రహదారి భద్రత చర్యలపై దృష్టి సారించాలి

నిండు నూరేళ్లు జీవించవలసిన వాళ్లు హఠాత్తుగా రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమే కాకుండా చాలా బాధాకరమని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం సమీపంలో గత రాత్రి జరిగిన ఆటో ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని తెలిసి చాలా బాధ కలిగింది. కూలీనాలీ చేసుకుని బత్తలపల్లి గ్రామం నుంచి ధర్మవరానికి వస్తున్న వీరు మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోవడం శోచనీయం. సరైన రవాణా మార్గాలు లేకపోవడం వల్ల గ్రామాల నుంచి పట్టణాలు రావడానికి ఆటోలను ఆశ్రయిస్తున్నారు. వారికి బస్సు సౌకర్యం ఉండి ఉంటే ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదు. వారి ప్రాణాలు నిలబడేవి. ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ధర్మవరం జనసేన నాయకులు మృతుల కుటుంబాలకు అండగా నిలబడ్డారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి స్థానిక అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి. రహదారి భద్రత చర్యలపై దృష్టి పెట్టాలి. ఇటువంటి ప్రమాదాలు జరగకుండా మార్గాలు అన్వేషించాలి. గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణాలు రావడానికి తగినన్ని బస్సులు ఏర్పాటు చేయాలి. అశువులు బాసిన వారి కుటుంబాలకి ప్రభుత్వం ఉదారంగా ఆర్థిక సహాయం అందించాలి. గాయపడిన వారికి మెరుగైన చికిత్సలు చేయించాలి. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని జనసేనాని పేర్కొన్నారు.