంత్రాంగం గట్టిగా కృషి చేస్తుందని నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు.