గుంకలాంలో పేదలందరికీ ఇళ్లు పథకం అమలు పరిశీలించనున్న పవన్ కళ్యాణ్

* 13వ తేదీన గుంకలాం పర్యటన
వైసీపీ ప్రభుత్వం ‘పేదలందరికీ ఇళ్లు’ పథకంలో 28 లక్షల ఇళ్లు నిర్మిస్తామని ఆదేశాలు ఇచ్చినా ఇప్పటికీ క్షేత్ర స్థాయిలో పేదలకు ఇళ్లు దక్కని పరిస్థితి నెలకొంది. జగనన్న కాలనీలు పేరిట జరిగిన అక్రమాలు, పేద లబ్ధిదారులను వంచించిన తీరును ప్రజలందరికీ తెలియచెప్పేలా జనసేన పార్టీ ‘జగనన్న ఇళ్లు – పేదలందరికీ కన్నీళ్లు’ పేరుతో కార్యక్రమం చేపట్టింది. #JaganannaMosam హ్యాష్ ట్యాగ్ ద్వారా కాలనీలు, గృహనిర్మాణ స్థితిగతులను సామాజిక మాధ్యమాల్లో చూపించబోతున్నారు. ఈ నెల 12, 13, 14 తేదీల్లో ఈ కార్యక్రమాన్ని జనసేన చేపట్టింది. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈ నెల 13వ తేదీన విజయనగరం జిల్లా గుంకలాంలో పేదలందరికీ ఇళ్లు పథకం అమలు తీరును పరిశీలిస్తారు. 397 ఎకరాల్లో భారీ ఎత్తున ఇళ్లు నిర్మిస్తున్నామని ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు వైసీపీ ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసి, పైలాన్ ఆవిష్కరించారు. గుంకలాంను నగర పంచాయతీ చేస్తామని, రోడ్లు, విద్యుత్, తాగునీరు లాంటి మౌలిక వసతులు కల్పిస్తామని ప్రకటించారు. 13వ తేదీ ఉదయం పవన్ కళ్యాణ్ గుంకలాం చేరుకొని అక్కడి ఇళ్లను పరిశీలిస్తారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ మేరకు కార్యరూపం దాల్చాయి, పథకం అమలు తీరుని లబ్ధిదారులతో మాట్లాడి తెలుసుకుంటారు.