కోవ్యాక్సిన్ రెండోదశ ట్రయల్స్‌

భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేస్తున్న కో-వ్యాక్సిన్ రెండోదశ ట్రయల్స్‌ త్వరలోనే ప్రారంభం కానున్నాయి. అందుకోసం భారత్ బయోటెక్ ఇప్పటికే భారత ఔషధ నియంత్రణ సంస్థ అనుమతులు పొందింది. ఈ రెండోదశ ప్రయోగాల నిర్వహణకు హర్యానా రాష్ట్రం రోహ్‌తక్‌లోని పోస్ట్‌ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ (పీజీఐ) వేదిక కానున్నది. కోవ్యాక్సిన్‌ టీకా రెండోదశ ట్రయల్స్‌కు భారత్‌ బయోటెక్‌ నుంచి అనుమతి లభించిందని పీజీఐ వైస్‌ఛాన్సెలర్‌ డాక్టర్‌ ఓపీ కల్రా మీడియాకు తెలిపారు.

కోవ్యాక్సిన్ రెండో దశ ట్రయల్స్‌కు 12 ఏండ్ల నుంచి 65 ఏండ్ల మధ్య వయసు కలిగిన దాదాపు 300 మంది వాలెంటీర్‌లను సిద్ధంగా ఉంచినట్లు ఓపీ కల్రా చెప్పారు. వారిలో ఇప్పటికే కొందరికి స్క్రీనింగ్‌ కూడా పూర్తయ్యిందని ఆయన తెలిపారు. మరికొన్ని గంటల్లోనే కోవ్యాక్సిన్‌ డోసులు ఇక్కడకు చేరుకునే అవకాశం ఉందన్నారు. ఇప్పటివరకు భారత్‌లో దేశీయంగా తయారు చేసిన రెండు వ్యాక్సిన్‌లు మానవ ప్రయోగదశలో ఉన్నాయి. ఐసీఎంఆర్‌ సహకారంతో భారత్‌ బయోటెక్‌ తయారు చేసిన కోవ్యాక్సిన్‌తోపాటు జైడస్‌ కాడిలా వృద్ధి చేసిన వ్యాక్సిన్‌ రెండోదశ ట్రయల్స్‌కు చేరుకున్నాయి.