కార్మికుల కన్నీళ్లలో వైసీపీ కొట్టుకుపోవటం ఖాయం

  • కష్టానికి తగ్గ ప్రతిఫలం అడగటం ముఖ్యమంత్రికి నేరంగా కనపడుతుంది
  • మనసులేని వ్యక్తి ముఖ్యమంత్రి అవ్వటం రాష్ట్ర ప్రజలు చేసుకున్న దురదృష్టకరం
  • వైసీపీ ఊసే లేని ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ముందుకు సాగుదాం
  • కార్మికుల సమ్మెకు జనసేన పూర్తి మద్దతు
  • కార్మికుల కష్టాలు పట్టని కసాయి సర్కార్ పోస్టర్లను ఆవిష్కరించిన జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్

గుంటూరు: పారిశుద్ధ్య కార్మికుల కాళ్ళు కడిగినా రుణం తీర్చుకోలేమంటూ ప్రతిపక్ష నేతగా మాట్లాడిన జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తన అరాచకపాలనతో కార్మికుల జీవితాలను కన్నీటిమయం చేశారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల కన్నీళ్లలో వైసీపీ ప్రభుత్వం కొట్టుకుపోవటం ఖాయమంటూ మండిపడ్డారు. కార్మిక సంఘ జే ఏ సీ సభ్యులు సోమి శంకరరావు ఆధ్వర్యంలో రూపొందించిన కార్మికుల కష్టాలు పట్టని కసాయి సర్కార్ గోడప్రతులను ఆదివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ తెల్లవారక ముందే విధుల్లో చేరి మల మూత్రాలతో , చెత్తాచెదారంతో నిండిన పరిసరాలను శుభ్రం చేసి ప్రజలకు ఆరోగ్యాన్నిచ్చేందుకు తమ ప్రాణాలను ఫణంగా పెట్టే పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను ముఖ్యమంత్రి పెడచెవిన పెట్టడం దుర్మార్గమన్నారు. కార్మికులేమి గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని , జగన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలనే నెరవేర్చమంటున్నారన్నారు. కష్టానికి తగ్గ ప్రతిఫలం అడగటం ముఖ్యమంత్రికి పెద్ద నేరంగా కనపడుతుందంటూ దుయ్యబట్టారు. పారిశుద్ధ్య కార్మికుల సమ్మెతో ఇప్పటికే రాష్ట్రం మొత్తం దుర్గంధమయంగా మారిందన్నారు. దీంతో ప్రజలు అనారోగ్యం పాలయ్యే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యలకు ప్రభుత్వం వీలైనంత తొందరగా పరిష్కారం చూపాలన్నారు. మనసులేని వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వటం ఈ రాష్ట్ర ప్రజలు ఏనాడో చేసుకున్న దురదృష్టమన్నారు. కార్మికులు చేపట్టిన రాష్ట్ర వ్యాప్త సమ్మెకు జనసేన పూర్తి మద్దతు నిస్తుందని తెలిపారు. సమస్య పరిష్కారం అయ్యేవరకు కార్మిక సంఘాలు తీసుకునే ఎలాంటి పోరాటాలకైనా జనసేన అండగా నిలుస్తుందని మనోహర్ అన్నారు. కార్మిక సంఘ నేత సోమి శంకరరావు సమ్మె జరుగుతున్న తీరును మనోహర్ కు వివరించారు. పారిశుద్ధ్య కార్మికుల సమ్మెకు ప్రజల నుంచి పెద్దఎత్తున మద్దతు లభిస్తుందని శంకరరావు అన్నారు. ఈ సందర్భంగా ఉధృతంగా సాగుతున్న సమ్మె విషయమై పవన్ కల్యాణ్ తో మాట్లాడతానని నాదెండ్ల మనోహర్ అన్నారు. జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి, వీరమహిళ నిస్సంకర అనసూయ, రెల్లి యువ నేత సోమి ఉదయ్ కుమార్, డివిజన్ అధ్యక్షులు గుర్రాల ఉమ, సయ్యద్ షర్ఫుద్దీన్, గడ్డం రోశయ్య, నండూరి స్వామి, వడ్డె సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.