ఎక్కడండీ మెగా డీఎస్సీ?

* ఊరించి ఉసూరుమనిపించిన ‘జగనన్న’
* మాటలు కోటలు దాటినా కాళ్లు గడప దాటని వైనం

నిరుద్యోగుల ఆశలు ఆవిరవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో మెగా డీఎస్సీ కథ ముగిసినట్లే అనిపిస్తోంది! ‘ నేను ఉన్నా, మీ మొర విన్నా’ అంటూ నాటి ప్రతిపక్ష నాయకుడిగా జగన్ రాష్ట్ర యువతలో ఆశలు రేకెత్తించారు. ‘మమ్మల్ని అధికారంలోకి రానివ్వండి. మొత్తం 23,000 ఉపాధ్యాయ ఖాళీలనూ భర్తీ చేస్తాం’ అని లెక్క తేల్చి మరీ చెప్పారు. జిల్లాలవారీ ఎంపిక సంఘాల (డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీలు – డీఎస్సీ) ఏర్పాటు చేసి ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తామన్నారు. అదే జరుగుతుందని ఆశించిన యువతీ యువకులకు ఈ మూడున్నర సంవత్సరాలూ ఎదురుచూపులే మిగిలాయి. ఆయన ప్రభుత్వ పదవీకాలం మరో ఏడాదిన్నరలో ముగిసిపోతుంది. ఇంతకాలమూ 23 వేలు కాదుకదా, వాటిల్లో ఒక్కటంటే ఒక్క పోస్టును కూడా భర్తీ చేయలేదు. నిజానికి 2020 జనవరిలోనే మెగా డీఎస్సీ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఆ మేరకు అప్పట్లోనే ప్రకటించిన నాటి విద్యా మంత్రి ఆదిమూలపు సురేష్…. ‘నిరుద్యోగులకు బంపర్ ఛాన్స్’ అని శాసనసభాముఖంగా మరిన్ని ఆశలు రేకెత్తించారు. ఇది 2023 జనవరి. ఈ నెల కూడా కొద్దిరోజుల్లో ముగిసిపోతోంది. ఏదీ మెగా డీఎస్సీ? ఎక్కడ నోటిఫికేషన్?
* సర్దుబాట్ల తతంగం
వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల నియామకానికి అనువుగా డీఎస్సీలను ఏర్పాటు చేస్తుంటారు. ఎంపిక పరీక్షలు నిర్వహించి, పోస్టుల భర్తీ జరుపుతుంటారు. రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత ఇది. ‘ సాదాసీదా కాదు, ఏకంగా అతి పెద్ద (మెగా) డీఎస్సీ’ అనేది నాడు జగన్ హామీ. ఏపీ పాఠశాల విద్యాశాఖ నిర్వహణలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 62,000 పైగా ఉన్నాయి. వాటిల్లో దాదాపు 70 లక్షల మంది పిల్లలు చదువుకుంటున్నారు. ఉన్న ఉపాధ్యాయుల సంఖ్య 2, 86,000 కు పైమాటే. ఎన్నికలకు ముందు లెక్కల ప్రకారం భర్తీ కావాల్సిన పోస్టులు 23 వేలు అయినా, ఆ తర్వాత కాలంలో వాటి సంఖ్య బాగా పెరిగింది. ఈ మూడున్నర ఏళ్లలో అనేకమంది బోధకులు ఉద్యోగ విరమణ చేశారు. కరోనా మహమ్మారికి పలువురు ప్రాణాలు కోల్పోవడంతో, ఆ టీచర్ పోస్టులూ ఖాళీగా ఉన్నాయి. పెరుగుతున్న విద్యార్థినీ విద్యార్థుల సంఖ్యకి అనుగుణంగా ఉపాధ్యాయుల నియామకాలు జరగాల్సి ఉంటుంది. వీటన్నింటి నేపథ్యంలో, అన్ని తరహాల ప్రభుత్వ విద్యాలయాల్లోను కలిపి రమారమి 50,000 ఉద్యోగాలను భర్తీ చేయాల్సిన అవసరముంది. నాటి ఆ ఇరవై మూడు వేల ఖాళీలతో పోలిస్తే, నేటి ఈ యాభై వేలు పెద్ద సంఖ్య! దీన్ని జగన్ ప్రభుత్వం ఇప్పటివరకు బయటపెట్టలేదు. గత పార్లమెంట్ సమావేశాల ప్రశ్నోత్తరాల సమయంలో ఇది బయటపడింది. ఖాళీలను భర్తీ చేయక పోవడానికి ఆర్థిక కారణాలు చూపుతుంది సర్కారు. నియామకాలు జరిపితే జీతభత్యాలివ్వాలి కాబట్టి, ఇప్పుడు టీచర్ల సర్దుబాటుకు తెగించింది. హేతుబద్ధీకరణ, తరగతుల విలీనం వంటి రకరకాల పేర్లతో పోస్టుల్ని తగ్గించి చూపిస్తోంది. అసలు… ఖాళీల భర్తీ అవసరమే లేదన్నట్లు వ్యవహరిస్తోంది. ఉన్నవాటిని ‘మిగులు’ గా తీర్చి, గణాంక మాయాజాలానికి పాల్పడుతోంది.
*నిబంధనలకు నీళ్లు
బదిలీల తరుణంలో, ఉపాధ్యాయుల పోస్టులను ‘బ్లాక్ ‘ చేయడం మరో వైపరీత్యం. అలా మునుపు 15,000 స్థానాలను ఖాళీగానే ఉంచేసింది ప్రభుత్వం! కారణాలు ఏమిటన్నది ఇప్పటికీ చెప్పడం లేదు. ఆ ఉద్యోగాల భర్తీ ఎప్పుడన్నది ఇప్పటికీ ఒక ప్రశ్నగానే మిగిలిపోయింది. దీనికి తోడు పని సర్దుబాటును కొనసాగిస్తూనే వస్తోంది. పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్ జీ టీ) ఉంటారు. సెకండరీ గ్రేడ్ అంటే ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికిప్పుడు 12,000 స్కూల్ అసిస్టెంట్ల పోస్టులు అవసరమన్నదని విద్యాశాఖ అంచనా. వారిని సబ్జెక్ట్ టీచర్లుగా పరిగణించి, మూడో తరగతి నుంచీ ఆ మేర బోధన చేయిస్తామంది. నిబంధనల ప్రకారం, 30 శాతం పోస్టులను నేరుగా నియామకాల ద్వారా నింపాలి. ఆ పనిచేయకుండా, మొత్తం అన్ని పోస్టులనీ ఏదో పదోన్నతులతోనే భర్తీ చేయాలని ప్రభుత్వం సిద్ధమైంది! దీంతో నిరుద్యోగుల కలలన్నీ కల్లలయ్యాయి. ప్రస్తుత స్థితి కొనసాగితే, ఇకముందు స్కూల్ అసిస్టెంట్ల పోస్టుల భర్తీ అనే మాటే ఉండదు.
*’కోత‘ల ప్రభుత్వం
తరగతులు, పోస్టుల హేతుబద్ధీకరణ అనేది ఇంకో తతంగం. మూడు నుంచి ఎనిమిదో తరగతి వరకు అంతా ఒకే ఒక్క మీడియం (ఆంగ్లం). తెలుగుతో కలిపి రెండు మీడియంలు ఉంటే, ఆ మేర సెక్షన్లు ఉండాలి. అదే సంఖ్యలో ఉపాధ్యాయులూ కావాలి. ఒక్క మాధ్యమం (మీడియం) మాత్రమే చేస్తే, టీచర్ల అవసరం తగ్గుతుందన్నది రాష్ట్ర ప్రభుత్వ వ్యూహం. ఇక 9,10 తరగతులకు రెండు మాధ్యమాలు ఉంటాయని ప్రకటించినా; అక్కడా ఓ మెలిక! ప్రతీ మీడియంలోనూ (ఆంగ్లం, తెలుగు) సెక్షనుకో 20 మంది పిల్లలు దాటితేనే టీచర్ నియామకం. లేదంటే, ఒక ఉపాధ్యాయుడే రెండు సెక్షన్లకు భోధించక తప్పదు. ఏ సెక్షన్ కి ఆ సెక్షన్ ఉపాధ్యాయుడంటూ ఉండరు. ఆ విధంగాను కోత పెట్టింది వైకాపా ప్రభుత్వం. ఫలితంగా, చాలాచోట్ల ఉన్నత పాఠశాల (సెకండరీ గ్రేడ్) టీచర్ పోస్టుల అవసరమే లేకుండా పోయింది!
*కుడి ఎడమల దగా
అలాగే మూడు నుంచి ఐదో తరగతి వరకు… ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు తరలించారు. దీనివల్ల ఒకటో, రెండో తరగతుల్లో పిల్లలతో పాటు ఉపాధ్యాయుల సంఖ్యా తగ్గిపోయింది. ఆరు నుంచి పదో తరగతి దాకా ఉన్న బడుల్లో కనీసం వంద మంది విద్యార్థులు దాటితే తప్ప ప్రధాన ఉపాధ్యాయులు,వ్యాయామ శిక్షకుల పోస్టులు ఉండవన్నారు. మూడు మొదలు ఎనిమిదో తరగతి వరకు ఉన్న పాఠశాలల్లో అదే విధంగా వంద మంది మించితే తప్ప, సబ్జెక్టు ఉపాధ్యాయులను నియమించేది లేదన్నారు. అంతేకాక రాష్ట్ర వ్యాప్తంగా వందలాది ఆర్ట్, క్రాప్ట్, డ్రాయింగ్ టీచర్ల పోస్టులను కూడా విద్యార్థుల సంఖ్య ఆధారంగా రద్దు చేస్తున్నామన్నారు. ఉమ్మడి పన్నెండు జిల్లాల్లోనూ వందలకొద్దీ పోస్టులు విలీనమై పోయాయి. ఎన్నో పోస్టులు పోయి, అనేకం ‘మిగులు‘గా మారి; అటు నిరుద్యోగులూ ఇటు ఉపాధ్యాయులు దగా పడ్డారు. ఈ’పుణ్యం’ అంతా పాలకపక్షానిదే!
*అన్నీ అడ్డగోలు పనులే
ఇప్పటి ఈ ప్రభుత్వ విధానానికి ఏ పేరు పెట్టాలో అని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగాల హేతుబద్ధీకరణ అంటూ సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయల పోస్టులకు ఎసరు పెడుతున్నారని నిరసిస్తున్నారు. బాలికల ఉన్నత పాఠశాలల్లోని మ్యూజిక్, కుట్టు మిషన్, ఇతర వృత్తి విద్యల బోధక పోస్టులను గణనీయంగా తగ్గించడం అనుచితమంటున్నారు. బడుల్లో ఉపాధ్యాయ – విద్యార్థి నిష్పత్తి 1:30గా ఉండాలని విద్యా హక్కు చట్టం చెప్తోంది. అంటే ప్రతీ 30 మంది పిల్లలకూ ఒక టీచర్ ఉండాలి. కానీ, ఉన్నత తరగతులైన 9,10 కీ సంబంధించి ప్రభుత్వం ఇప్పుడు చేస్తోందేమిటి? చేరినవారి సంఖ్య 60 ఉంటేనే సెక్షన్ ఏర్పాటు కావాలి, అది దాటితేనే మరో సెక్షన్ అంటోంది. అంటే ఒకే గదిలోని అరవై మంది పిల్లలకు కిక్కిరిసిన స్థితిలో చదువు చెప్పాల్సి వస్తోంది! పోస్టుల కోత కోసమే ప్రభుత్వం ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటుందని తీవ్ర విమర్శలొస్తున్నాయి. హేతుబద్ధీకరణ పేరిట రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన అధికారిక ఉత్తర్వు (జీవో 117) మొత్తం విద్యారంగానికే ఉరి తాడుగా మారిందంటూ నిరుద్యోగ ఐక్యవేదిక సంస్థ ఇటీవల ఉరి తాళ్లతో నిరసన వ్యక్తం చేసింది. ఆ హేతుబద్ధీకరణ, విలీనం వంటివాటికి ఆ ఉత్తర్వు కొత్త అర్థాలు చెప్పిందని వ్యాఖ్యానించింది. గత జాన్ పదో తేదీన వెలువడిన ఆ గవర్నమెంట్ ఆర్డర్ ఏపీలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల ప్రజాపరిషత్ పాఠశాల్లో ఉపాధ్యాయల ‘పునర్ నియామకాల‘కు సంబంధించింది. కొత్తగా నియామకాలు చేపట్టాల్సిన ప్రభుత్వం ఆ బాధ్యతను విస్మరించి, తిరిగి నియామకాలంటూ అడ్డగోలు పద్ధతులు అనుసరిస్తోందని విద్యార్థి, ఉపాధ్యాయ యూనియన్లు ఆక్షేపిస్తున్నాయి. ఇప్పటికీ నిరసన ప్రదర్శనలు జరుగుతున్నా, ఎందరు ఎన్ని విధాలుగా వ్యతిరేకిస్తున్నా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం తనదైన శైలినే ప్రదర్శిస్తోంది. మెగా డీఎస్సీ కథ కంచికి చేరినట్లే కనిపిస్తోంది. యువతకు మాత్రం వ్యధే మిగిలింది!