వైసీపీకి చుక్కలు చూపిస్తున్న ఎమ్మెల్యే.. వెలగపూడి

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల ప్రకటన చేయడమే కాకుండా, విశాఖను పరిపాలనా రాజధానిగా దాదాపు ఫిక్స్ చేసేసారు. ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేసారు. అధికారికంగా రాజధానిని ప్రకటించి కార్యకలాపాలు మొదలు పెడదాము అంటే అక్కడ కోర్టు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఎప్పటికైనా అన్ని ఇబ్బందులు తొలిగించుకుని తాము అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకుంటాము అనే ధీమాలో వైసిపి అప్పటిలోగా తమకు రాజకీయ శత్రువులు ఎవరూ లేకుండా చేసుకునేందుకు పావులు కదుపుతోంది. రాష్ట్రమంతా వైసీపీ గాలి వీచినా, విశాఖ సిటీ కి వచ్చేసరికి టిడిపి సత్తా చాటుకుంది.

అక్కడి నుంచి నలుగురు ఎమ్మెల్యేలు గెలుపొందడం తో, విశాఖలో చక్రం తిప్పుదామన్నా అనేక ఆటంకాలు ఏర్పడుతున్నాయి. అందుకే అక్కడ టిడిపి ఎమ్మెల్యేలకు గురిపెట్టిన వైసిపి, అనుకున్నట్లుగానే ముగ్గురు ఎమ్మెల్యేలను టీడీపీకి కాస్త దూరం చేయగలిగింది. ఇప్పటికే గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరకపోయినా, టిడిపికి దూరంగానే ఉంటున్నారు. అలాగే వాసుపల్లి గణేష్ దాదాపుగా వైసీపీ లో చేరిపోయినట్లే. గణబాబు రాజకీయంగా సైలెంట్ అయిపోయారు. టీడీపీలో ఉన్నా వైసీపీపై విమర్శలు చేసేందుకు ముందుకు రావడం లేదు.

అయితే ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ మాత్రం వైసీపీకి ఇబ్బందికరంగా మారారు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఆయన మాత్రం వైసీపీ వైపు వచ్చేందుకు కానీ, టీడీపీకి దూరంగా ఉండేందుకు కానీ, ఇష్టపడకుండా వైసీపీ ప్రభుత్వానికి ఇబ్బంది కరంగా మారారు.

ఆయనను తమ వైపు తిప్పుకునేందుకు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా, వర్కౌట్ కాకపోవడంతో రాజకీయంగా ఇబ్బందులు పెట్టేందుకు వెలగపూడి రామకృష్ణ పై వంగవీటి రంగా హత్య కేసును తెరపైకి తెచ్చి వెలగపూడి ని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు. అయినా ఫలితం కనిపించడంతో ఆయనపై అవినీతి అక్రమాల విషయంపైన విమర్శలు చేశారు. ఈ వ్యవహారం ప్రమాణాల వరకు వెళ్ళింది. అయినా ఎక్కడా వెలగపూడి రామకృష్ణబాబు తగ్గడం లేదు వైసీపీ ప్రభుత్వానికి సవాళ్లు విసురుతూనే వస్తున్నారు.