ఉద్యోగులనూ వంచించిన వైసీపీ సర్కార్

• ఐఆర్ కంటే 4 శాతం తక్కువగా ఫిట్ మెంట్
• హెచ్ ఆర్ ఏలో కోత….సీసీఏ ఎత్తివేత
• అర్థరాత్రి జీవోలతో అలజడి….ఆందోళన బాటలో వేతన జీవులు

జీతం పెరుగుతుందంటే వేతన జీవులెవరైనా ఆశగా ఎదురు చూస్తారు…
అలాగే ఎదురు చూశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు…
ఏళ్ల తరబడి నిరీక్షణ… నెలల తరబడి సాగిన చర్చలు…
ప్రపంచంలో ఎక్క‌డైనా వేతన సవరణ జరిగిందంటే ఉద్యోగులు సంతోషిస్తారు…
కారణం వాళ్ల జీతం పెరుగుతుంది…
కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం అలా జరగలేదు…
ఉద్యోగులంతా ప్రభుత్వం తమను మోసం చేసిందని ఆగ్రహిస్తున్నారు…
కారణం… వాళ్ల జీతం తగ్గబోతోందని తెలియడమే!
అందుకే… ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వోద్యోగులు పిడికిలి బిగించారు!
సమ్మెకు సిద్ధమవుతున్నారు!
ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్య‌వహ‌రించిందని… తమను దగా చేసిందని ఆరోపిస్తున్నారు!
ఏకంగా 13 లక్షల‌కు పైగా ఉన్న ఉద్యోగులు ఒక్క‌తాటిపై నిలబడి ఆందోళనలు చేస్తున్నారు!
ఈ మొత్తం వ్య‌వహారాన్ని విశ్లేషించి చూస్తే కనిపించే కారణాలివీ…

  • జగన్ ప్రభుత్వ విధానాల్లో పారదర్శకత లోపించడం
  • ఏకప‌క్షంగా నిర్ణయాలు తీసుకోవడం
  • సహేతుకమైన చర్చలు జరపకపోవడం
  • మొండిగా వ్య‌వహరిస్తూ ముందుకు సాగడం

ఈ నేపథ్యంలో వేతన సవరణ విషయంలో ఏం జరిగిందో తెలుసుకుంటే లక్షలాది మంది ఉద్యోగులు ఎందుకు రోడ్లపైకి వస్తున్నారో, ఎందుకు నల్ల‌బ్యాడ్జీలు ధరిస్తున్నారో,
ఎందుకు ధ‌ర్నాలు చేస్తున్నారో, ఎందుకు స‌మ్మెకు సైతం సిద్ధం అవుతున్నారో అర్థం అవుతుంది.
జీతాలు ఇలా తగ్గుతున్నాయి…
ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఐదేళ్లకోసారి వేతన సవరణ సంఘాన్ని నియమిస్తూ ఉంటారు. ఆ సంఘం చేసే సిఫార్సులపై ఉద్యోగ సంఘాలతో చ‌ర్చించి, చివర‌కు
ఒక నిర్ణయానికి వస్తారు. ఆ తర్వాత వేతన సవరణ బిల్లులను జీవోగా విడుదల చేస్తారు. దాని ప్రకారం ప్ర‌తి ఉద్యోగి జీతం ఎంతో కొంత పెరుగుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో
జగన్ ప్రభుత్వం కొలువైన త‌ర్వాత వ‌చ్చిన ఈ వేతన సవరణ బిల్లులు ప్రభుత్వోద్యోగులను తీవ్రమైన నిరాశ‌కు గురి చేశాయి. ఎందుకంటే… వాళ్ల జీతాలు తగ్గబోతుండడమే ఇందుకు కారణం. అంటే నెలల తరబడి ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరిపినా అవి పారదర్శకంగా జరగలేదనే విషయం స్ఫష్టమవుతోంది. చర్చ‌కు రాని అంశాలు బిల్లులో చోటు చేసుకోవడంతో ఉద్యోగులు వాటిపై లెక్క‌లు వేసుకుని నికరంగా తమ ఆదాయం ప్రస్తుం ఉన్న‌దాని క‌న్నా త‌గ్గుతోందని తెలుసుకుని ఆగ్రహానికి గురవుతున్నారు. సాధారణంగా ఒక ఉద్యోగి జీతంలో మూలవేతనం (బేసిక్), ఇంటి అద్దె భత్యం (హెచ్ ఆర్ ఏ), నగర భత్యం (సీసీఏ), కరువు భత్యం (డీఏ) ప్రధానంగా
ఉంటాయి. మూలవేతనం పెరిగితే దాన్ని బ‌ట్టి శాతాల ప్రకారం మిగతా భ‌త్యాలు కూడా పెరుగుతాయి. కానీ జగన్ ప్రభుత్వం ప్రక‌టించిన వేతన సవరణ బిల్లలను చూస్తే
కొన్ని భ‌త్యాలలో మార్పులు చేయడం వల్ల నికరంగా చేతికి అందే జీతంలో కోత పడుతోందని ఉద్యోగులు వాపోతున్నారు. ఎందుకంటే గతంతో ఉండే ఇంటి అద్దె భ‌త్యాన్ని
లెక్కించే విభాగాలను జగన్ ప్రభుత్వం 4 నుంచి 3కి కుదించింది. పైగా దాన్ని లెక్కించే శాతాలను త‌గ్గించింది. అలాగే గతంలో ఉండే నగర భ్య‌త్యాన్ని మొత్తానికి ర‌ద్దు
చేసింది. ఇక పెన్షనర్ల విషయానికి వస్తే గతంలో 70 ఏళ్లు పైబడితే అదన‌పు క్వాంటమ్ విధానం ద్వారా పింఛన్ కొంత మేర‌కు పెరిగేది. జగన్ ప్రభుత్వం దాన్ని ఇప్పుడు
80 ఏళ్లు పైబడిన వారికి తప్ప రాదని నిబంధన మార్చింది. ఇది పింఛనర్లను నిరాశ‌కు గురి చేసింది. అలాగే మరో దారుణమైన, అమానుషమైన విషయం ఏమిటంటే…
గతంలో ఉద్యోగి కానీ, పెన్షనర్ కానీ తన జీవిత భాగస్వామిని కోల్పోతే కొంత మొత్తాన్ని అంత్య క్రియల నిమిత్తం విడుదల చేసేవారు. ఇది మానవీయ కోణంలో,
ప్రభుత్వోద్యోగుల సేవలను గుర్తించి ఇచ్చే ఒక గౌరవ ప్రదమైన సొమ్ము. అయితే కొత్త వేతన సవరణ బిల్లులో ఈ భ‌త్యాన్నిజగన్ ప్రభుత్వం మొత్తానికే ర‌ద్దు చేసింది. దాంతో
“ఈ ప్రభుత్వం ఆఖరికి మ‌ట్టి ఖ‌ర్చులను కూడా ఆదా చేసుకుంటోందన్న మాట“ అంటూ ఆగ్రహావేశాలు సర్వ‌త్రా వ్య‌క్తం అవుతున్నాయి. అలాగే ఈ వేతన సవరణలు
ఆలస్య‌మవుతున్నాయనే ఉద్దేశంతో ప్రభుత్వం 2020 నుంచి ఉద్యోగుల‌కు మధ్యంతర భృతి (ఇంటీరియమ్ రిలీఫ్) పేరిట కొంత శాతం మేర‌కు జీతాలు పెంచింది.
అన్నింటిక‌న్నా విచిత్ర‌మైన విషయం ఏమిటంటే… మధ్యంతర భృతి పేరిట ఇచ్చిన పెరుగుదల కంటే కొత్త జీతం పెరుగుదల తక్కువగా ఉండడం. అందుకనే “ఇలాంటి
విచిత్ర‌మైన పరిస్థితి ఎక్క‌డా కనలేదు, వినలేదు…” అంటూ ఉద్యోగులు ఆగ్రహాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఆ లెక్క‌ల‌న్నీ వేసుకుని చూసుకున్న ఉద్యోగులు దీన్ని “రివర్స్ పే
రివిజన్“ అంటూ ఆక్రోశిస్తున్నారు. మొత్తానికి పాత జీతాలనే ఉంచాలని, కొత్త వేతన సవరణ బిల్లులను ర‌ద్దు చేయాలని ఉద్య‌మిస్తూ ఆ బిల్లులను తగలబెడుతున్నారు.
ఉద్యోగులు వేసుకున్న లెక్క‌ల ప్రకారం చూస్తే… కింది స్ధాయి నుంచి పై స్థాయి వర‌కు ఉండే ఉద్యోగుల మూలవేతనం మామూలుగా 13 వేల నుంచి లక్ష రూపాయల వర‌కు
ఉంటుంది. అలా ఒక ఉద్యోగి సగటు వేతనం 40 వేలు అనుకుంటే, ఇంటి అద్దె భత్యంలో కోత, నగర భత్యం ఎత్తివేత, మధ్యంతర భృతి మినహాయింపులు తీసేస్తే సగటున ఒకో ఉద్యోగి 4 వేల చొప్పున నష్టపోతాడు. పైగా ఈ నష్టం ఉద్యోగ జీవితమంతా కొన‌సాగుతుంది. ఇప్పుడు ఇదే అంశం ఉద్యోగులను కలవరపెడుతోంది. మరో అంశం ఏమిటంటే ఇక రాష్ట్ర పీఆర్సీకి మంగళం పాడటం. పదేళ్లకోసారి కేంద్ర ప్రభుత్వ తరహాలో వేతన సవరణ చేయనున్నట్లు ప్రకటించడం. ఇది కూడా ఉద్యోగులకు మింగుడు పడటం లేదు. ఎందుకంటే ఇప్పటివరకు ఐదేళ్లకోసారి వేతన సవరణ అమలవుతోంది.

ఉద్యోగుల ప్రశ్న‌లకు బదులేదీ?

కొత్త వేతన సవరణల ప్రకారం నికర పెరుగుదల (ఫిట్మెంట్)ను ప్రభుత్వం 23 శాతంగా నిర్ణ‌యించింది. అయితే అంతక్రితం మధ్యంతర భృతి (ఐఆర్) ని 27 శాతం ఇచ్చింది. ఇలా ఐఆర్ కంటే ఫిట్మెంట్ను తక్కువగా నిర్ణ‌యించడం ఎక్క‌డా వినలేదని ఉద్యోగులు వాపోతున్నారు. ఇలా ఎలా చేశారనే వారి ప్రశ్న‌కు సమాధానం లేదు. గతంలో ఉద్యోగుల‌కు బకాయి పడిన అయిదు డిఏలను ఒకేసారి ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతుంటే దాన్ని కూడా ఉద్యోగులు మరో లెక్క ప్రకారం ప్ర‌శ్నిస్తున్నారు. ఇంటి భత్యం త‌గ్గింపు, నగర భత్యం ర‌ద్దు, మధ్యంతర భృతి మినహాయింపులను తీసి వేసుకుని చూస్తే ప్రభుత్వం కేవలం 14.29 శాతం మాత్ర‌మే పెంచినట్ట‌యిందని తేల్చి చెబుతున్నారు. అంటే పైకి 23 శాతం పెంచిన‌ట్టు కనిపిస్తున్నా, చివరకి కోతల‌న్నీ తీసేస్తే పెరిగింది స్వ‌ల్ప‌మేననేది వారి
వాదన. ఇలా అంకెల గార‌డీ చేయడం మోసం కాదా అనేది వారి ప్రశ్న‌. దీనికి జవాబు లేదు. మరో పక్క ప్రభుత్వ కార్య‌ద‌ర్శి అనేక అంశాలు చూపుతూ ప్రభుత్వం
చర్య‌ను సమ‌ర్థిస్తున్నా, ఉద్యోగులు అనేక ప్రశ్న‌లు లేవనెత్తుతున్నారు. వాటికి బదులు లేదు. సమ్మెకు సిద్ధమౌతున్న ఉద్యోగులు సంధిస్తున్న ప్రశ్న‌లు ఇలా ఉన్నాయి.

  • ప్రభుత్వం పారదర్శకంగా వ్య‌వహరిస్తే, వేతన సవరణ నివేదిక మొత్తాన్ని ఎందుకు బయటపెట్టలేదు?
  • చర్చల‌న్నీ సహేతుకంగా జరిగాయనుకుంటే సవరణ బిల్లులను రాత్రి పొద్దుపోయాక ఎందుకు విడుదల చేయాల్సి వచ్చింది?
  • ఫిట్మెంటులో 4 శాతం, హెచ్ ఆర్ ఏలో 4 నుంచి 16 శాతం త‌గ్గించి, నగర భ‌త్యాన్ని పూర్తిగా ఎత్తివేశాక జీతాలు ఎలా పెరుగుతాయి? అదే నిజమైతే లక్షల మంది
    ఉద్యోగులు ఎందుకు ఆందోళనకు సిద్ధమవుతారు? మాకు కొత్త జీతాలు వ‌ద్దు, పాత జీతాలే ఇవ్వ‌మని ఎందుకు అడుగుతారు?
  • రాష్ట్ర విభజన వల్ల ఆర్థిక నష్టాలు ఉన్నాయనే ప్రభుత్వ సమర్థనే నిజమైతే… గత ప్రభుత్వం 43 శాతం ఫిట్మెంటు ఇచ్చిన నేపథ్యంలో, రాష్ట్ర విభజన జరిగిన ఏడేళ్ల‌కు
    ఈ వాదన ఎలా సమంజసం?
  • ప్రభుత్వ ఆదాయంలో అధిక భాగం ఉద్యోగులు, పెన్షన్ల‌కు పోతోందనే ప్రభుత్వం వాదన ప్రకారం చూస్తే… ప్రభుత్వం రాజకీయ ల‌క్ష్యాల కోసం గ్రామ వార్డు స‌చివాలయాలను,
    వాటిలో వాలంటీర్లను ఎందుకు నియ‌మించింది? అస్మ‌దీయులనుకున్న‌వారికి సలహాదారు పదవులు కట్టబెట్టి లక్షల‌కు లక్షలు గౌరవ వేతనాలు ఎందుకు ఇస్తోంది? జగన్
    మీడియాలో పనిచేసిన సిబ్బందికి ప్రభుత్వంలో రకరకాల కొలువులు ఎందుకు ఇచ్చింది? వీరందరి ఖ‌ర్చును కూడా ఉద్యోగుల జీతభ‌త్యాల ఖాతాలో రాసేస్తే ఎలా?
  • ప్రధాన కార్య‌ద‌ర్శి చెబుతున్న‌ట్టు ఆర్థిక నిర్వ‌హణలో జాగ్రత్త వ‌హించాలనేదే నిజమనుకుంటే… రాష్ట్రం విషయంలో ప్రభుత్వం ఆ ఆర్థిక క్రమశిక్షణను ఎందుకు పాటించడం
    లేదు? దుబారాను ఎందుకు అరికట్టడం లేదు? ఒకవైపు స‌చివాలయం ఉండగానే విజయవాడలో, గుంటూరులో క్యాంపు కార్యాలయాలు ఎందుకు పెట్టారు? ఆర్థిక శాఖ‌కు
    స‌చివాలయంలో ఉన్న కార్యాలయం కాకుండా మరో రెండు క్యాంపు ఆఫీసులు ఎందుకు? మరో గెస్ట్ హౌస్కూ అద్దె ఎందుకు కడుతున్నారు? ఇలా ప్ర‌తి శాఖ‌కు, ప్ర‌తి
    కార్పొరేషన్‌కు రెండేసి కార్యాలయాలు దేనికి? ఆయా శాఖల అధికారులందరూ రెండు నుంచి ఐదేసి కార్లను ఎందుకు వాడుతున్నారు?
  • ప్రభుత్వం తప్పుడు లెక్క‌లు, దొడ్డి దారిలో వేల కోట్ల అప్పులు ఎందుకు చేస్తోంది? ఈ అప్పుల వల్ల రాష్ట్రానికి జరుగుతున్న‌మేలేమిటి? వేతనాల దగ్గరకి వ‌చ్చేసరికే ఆర్థిక
    లెక్క‌లు చెబుతారా?
  • రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదనేదే నిజమనుకుంటే… గత ఆర్థిక సంవత్స‌రంలో రాష్ట్రం ఆదాయం గణనీయంగా పెరిగిన‌ట్లు కాగ్ చెబుతున్న లెక్క‌లను ఎందుకు ఘనంగా
    ప్రచారం చేసుకుంటున్నారు? మరి ఆదాయం అంత బాగుందనుకుంటే ఈ బీద అరుపులు దేనికి?
  • గత ప్రభుత్వం హ‌యాంలో తెలంగాణ కంటే ఏపీ ప‌న్ను ఆదాయం 3000 కోట్లు ముందంజలో ఉంది. ఇప్పుడు తెలంగాణ కంటే 6000 కోట్లువెనకబడి
    ఉంది. ఇందుకు సొంత ఆదాయాన్ని పెంచుకోడాన్ని గాలికొదిలేసిన జగన్ ప్రభుత్వం వివాదాస్ప‌ద నిర్ణయాలే కారణం కాదా? ఇసుక దొర‌క్కుండా చేయడం,
    అమరావ‌తిని అటకెక్కించడం, అమరావ‌తి చుట్టూ అల్లుకున్న వాణిజ్య కార్య‌కలాపాలు ఆగిపోవడం, కొత్త పరిశ్రమలు రాని పరిస్థితులు క‌ల్పించడం, ఉన్న
    పరిశ్రమలు పోతున్నా అడ్డుకోకపోవడంలాంటి అవకతవక విధానాల వల్ల సంపద పెరగలేదన్న‌ది నిజం కాదా? చెత్త ప‌న్నులు, ఆస్తి ప‌న్నులు, క‌రెంటు
    ఛార్జీలు, ఓటీఎస్ పేరుతో ప్రజల ప్రజల నుంచి ఎంత సొమ్ము పిండితే ఖ‌జానా నిండుతుంది? ఇలా పాపాలు పాల‌కులవి, శాపాలు ఉద్యోగులు, ప్రజలకా?
    ఇన్ని ప్రశ్న‌లు, ఇన్ని సందేహాలను లేవనెత్తుతూ ప్రభుత్వోద్యోగులు స‌మ్మెకుసిద్ధమవుతున్నారు. ఇన్ని ప్రశ్న‌లు తలెత్త‌డానికి, ఇంత ఆగ్రహావేశాలు పెల్లుబుకడానికీ కారణంమాత్రం ఒకటే.
    అది జగన్ ప్రభుత్వ విధానాల్లో అస్ప‌ష్టత! ఏకపక్ష ధోరణి! నియతృత్వ పోకడ!