కాగ్ రిపోర్ట్స్ లో ప్రభుత్వ బండారం బయటపడుతుంది: దారం అనిత

మదనపల్లె, ప్రపంచం ఒక కుగ్రామం అయిపోయింది. ఇండస్ట్రియల్ రీవేల్యూషన్ వచ్చిన తరువాత దేశాలు గానీ, రాష్ట్రాలు గానీ తమ ప్రాంతాలలో వనరులకు తగ్గట్టు పరిశ్రమలు ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవాలి అని పోటీ పడుతున్నాయి. అలాగే తమ ప్రాంతాలలోని మిగులు వనరులను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసి ఆర్దికంగా అభివృద్ధి చెందాలని తహతహలాడుతున్నాయి. ఇలాంటి విప్లవాత్మక చర్యల వలన ప్రజల జీవన స్థితులు అభివృద్ధి చెందుతాయి అని ప్రభుత్వాలు పరిశ్రమల స్థాపనను తమ ప్రతిష్టగా తీసుకొని ముందుకు వెళతాయి. జగన్మోహన్ రెడ్డి మూడేళ్ల రిపోర్ట్ కార్డ్ ప్రకారం పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనలో రాష్ట్రం ఒక వెలుగు వెలిగిపోతుంది. కానీ వాస్తవంలో ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం, కాగ్ ఇచ్చే రిపోర్ట్స్ లో ఈ ప్రభుత్వ బండారం బయటపడిపోతుంది. దేశంలోనే సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతం గల రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్, లాజిస్టిక్ హబ్ గా చేసుకొని సింగపూర్ దేశంలా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకొనే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆ వైపుగా అడుగులు లేనే లేవు. ఇంత సముద్ర తీర ప్రాంతం ఉన్న మన రాష్ట్రం ఎగుమతుల్లో 9వ స్థానంలో ఉన్నాం అని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి. ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈపిఐ రిపోర్ట్ ప్రకారం మన పరిస్థితి, కానీ జగన్ మూడేళ్ల రిపోర్ట్ కార్డ్ లో 4వ స్థానంలో ఉన్నామన్టూ మనల్ని మోసం చేశారు. ఇక దేశవ్యాప్తంగా ప్రతీ సంవత్సరం ఇచ్చే ఈస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో గత మూడేళ్ల నుండి మన రాష్ట్రం మొదటి స్థానం అని పచ్చి అబద్దం చెప్పారు, కేంద్ర ప్రభుత్వం 2020 నుండి ఈ సంవత్సరం వరకు కరోనా పరిస్థితుల వల్ల ఈ ర్యాంక్ లను విడుదల చేయడం లేదు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను(ఎఫ్.డి.ఐ) ఆకర్షించే రాష్ట్రాలలో మన రాష్ట్రం 12 వ స్థానంలో ఉంది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల విషయంలో మూడేళ్ల రిపోర్ట్ కార్డ్ లో పెద్ద పెద్ద మాటలు చెప్పారు, కానీ 2021-22 కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ 5% వృద్ది సాధించింది. అంతకు ముందు ప్రభుత్వం హయాంలో కూడా ఇదే వృద్ది రేట్ ఉంది దీనిలో మీరు సాధించిన ఘనత ఏంటో మా చిన్న బుర్రలకు అర్దం కాలేదు. భారీ పరిశ్రమలు గురించి మాట్లాడుకుంటే మీరు అధికారంలోకి వచ్చిన తరువాత వచ్చినవి ఏమో గానీ పారిపోయినవి మాత్రం అంతర్జాతీయ సంస్థలు.ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్, అదాని డేటా సెంటర్, హెచెస్బిసి, జాకీ,ఏషియన్ పుల్స్ అండ్ పేపర్ మిల్లులు గ్రూప్ ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు సంస్థలు. ఇండియన్ ఇన్నోవేషన్ ఇండెక్స్ రిపోర్ట్ ప్రకారం రాష్ట్రంలో మానవ వనరుల(హ్యూమన్ కాపిటల్) శాతం 47.43% ఇంత శాతం మానవ వనరులు ఉంటే పెట్టుబడుల ఆకర్షణ లో గొప్పగా ఉండాలి కాని మన రాష్ట్రం ఇన్వెస్ట్మెంట్ శాతం 4.1% ఉంది అంటే ప్రభుత్వం ఎలా పని చేస్తుందో అర్దం అయిపోతుంది. ప్రజలారా! దీని వెనుక ఏదో పెద్ద రాకెట్ సైన్స్ లేదు, మనం చాలా మామూలుగా ఆలోచిస్తే రాష్ట్రం అప్పుల్లో ఉంది ఇది అధికార పార్టీ వాళ్ళు కూడా ఒప్పుకునే నిజం. కారణం మన ఖర్చులు ఎక్కువ అయ్యాయి, రాబడి తగ్గిపోయింది. రాష్ట్రాలకు రాబడి పరిశ్రమల స్థాపన ద్వారానే వస్తుంది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పరిశ్రమల ఆకర్షణలో ఘోరంగా విఫలం అయ్యారు. ఫలితంగా మంచి చదువులు చదువుకున్న మన పిల్లలు వేరే రాష్ట్రాలకు ఉపాధి కోసం వెళ్లిపోవల్సి వస్తుంది. మూడేళ్ల రిపోర్ట్ కార్డ్ పట్టుకొని తిమ్మిని బమ్మిని చేసి మనల్ని అంకెల మాయాజాలంతో మోసం చేస్తున్నారు. మీరు నిజాలు పోల్చి చూసుకొని మోసపోవద్దు అని నా మనవి అని చిత్తూరు జిల్లా కార్యదర్శి దారం అనిత అన్నారు.