కొత్త సీజన్‌లో ఆంధ్రా నుంచి బరిలోకి అంబటి.. హెచ్‌సీఏ నుండి ఎన్ఓసీ..

అంబటి రాయుడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ని విడిచిపెట్టాడు. కొత్త సీజన్‌లో రాయుడు ఆంధ్ర జట్టుకు ఆడతాడని, ఈ మేరకు అతనికి ఎన్ఓసీ ఇచ్చినట్టు హెచ్‌సీఏ సెక్రటరీ విజయానంద్‌ ధ్రువీకరించారు. దీంతో జనవరి 10 నుంచి జరిగే సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నమెంట్‌లో ఆంధ్ర టీమ్‌ సెలెక్షన్‌కు అంబటి అందుబాటులో ఉండనున్నాడు. ఈ విషయంపై ఒకటి రెండు రోజుల్లో ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ నుంచి కూడా అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. 35 ఏళ్ల రాయుడు హెచ్‌సీఏను వీడి ఆంధ్రకు ఆడడం ఇది రెండోసారి. 2005-06 సీజన్‌లో అతను ఆంధ్రకు ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత బరోడా, విదర్భ జట్లకు ఆడిన రాయుడు.. 2017-18 సీజన్‌లో తిరిగి హైదరాబాద్‌ జట్టులో చేరాడు.

రిటైర్మెంట్‌ను పక్కనబెట్టి మరీ రాయుడు గత సీజన్‌లో విజయ్‌ హజారే, ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీల్లో హైదరాబాద్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ రెండు టోర్నీల్లో జట్టు మంచిగానే రాణించింది. అనంతరం హెచ్‌సీఏలో అవినీతితో టీమ్‌లో చాలా పాలిటిక్స్‌ జరుగుతున్నాయని, డబ్బు, పలుకుబడి ఉన్న వాళ్లనే సెలెక్ట్‌ చేస్తున్నారన్న విషయాలను బయటపెట్టాడు రాయుడు. అర్జున్‌ యాదవ్‌కు సీనియర్‌ టీమ్‌ కోచ్‌గా కొనసాగే అర్హతే లేదన్నాడు. పరిస్థితి ఇలానే ఉంటే టీమ్‌కు, ప్లేయర్లకే చాలా నష్టం అన్నాడు. ఈ విషయాలను అజార్‌కు చెప్పినా పట్టించుకోకపోవడంతో రాయుడు రంజీలకు దూరంగా ఉన్నాడు. అంబటి ఊహించినట్టే ఆ ట్రోఫీలో హైదరాబాద్‌ దారుణంగా ఆడింది. అయితే, రాయుడు బయటపెట్టిన సమస్యలు పరిష్కరించని అజార్‌ తిరిగి అతనిపైనే ఎదురుదాడి చేశాడు. అప్పటి నుంచి అజర్‌, రాయుడికి అస్సలు పడడం లేదని హెచ్‌సీఏ వర్గాలు చెబుతున్నాయి.