రైతు భరోసా కేంద్రాల్లోనూ రాజకీయ సిఫార్సులు కావాల్సిందే

•ఎరువులు బ్లాకులో కొనుక్కోవాలి.. ధాన్యం దళారులకు అమ్ముకోవాలి
•పది రోజులైనా పంట నష్టం అంచనా లేదు
•కాలువల నిర్వహణ లేకే పంటలు మునిగాయి
•పంట నష్టం పరిశీలనకు వెళ్లిన శ్రీ నాదెండ్ల మనోహర్ వద్ద సమస్యలు ఏకరువు పెట్టిన రైతులు

‘పంటలు పోయి పది రోజులు గడచింది.. ఇప్పటికీ రైతుని పలకరించిన దిక్కు లేదు.. ఎరువులు బ్లాకులో కొనుక్కోవాలి.. ధాన్యం అయిన కాడికి దళారులకు అమ్ముకోవాలి… రాజకీయ రికమండేషన్లు ఉంటేనే రైతు భరోసా కేంద్రం వద్ద పని జరుగుతుంది.. కాలువల నిర్వహణ లేకే పంటలు దెబ్బతిని పోయాయి. చివరికి కాలువలు కూడా తలా కాస్త వేసుకుని మేమే పూడికలు తవ్వుకుంటున్నాం…’ – శుక్రవారం తెనాలి, కొల్లిపర మండలాల్లో తుపాను ప్రభావంతో నష్టపోయిన పంటలను పరిశీలించేందుకు వెళ్లిన జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారి వద్ద రైతులు వెళ్లబోసుకున్న ఆవేదన ఇది. తేలప్రోలు, అత్తోట, కటివరం, చివలూరు, చక్రాయపాలెం తదితర గ్రామాల్లో పర్యటించిన శ్రీ మనోహర్ గారు గాలి వానకు నేల వాలిన వరి పొలాలను పరిశీలించారు. పడిపోయిన పొలాలు ఇంకా నీటిలో నానుతున్న పరిస్థితుల్లో కొంత మేరకు కుళ్లిపోగా, మిగిలినవి మొలకలు వచ్చేశాయి. మురుగు కాలువల నిర్వహణ లేక పది రోజులు గడచినా పొలాల నీరు అలాగే ఉండడాన్ని పరిశీలించారు. కొన్ని గ్రామాల్లో ఆరబోసిన ధాన్యం మొలకలు వచ్చేసింది. రైతు దుస్థితి చూసి శ్రీ మనోహర్ గారు చలించిపోయారు. ప్రతి రైతు కష్టాన్ని పొలం గట్ల మీదనే ఓపికగా ఆలకించారు. రైతు కష్టంలో జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
•ఒక్క అధికారి కూడా పొలం గట్టుకు రాలేదు
తేలప్రోలు-అత్తోట మధ్య రైతుల్ని శ్రీ మనోహర్ గారు పలకరించినప్పుడు ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని రైతులు ఎండగట్టారు. పొలాలు పడిపోయి పది రోజులయినా.. నీరు బయటకు వెళ్లే దారి లేదు. పట్టించుకునే వారు లేరు. అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగి తిరిగి చివరికి మేమే ఎకరాకి రూ. 200 చొప్పున వేసుకుని కాలువకు మరమ్మతు చేసుకున్నాం. రెవెన్యూ అధికారులు గాని, వ్యవసాయ అధికారులు గాని, చివరికి రైతు భరోసా కేంద్రాల నుంచిగాని పంట నష్టం అంచనా వేసేందుకు ఒక్క అధికారి కూడా పొలం గట్టున అడుగు పెట్టలేదు. రైతు భరోసా కేంద్రాల చుట్టూ తిరిగితే మాకు తెలియదు అంటున్నారని ఓ రైతు తెలిపారు. మరో అధికారి మాకు ప్రభుత్వం నుంచి ఆర్డర్ రాలేదు అంటున్నారని వాపోయారు.
•రైతు కష్టాన్ని అడిగే వారు లేరు.. తీర్చే వారు లేరు..
వడ్లు ఇప్పటికే మొలకలు వచ్చేస్తున్నాయి. రైతు కష్టాన్ని అడిగి తెలుసుకునే వారు లేరు.. సమాధానం చెప్పే వారు లేరు.. ఇంకా మాట్లాడితే రాజకీయంగా మీరు ఎటు అని అడుగుతున్నారు. ఏ పార్టీయో తెలుసుకుని సాయం చేస్తున్నారు. గత ఏడాది కూడా పంట నష్టపోయాం. ఈ ప్రభుత్వం వచ్చాక వరుసగా మూడో ఏడాది పంటలు పోయాయి అని మరో రైతు శ్రీ మనోహర్ గారికి చెప్పారు. రైతు భరోసా కేంద్రాల్లో పరపతి ఉన్న వారికి వెంటనే పని జరుగుతోందని, రాజకీయ రికమండేషన్ ఉన్న వారికి ఇంకా వేగంగా పని జరుగుతోందని తెలిపారు. చిన్న సన్నకారు రైతుల్ని పట్టించుకునే దిక్కు లేదని పలువురు రైతులు చెప్పుకొచ్చారు. 80 శాతం కౌలు రైతులమేనని చెప్పిన వారు.. మా వంక అసలు తొంగి చూసే వారు కూడా లేరన్నారు. రెవెన్యూ అధికారులు మా పట్టాదారు పాసు పుస్తకాలపై ముఖ్యమంత్రి గారి ఫోటో ముద్రించే పనిలో బిజీగా ఉన్నారని.. చివరికి ఆ భూమి కూడా మాదేనంటారేమోనని భయంగా ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
•రైతు కష్టాలు శ్రీ పవన్ కళ్యాణ్ కి వివరిస్తా: శ్రీ నాదెండ్ల మనోహర్
మా గ్రామానికి ఆనుకుని ఉన్న గ్రామంలో పంట నష్టం అంచనా వేస్తున్నారు. అదేమంటే అది బాపట్ల జిల్లా అంటున్నారు. నష్టం ఏ జిల్లాలో జరిగినా నష్టమేగా? మేమంతా ఉన్నది ఒకే ప్రభుత్వ పాలనలోనేగా.. రైతులకు నష్ట పరిహారం ఇచ్చే అంశంలో ఎందుకీ వివక్ష అంటూ చక్రాయపాలెం రైతులు వాపోయారు. రైతుల సమస్యలు ఓపికగా విన్న శ్రీ మనోహర్ గారు.. క్షేత్ర స్థాయిలో తన పరిశీలనకు వచ్చిన అన్ని అంశాలు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్తానని.. రైతుకి న్యాయం చేయడం కోసం అవసరం అయితే జనసేన పార్టీ తరఫున ధర్నాలు చేసేందుకు సైతం సిద్ధమని తెలిపారు. ఏ ఒక్క రైతు అధైర్యపడవద్దన్నారు. ఈ నెల 18వ తేదీన సత్తెనపల్లి వేదికగా కౌలు రైతులకు అండగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు సభ ఏర్పాటు చేశారన్నారు. గుంటూరు జిల్లాల్లో అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడిన 300 మంది కౌలు రైతులకు రూ. లక్ష చొప్పున ఆర్ధిక సాయం అందచేయనున్నట్టు తెలిపారు. అదే వేదిక నుంచి రైతుల సమస్యలు ప్రభుత్వానికి వినబడేలా పవన్ కళ్యాణ్ గారు గళం విప్పుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు బండారు రవికాంత్, తోటకూర వెంకటరమణారావు, పసుపులేటి మురళీకృష్ణ, ఇస్మాయిల్ బేగ్, యర్రు వెంకయ్య, దివ్వెల మధుబాబు, కృష్ణమోహన్, రాంబాబు, వేణుమాధవ్, కిషోర్ రెడ్డి, శ్రీహరి రెడ్డి, హరికృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.