తెలంగాణ ఎంసెట్ పరీక్షల తేదీలు ఖరారు..

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే లాక్ డౌన్ ను కూడా ఎత్తివేస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది. కాగా జూలై ఫస్ట్ నుంచి విద్యాసంస్థలను ప్రారంభించాలని కూడా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఎంసెట్ తేదీలను ఖరారు చేసింది.

ఆగస్టు 5 నుంచి 9వరకు పరీక్షలు నిర్వహించనున్నామని ప్రకటించింది. ఆగస్టు 3న ఈసెట్ జరగనుంది. ఇక ఆగస్టు 11-14 మధ్య పీఈసెట్ జరపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. జూలై 1 నుంచి డిగ్రీ, పీజీ, వృత్తి విద్య కళాశాలల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభం కానున్నాయి.

ఫైనల్ ఇయర్ పరీక్షలు జూలైలో పూర్తి:

మరోవైపు ఇంజనీరింగ్, పీజీ, డిగ్రీ, డిప్లమో ఫైనల్ ఇయర్ పరీక్షలను జూలై చివరి వారంలోగా పూర్తి చేయాలని అన్ని యూనివర్సిటీల అధికారులను విద్యాశాఖ ఆదేశించింది. అలాగే ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్ధుల బ్యాక్‌లాగ్‌లు కూడా జూలై నెలాఖరులోగా పూర్తి చేసేందుకు అవకాశం కల్పించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది.

కాగా, రాష్ట్రంలో జూలై 1వ తేదీ నుంచి విద్యాసంస్థలను రీ-ఓపెన్ చేస్తున్నట్లు తెలంగాణ సర్కార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏదో తరగతి వరకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించి.. 8 నుంచి ఆపై తరగతుల విద్యార్ధులకు నేరుగా క్లాసులు నిర్వహించేందుకు విద్యాశాఖ ప్రణాళికలు సిద్దం చేస్తోంది.