చేనేత కుటుంబాలకు అండగా నిలబడాలి

సునిశితమైన హస్త కళలకు పుట్టినిల్లు భారతదేశం. అటువంటి కళలలో ముఖ్యమైనది చేనేత కళ. అగ్గి పెట్టెలో పట్టే చీరను మన నేత కళాకారులు రూపొందిస్తే, ఆ గొప్పతనం చూసి ప్రపంచం అబ్బురపడింది. నేడు ‘చేనేత దినోత్సవం’ జరుపుకొంటున్న శుభ తరుణంలో నా తరఫున, పార్టీ తరపున ఈ రంగంలో ఉన్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నానంటూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు . ఆధునిక కాలంలో కాస్తంత మసకబారిన ఈ చేనేత కళకు పూర్వ వైభవం తీసుకురావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ప్రజలు సైతం తమ వంతు కృషి చేయాలి. ప్రజలంతా విధిగా వారంలో ఒక రోజైనా చేనేత వస్త్రాలను ధరించాలి. ఘన చారిత్రక నేపథ్యం కలిగిన చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా నన్ను నేను అంకితం చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ కళనే నమ్ముకుని, ఈ కళను సజీవంగా నిలుపుతూ జీవిస్తున్న చేనేత కుటుంబాలకు ప్రభుత్వాలు ఎల్లవేళలా అండగా నిలబడాలని కోరుతున్నానని జనసేనాని పేర్కొన్నారు.