‘సున్నా’ యాసంగా గెలవడానికే వైసీపీ అడ్డదారులు: పసుపులేటి హరిప్రసాద్

  • జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్

తిరుపతి: ప్రజాస్వామ్యాన్ని వైసీపీ నాయకులు అపహాస్యం చేస్తున్నారని జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జీరో ఇంటి నెంబర్లతో హీరోలు అయ్యేందుకు వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆయన బుధవారం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో జీరో ఇంటి నెంబర్ తో భారీగా ఓట్ల నమోదు జరగడం దారుణమన్నారు. సిఎం జగన్ మోహన్ రెడ్డి పదేపదే 175 కి 175 స్ధానాలు సాధిస్తామని చెప్పడం వెనుక ఉన్న మతలబు ఏంటో రాష్ట్ర ప్రజలకు అర్ధమవుతోందన్నారు. వాలంటీర్లను అడ్డం పెట్టుకొని దొంగ ఓట్లు నమోదు చేయించేందుకు వైసీపీ నాయకులు చేసిన ప్రయత్నాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయన్నారు. తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్… వాలంటీర్ల పై వ్యాఖ్యలు చేయగానే వైసీపీ నాయకుల్లో వణుకు మొదలైందన్నారు. వాలంటీర్ల కంటే ముందుగా వైసీపీ నాయకులే పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మలు దగ్ధం చేయడం వారు పడుతున్న ఆందోళనకు నిదర్శనమన్నారు. గతంలో తిరుపతిలో జరిగిన లోక్ సభ ఉప ఎన్నికల్లోనూ కుప్పలు తెప్పలుగా దొంగ ఓట్లు వేయించారని, అలాగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పదోతరగతి పాస్ కూడా కాని వారిని ఓటర్లుగా నమోదు చేశారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా అధికారులు జీరో ఇంటి నెంబర్లతో నమోదైన ఓటర్ల వివరాలపై విచారణ జరపాలని ఆయన ఆ పత్రికా ప్రకటనలో కోరారు. అధికారులు చర్యలు తీసుకోకపోతే జనసేన పార్టీ తరుపున ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు.