WTC Final: వరుణుడి జోరుతో ఆగిన ఆట.. ఆటలో ఒక్క బంతి పడకుండానే లంచ్!

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ నాలుగోరోజు ఆట ఇంకా మొదలవ్వనేలేదు.. వేకువజాము నుంచి సౌథాంప్టన్‌లో వర్షం కురుస్తూనే ఉంది. దీంతో మ్యాచ్‌ ఆగిపోయింది. అక్కడ భారీ వర్షం కురవకపోయినా.. అప్పుడప్పుడు కురుస్తున్న జల్లులతో మ్యాచ్‌ ఆడటానికి వాతావరణం అనుకూలంగా లేదు. వాస్తవానికి అక్కడ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఇక వర్షం కారణంగా మైదానంలో పిచ్‌పై కప్పిన కవర్లపై నీరు నిలిచి.. ఔట్‌ఫీల్డ్‌ చిత్తడిగా మారింది.

మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న సౌతాంప్టన్ లో తొలిరోజు నుంచి నేడు నాలుగో రోజు వరకు ప్రతి రోజూ వర్షం ఏదో ఒక దశలో అంతరాయం కలిగిస్తూనే ఉంది. తొలి రోజు ఆట పూర్తిగా వర్షార్పణం కాగా, ఇవాళ్టి ఆటలో లంచ్ వరకు తుడిచిపెట్టుకుపోయింది. దాంతో ఒక్క బంతి పడకుండానే భారత్, న్యూజిలాండ్ జట్లు లంచ్ కు వెళ్లాయి. ఇప్పటికీ జల్లు కురుస్తూనే ఉండడంతో మైదాన సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. మైదానంలో ఓవైపు అధికంగా చేరిన నీటిని తొలగించేందుకు యంత్రాలను రంగంలోకి దించారు.

మ్యాచ్‌ ఆడే అవకాశం లేకపోవడంతో.. ఆటగాళ్లు తమ వ్యాపకాల్లో మునిగిపోయారు. న్యూజిలాండ్‌ క్రికెటర్లేమో.. టేబుల్‌ టెన్నిస్‌ ఆడుకుంటుంటే.. మరికొందరేమో కాలక్షేపంగా ముచ్చట్లు పెడుతున్నారు. ఇంకొందరేమో.. డ్రస్సింగ్‌ రూమ్‌ బాల్కనీల్లో వెచ్చని కాఫీలు ఆస్వాదిస్తున్నారు. మ్యాచ్‌ ఆగిపోవడంతో.. సౌథాంప్టన్‌లో పరిస్థితి ఎలా ఉందో బీసీసీఐ ట్వీట్‌ చేసింది. దీంతో.. క్రికెట్‌ అభిమానులు వర్షాకాలంలో మ్యాచ్‌లు ఎందుకుపెడుతున్నారని ఐసీసీని ట్రోల్‌ చేస్తున్నారు.