చోటీ మృతికి వైసీపీ నేతలే కారకులు: అమ్మిశెట్టి వాసు

  • అన్యాయంగా భయపెట్టి, బెదిరించి చంపేశారు..
  • దేవినేని అవినాష్ దుర్మార్గానికి నిదర్శనం
  • మీ పార్టీ కోసం కష్టపడి పనిచేస్తే.. మీరిచ్చే బహుమానాలివా..?
  • చోటీ కుటుంబానికి అండగా జనసేన పార్టీ నిలుస్తోంది..
  • జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు భరోసా..

విజయవాడ: రాణిగారితోట, అధికార పార్టీ అండతో పోలీసులు, సచివాలయ ఉద్యోగుల నిర్వాకం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుందని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు మండిపడ్డారు. 17వ డివిజన్ కు రాణిగారితోటకు చెందిన డోకుపర్తి చోటీ సోమవారం ఆకస్మీకంగా మృతిచెందడంతో ఆమె పార్ధివదేహాన్ని అమ్మిశెట్టి వాసు సందర్శించి ఆ కుటుంబానికి జనసేన పార్టీ తరఫున తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం ఆ కుటుంబానికి రూ. 10 వేల ఆర్ధిక సాయాన్ని వాసు అందించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఈ సంఘటన తనను ఎంతగానో కలచివేసిందని, అసలు అధికార పార్టీ నేతలకు ఏమైనా సిగ్గుందా అని ప్రశ్నించారు. దేవినేని అవినాష్ అనే వ్యక్తి ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీలో చేరి ప్రజలను హింసించడమే తన నైజంగా పెట్టుకున్నారన్నారు. విచారణ పేరుతో ఇంటికి వచ్చి గంటల తరబడి పడిగాపులు కాసి వివరాలను సేకరించాల్సిన అవసరం సచివాలయ సిబ్బందికి ఎందుకొచ్చిందన్నారు. గొడవకు ఏలాంటి సంబంధం లేని వ్యక్తి పేరును కూడా అక్రమంగా కేసులో పెట్టి భయాందోళనలకు గురి చేయడం వలనే చోటీ అనే మహిళ మృతి చెందిందన్నారు. ఆ మహిళ మృతి కారకులు ముమ్మాటికీ వైసీపీ నాయకులు, కృష్ణలంక పోలీసులు, సచివాలయ సిబ్బందేనన్నారు. మీ పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేసిన మహిళా కార్యకర్తకు పింఛను ఇవ్వకుండా, అడిగిన పాపానికి ఆ కుటుంబంపై భౌతిక దాడులకు పాల్పడటం దేవినేని అవినాష్ దుర్మార్గానికి నిదర్శమన్నారు. గొడవకు ఏ సంబంధం లేని వ్యక్తులపై కూడా పోక్స్ యాక్డ్, ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ వంటి అక్రమ కేసులు బనాయించిన వారిపై కూడా ప్రైవేటు కేసు వేస్తామన్నారు. బచ్చు మాధవీ అనే వైసీపీ గుండాకు పవిత్రమైన దుర్గగుడి పాలకమండలిలో సభ్యురాలిగా నియామకం చేయడం ఆలయ ప్రతిష్టలకు భంగం కలిగించడమేనన్నారు. ఇప్పటికైనా పోలీసులు ఈ కేసులో నిస్పక్షపాతంగా వ్యవహరించి గొడవకు సంబంధం లేని వాళ్ల పేర్లను తొలగించాలని, చోటీ మృతికి కారకులైన సచివాలయ సిబ్బందిపై కూడా చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ ఘటనకు సంబంధించి సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ లో అడిషినల్ డిఎస్పీ రమణమూర్తికి ఫిర్యాదు చేయడం జరిగింది. మృతిరాలి కుటుంబాన్ని పరామర్శించిన వారిలో జనసేన పార్టీ నాయకులు పోతిరెడ్డి అనిత, కట్టా యాకోబు, వేముల వెంకటేష్, దోమకొండ అశోక్, గాదే అమ్ములు, వి. హరిప్రసాద్, యడ్లపల్లి శివనాగరాజు, గుంటుపల్లి సుజాత, శ్రీపతి శీరిషా తదితరులున్నారు.