రైతుకు భరోసా ఇవ్వలేని కేంద్రాలెందుకు..!

  • సంపత్ స్వర్ణ – 130 విత్తనాలు సరఫరా లేక బయట కొనుక్కున్న రైతులు
  • భవనాలు పూర్తి కాకపోవడంతో ఇరుకిరుకు అద్దె కొంపల్లో రైతు భరోసా కేంద్రాలు
  • సమయం ఆసన్నమైనా కానరాని ఎరువులు, పురుగు మందులు
  • పురుగు మందులు పిచికారీ కి డ్రోన్లు, పైలెట్లు ఎక్కడ…?
  • కష్టాలు మిగల్చునున్న కస్టమ్ హైరింగ్ సెంటర్లు
  • రైతులు కోరిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు స్టాండర్డ్ కంపెనీవి అందించాలి
  • యంత్రాలకై వ్యక్తిగత సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలి
  • ఎమ్మార్ నగర్ రైతు భరోసా కేంద్రాన్ని పరిశీలించిన జనసేన పార్టీ నాయకులు

పార్వతీపురం: రైతుకు భరోసా ఇవ్వలేని రైతు భరోసా కేంద్రాలు ఎందుకని జనసేన పార్టీ నాయకులు ప్రశ్నించారు. మంగళవారం పార్వతీపురం మండలంలోని ఎమ్మార్ నగరంలో గల రైతు భరోసా కేంద్రాన్ని జనసేన పార్టీ జిల్లా నాయకులు వంగల దాలి నాయుడు, అన్నాబత్తుల దుర్గాప్రసాద్ లు పరిశీలించారు. ఈ సందర్భంగా రైతు భరోసా కేంద్రానికి చెందిన వి.ఏ.ఏ. సీర బాలకృష్ణతో రైతు భరోసా కేంద్రంలో రైతులకు అందిస్తున్న సేవలు పై ఆరా తీశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఆలస్యం కావడం వర్షాలు ఎడబెట్టడంతో రైతులకు ఈ ఏడాది ఖరీఫ్ పై ఆందోళన నెలకొందన్నారు. దీనికి తోడు రైతు భరోసా కేంద్రంలో అరకొర సేవలందరంతోపాటు, అడిగిన సేవలు అందకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ఏడాద్రి రైతులు అత్యధికంగా సంపత్ స్వర్ణ -130 రకం వరి విత్తనాలను కోరితే రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వం వాటిని సరఫరా చేయలేదన్నారు. అధిక దిగుబడి, చీడపీడలను, నీటివసతిని తట్టుకొని, తక్కువ రోజుల్లో పంట చేతికొచ్చే రకాన్ని రైతులు కోరుకుంటే, ప్రభుత్వం మాత్రం 1064, సాంబ మసూరి, బిపిటి 5204, బి పి టి 3291 రకాలు సరఫరా చేసిందన్నారు. దీంతో రైతులు బయట మార్కెట్లో అధిక ధరలకు కావలసిన విత్తనాలు కొనుక్కున్నారన్నారు. అలాగే ఎరువులు వద్దకు వచ్చేసరికి ఇప్పటికి యూరియా మాత్రమే తెప్పించగలిగారన్నారు. రైతులు యూరియాతోపాటు డి ఎ పి, పొటాస్, 28-28, 20-20, 14-35, 0-35, తదితర ఎరువులు కోరుతున్నారన్నారు. కానీ ఇంతవరకు రైతు భరోసా కేంద్రాలు ఆయా ఎరువులు పట్ల రైతులకు భరోసా ఇవ్వలేదన్నారు. ఇక కష్టమ్ హైరింగ్ కేంద్రాల ద్వారా వ్యవసాయ యాంత్రీకరణకు భరోసా కల్పిస్తున్నామన్న భరోసా కేంద్రాలు ఆ మేరకు భరోసా ఇవ్వలేకపోతున్నాయన్నారు. రైతులకు అవసరమైన అన్ని యంత్రాలు సమకూర్చలేదన్నారు. అలాగే గ్రూపుల వారీగా కాకుండా యంత్రాలను వ్యక్తిగతంగా సబ్సిడీకి అందజేయాలన్నారు. ఇక పురుగు మందులు స్ప్రే చేసేందుకు కిసాన్ డ్రోన్ స్ప్రేయర్లు వాటిని నిర్వహించే పైలెట్లు, అలికిడి లేదన్నారు. ఖరీఫ్ ముంగిటికొచ్చినప్పటికీ జిల్లాలో వ్యవసాయ శాఖ తనదైన శైలిలో రైతులకు భరోసా ఇవ్వలేకపోతుందని ఆరోపించారు. రైతులు కోరిన విత్తనాలు, ఎరువులు పురుగుమందులు స్టాండర్డ్ కంపెనీలవి అందించాలన్నారు. విత్తనం నుండి పంట అమ్ముకునే వరకు రైతుకు అన్ని విధాల రైతు కోరే విధంగా సహాయ సహకారాలు అందించాల్సి ఉండగా అన్ని స్థాయిల్లోనూ లోపభూయిష్టమైన సహాయ సహకారాలందిస్తున్నాయన్నారు. అలాగే రైతు భరోసా కేంద్రాల భవనాలు నిర్మాణాలు పూర్తి కాకపోవటంతో ఇరికిరుకు గదుల్లో అద్దెకొంపల్లో రైతు భరోసా కేంద్రాలు నడుస్తున్నాయన్నారు. ఉదాహరణకు పార్వతీపురం మండలంలో 19 రైతు భరోసా కేంద్రాలకు ఇప్పటివరకు ఒక్క కేంద్రం మాత్రమే పూర్తికావడం కొసమెరుపు అన్నారు. రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటున్న వైసీపీ ప్రభుత్వం అడుగడుగునా రైతును దగా చేస్తోందని ఆరోపించారు. ఇక హార్టికల్చర్, ప్రకృతి వ్యవసాయ విభాగాల పరిస్థితి అంతంత మాత్రమేనని ఆరోపించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, పాలకులు స్పందించి ఆరుగాలం శ్రమించి అందరికీ తిండి పెట్టే రైతును విత్తు నుండి విత్తనం వరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆదుకోవాలని కోరారు.