ఆదివాసీయుల విష‌యంలో ద్వంద్వ ప్ర‌మాణాలు ఎందుకు?: వంపూరు గంగులయ్య

అల్లూరి సీతారామరాజు జిల్లాకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఎవరొచ్చిన గిరిజన సంక్షేమానికి, అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక ఉంటుందని చెబుతున్నారే గాని ఈ మూడేళ్ల కాలంలో ఏ ఒక్క నాయకుడు ఆ ప్రణాళిక ఏమిటో వెల్లడించలేదని జనసేన పార్టీ అరకు పార్లమెంట్ ఇంచార్జ్ డాక్టర్ వంపూరు గంగుల‌య్య విమర్శించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి విశాఖపట్నం ఇంచార్జ్ వైవి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలపై జనసేన పార్టీ నేత వంపూరు గంగులయ్య స్పందిస్తూ… గురువారం మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏజెన్సీకి వస్తున్నటువంటి ఆ పార్టీ నేతలంతా గిరిజన సంక్షేమానికి ప్రత్యేక ప్రణాళిక ఉంటుందని చెబుతున్నారే తప్ప ఆ ప్రణాళిక ఏంటో వెల్లడించడానికి ఎందుకు ఇష్టపడడం లేదని ఆయన ప్రశ్నించారు. వాస్తవంగా ఎటువంటి ప్రణాళిక లేకుండానే కల్లబొల్లి కబుర్లు చెబుతూ ఈ మూడేళ్లూ కాలం వెల్ల‌బుచ్చార‌ని ఇంకా ఏదో ప్లాన్ ఉందంటూ ప్రజలను మోసగించడం ఎంతవరకు సమంజసమ‌ని ఆయన ప్రశ్నించారు. అల్లూరి జిల్లాకు వస్తున్న ప్రతి వైసీపీ నేత నిర్మాణం పునాది ద‌శ‌లో ఉన్న మెడికల్ కాలేజీ గురించి నిత్య‌మూ చెబుతున్నారని అసలు దానికి నిధులే కేటాయించకుండా ఎలా పూర్తి చేస్తారో కూడా ఇప్పటివరకు చెప్పకపోవడం శోచ‌నీయ‌మ‌ని గంగుల‌య్య తెలిపారు. అస‌లు కేంద్ర ప్ర‌భుత్వ నిధుల‌తో జ‌రుగుతున్న మెడిక‌ల్ కాలేజీ నిర్మాణం ఎప్ప‌టికి పూర్తి చేస్తారో స్ప‌ష్ట‌త ఇవ్వండ‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. గిరిజన సంపదను దోచుకోవాలని మొదట ఆలోచన చేసింది కాంగ్రెస్ పార్టీ అని అటువంటి కాంగ్రెస్‌ పుట్టినటువంటి ఈ పిల్ల కాంగ్రెస్ పార్టీ నేతలే దాన్నేదో రద్దు చేశామని చెబుతున్నారని సాధారణంగా సమస్యలు సృష్టించి దాని తామేదో పరిష్కరిస్తున్నట్టుగా చెప్పడం వైసీపీకి పరిపాటిగా మారిపోయిందని జీవో నెంబర్ 97 రద్దు విషయం కూడా అటువంటిదేనని ఆయ‌న విమ‌ర్శించారు. ప‌రిపాల‌నా సౌల‌భ్యంగా ప్ర‌త్యేక జిల్లాగా ప్రకటించామని చెబుతున్న నేతలు జిల్లాగా ప్రకటించిన తర్వాత గిరిజనుల‌కు జరుగుతున్న‌టువంటి మేలు ఏంటో వివరించాలని ఆయన కోరారు.

*ద్వంద్వ ప్రమాణాలు ఎందుకు? హైడ్రో ప‌వ‌న్ ప్రాజెక్ట్ కు అనుమ‌తులిచ్చిందెవ‌రు?
ఒకపక్క ప్రభుత్వమే గిరిజనులకు ద్రోహం చేసేలా, అన్యాయం జరిగేలా చీకటి జీవోలను తీసుకొస్తుందని, అదే ప్రభుత్వం బహిరంగంగా గిరిజనుల పక్షపాతి ప్ర‌భుత్వ‌మ‌ని, వారికి మేలు చేస్తామని చెబుతుందని డాక్ట‌ర్ వంపూరు గంగుల‌య్య విమర్శించారు. గిరిజన ప్రాంతంలో 5వ షెడ్యూల్ ఏరియాలో గిరిజనేతరులకు ఎటువంటి హక్కులు ఉండనీయబోమని ఒకపక్క ముఖ్యమంత్రి చెబుతూనే మరోపక్క గిరిజనేతలకు సెంటున్న‌ర భూమి ఇస్తూ జీవ ఇవ్వడం వెనుక అర్థమేంటని ఆయన ప్రశ్నించారు. చ‌ట్ట‌ప్ర‌కారం చెల్లంద‌ని తెలిసీ కూడా గిరిజ‌నేత‌రుల ఓట్ల కోసం కాదా ఈ నాట‌కాల‌ని ఆయ‌న అన్నారు. గిరిజన సంపదకు, గిరిజనులకు నష్టం చేకూర్చే హైడ్రోపవర్ ప్రాజెక్టు కు పరిమితులు ఇచ్చిందెవరని ఆయన ప్రశ్నించారు. గిరిజన సంపదకు, గిరిజనులకు అన్యాయం చేయకుండా త‌మ ప్రభుత్వం వాళ్ల పక్షాన కొమ్ము కాస్తుంది అని చెబుతున్న ఈ నేతలు హైడ్రోపవర్ ప్రాజెక్టు విషయంలో ఎందుకు ద్వంద్వ ప్రమాణాలున పాటిస్తున్నార‌ని ఆయ‌న నిల‌దీశారు. ఒకపక్క గిరిజనులను మోసం చేస్తూ కొందరు నేతలు గిరిజనులకు అనుకూలంగానూ మరికొందరు నిశ్శబ్ద వైఖరిని అవలంబించాడాన్ని ద్వంద్వ వైఖరి కాక మరి ఏమిటని ఆయన ప్ర‌శ్నించారు. వాస్తవంగా గిరిజనులకు మేలు చేయాలని సహృద్యులైతే నాన్ షెడ్యూల్ ఏరియాలో ఉన్న గిరిజ‌న గ్రామాల‌ను షెడ్యూల్ ఏరియాలో చేర్చాల‌ని, జీవో నెంబర్ మూడు విషయంలో గిరిజనులకు మద్దతుగా పోరాటం చేయాలని, అందుకు అవ‌స‌ర‌మైతే ప్ర‌త్యామ్నాయ ప్ర‌య‌త్నాలుచేయాల‌ని, ఆదివాసీలకు నష్టం చేకూర్చే ఎటువంటి ప్రాజెక్టుల‌నైనా ప్రభుత్వం ఖరాకండిగా వ్యతిరేకించాలని గంగుల‌య్య సూచించారు.