మహిళలకు రక్షణ కరవైందని నిరసన తెలిపితే పోలీసులతో కట్టడి చేయిస్తారా?

• ఒంగోలులో జనసేన నాయకుల నిర్బంధం అప్రజాస్వామికం
రాష్ట్రంలో నిత్యం అత్యాచార ఘటనలు, మహిళలకు వేధింపుల కేసులు వస్తూనే ఉన్నాయని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం కూడా విజయవాడ నగరంలో ఓ బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి యత్నించిన దుర్ఘటన వెల్లడైంది. ఆడబిడ్డలు భయంభయంగా రోడ్డు మీదకు రావాల్సిన పరిస్థితులు వచ్చాయంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎలా దిగజారాయో అర్థం అవుతోంది. ఈ విషయం మీద బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా జనసేన నిరసన తెలుపుతుంటే పోలీసులతో కట్టడి చేయాలని చూస్తోందంటే రాష్ట్ర ప్రభుత్వం తన వైఫల్యాన్ని ఒప్పుకొన్నట్లే. రేపల్లెలో సామూహిక అత్యాచారానికి గురై ఒంగోలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆమె కుటుంబానికి ధైర్యం చెప్పేందుకు వెళ్ళి… అక్కడికి వచ్చిన రాష్ట్ర హోమ్ శాఖ మంత్రిని కలిసి వినతి పత్రం ఇవ్వాలనుకున్న జనసేన నాయకులను నిర్బంధంలోకి తీసుకోవడం అప్రజాస్వామికం. జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ పెదపూడి విజయ్ కుమార్, రాష్ట్ర అధికార ప్రతినిధి డా.పాకనాటి గౌతమ్ రాజ్, ఒంగోలు పట్టణ అధ్యక్షులు శ్రీ మలగా రమేష్, వీర మహిళ ప్రాంతీయ సమన్వయకర్త శ్రీమతి బొందిల శ్రీదేవి, పార్టీ నేతలు రాయని రమేష్, శ్రీమతి పల్లా ప్రమీల, శ్రీమతి గోవిందు కోమలి, శ్రీమతి ఆకుపాటి ఉషలను పోలీసులు నిర్బంధించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలపై ఈ విధంగా నిర్భందాలు, కేసులు నమోదు చేయడం మీద దృష్టి పెట్టడం కాదు మహిళల రక్షణకై కఠినంగా వ్యవహరించాలని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.