జగనన్న ఇళ్ల అవినీతి బాగోతం బయటపెట్టింది జనసేన పార్టీనే

* పేదల భూముల పేరుతో వైసీపీ నాయకులు కోట్ల రూపాయలు వెనకేసుకున్నారు
* ముఖ్యమంత్రి నిజంగా నాయకుడైతే సొంత నియోజకవర్గంలో రైతుల ఆత్మహత్యలు ఎందుకు?
* సమష్టిగా వైసీపీ ప్రభుత్వ దాష్టీకాలపై పోరాడుదాం
* ఆమదాలవలస నియోజకవర్గ సమీక్షలో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్

‘జగనన్న ఇళ్లలో జరిగిన అవినీతి తంతును బయటపెట్టింది జనసేన పార్టీ. అప్పటి వరకు సామాన్య ప్రజానీకానికి జగనన్న ఇళ్లలో జరిగిన అతి పెద్ద మోసం, అవినీతి గురించి పెద్దగా తెలియకపోయినా, జనసేన చేపట్టిన మూడు రోజుల సోషల్ ఆడిట్ తర్వాత అసలు తంతు గురించి సామాన్యులకు కూడా తెలిసింది. పేదలకు ఇళ్ల పేరుతో వైసీపీ ప్రభుత్వం చేసిన అతి పెద్ద అవినీతి స్కాం బయటపెట్టింది జనసేన మాత్రమే’ అని పార్టీ రాజకీయ వ్యవహారాలు కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అన్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నియోజకవర్గాల సమీక్షలో భాగంగా శనివారం సాయంత్రం ఆమదాలవలస నియోజకవర్గ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ మనోహర్ గారు మాట్లాడుతూ “పేదల భూములను తక్కువ ధరలకు కొనుక్కుని రాత్రికి రాత్రి వాటి ధరలను పెంచి ప్రభుత్వం వద్ద నుంచి భారీగా పరిహారం పొంది వైసీపీ నాయకులు వేల కోట్ల రూపాయలు వెనకేసుకున్నారు. పేదవాడికి సెంటు స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోమని చెప్పారు. పేదలకు ఇచ్చే స్థలంలో అతిపెద్ద కుంభకోణానికి పాల్పడ్డారు. ఇళ్ల స్థలాల కొనుగోలు కోసమే వైసీపీ ప్రభుత్వం ప్రజాధనం నుంచి ఏకంగా రూ.23,500 కోట్లు వెచ్చించింది. దీనిలో భారీ అవినీతికి పాల్పడింది. జనసేన జగనన్న ఇళ్ల పై సోషల్ ఆడిట్ నిర్వహిస్తుంది అని తెలియగానే 28 లక్షల లబ్ధిదారులు కాస్త 21 లక్షలు అయ్యారు. మధ్యలో ఏడు లక్షల మంది ఎక్కడికి వెళ్లి పోయారో కూడా అర్థం కాని పరిస్థితి. పేదల ఇళ్ల పేరుతో ఈ ప్రభుత్వం దగా చేసింది. కొండల్లో, గుట్టల్లో పేదలకు ఇచ్చిన స్థలాల్లో ఇప్పుడు వెంటనే ఇల్లు కట్టుకోవాలని బెదిరిస్తున్నారు. పేదలు అప్పు చేసి ఇల్లు కట్టుకుంటే మేమే కట్టించాం అని చెప్పుకోవడానికి ఆరాట పడుతున్నారు. రాష్ట్రంలోని రోడ్ల సమస్య మీద సైతం జనసేన పార్టీ ‘గుడ్ మార్నింగ్ సీఎం సార్’ పేరుతో నిర్వహించిన కార్యక్రమం జాతీయ స్థాయి వరకు వెళ్ళింది.
* ఇసుక మాఫియా వల్లే అన్నమయ్య డ్యాం విలయం
ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో 46 మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా పులివెందుల నియోజకవర్గంలో ఆత్మహత్యకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రయత్నించినా వైసీపీ పెద్దలు వారిని బెదిరించి అడ్డగించారు. ముఖ్యమంత్రి బలమైన నాయకుడు అయితే సొంత నియోజకవర్గంలో రైతు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతాయి? జనసేన పార్టీ సాయం అందుకునేందుకు సైతం 19 మందిని బెదిరించి ఆపేశారు. సీఎం సొంత జిల్లాలో అన్నమయ్య డ్యాం తెగిపోవడానికి కూడా అక్కడి ఇసుక మాఫియానే కారణం. అన్నమయ్య ప్రాజెక్టుకు వరద ముంపు భయం ఉందని, వస్తున్న వర్షాల మీద వాతావరణ శాఖ హెచ్చరికలు పంపినా ఇసుక ప్రోక్లైనర్లు, లారీలు కొట్టుకుపోతాయని అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు ఎత్తనివ్వలేదు. దీంతోనే ప్రాజెక్టు తెగిపోయింది.. 44 మంది మృత్యువాత పడ్డారు. ఇప్పటికీ ప్రభావిత గ్రామాల్లో బాధితులకు ఇళ్లు కట్టించలేదు. ఇటీవల ప్రాజెక్టు తెగిపోయి సంవత్సరం అయిన సందర్భంగా ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నప్పుడు అక్కడి ప్రజల బాధలు, గాధలు వింటే మనసు చలించింది. ప్రాజెక్టు తెగిపోయిన 12 రోజుల తర్వాత ఆ ప్రాంతంలో పర్యటించిన ముఖ్యమంత్రి బాధితులకు మూడు నెలల్లోగా ఇల్లు కట్టిస్తామని చెప్పిన హామీ పూర్తిగా గాలిలో కలిసిపోయింది. సొంత జిల్లాకు, సొంత నియోజకవర్గానికి న్యాయం చేయలేని ఈ ముఖ్యమంత్రి బలమైన నాయకుడు, పాలకుడు అసలే కాదు.
* గ్రామ సభలకు హాజరవ్వండి
గ్రామాల్లో అభివృద్ధి కోసం ప్రతి గ్రామంలో నిర్వహించే గ్రామ సభలకు జనసైనికులు హాజరు కావాలి. ఆ గ్రామ అభివృద్ధికి వచ్చిన నిధులు, దాని ఖర్చుల లెక్క ఉంటుంది. దీనిమీద జనసైనికులు లోతుగా ఆలోచిస్తే నిధులు వినియోగం, అవినీతి గురించి తెలుస్తుంది. కచ్చితంగా ఏమాత్రం అవకతవకలు జరిగినా ప్రశ్నించడానికి వెనుకాడాల్సిన అవసరం లేదు. శ్రీకాకుళం ప్రజానీకానికి చైతన్యం ఎక్కువ. అన్ని విషయాల మీద అవగాహన ఉంటుంది. శ్రీ పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే ప్రతి అభిమాని బాధ్యత గల కార్యకర్తగా తయారు కావలసిన సమయం వచ్చింది. ఆయన ఆశయాలను బతికించడానికి, ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రతి కార్యకర్త వచ్చే సంవత్సరం పాటు తీవ్రంగా కష్టపడాలి. పదవులు విజిటింగ్ కార్డు కాదు.. అదో పెద్ద బాధ్యత. రెండు ఫ్లెక్సీలు మూడు సోషల్ మీడియా పోస్టులుపెడితే నాయకులు కారు. కచ్చితంగా క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యల మీద పోరాడేందుకు మీకు జనసేన పార్టీ వేదిక కావాలి. చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని పక్కనపెట్టి కేవలం జనసేన పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కోసం పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది” అని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు ముత్తా శశిధర్, శ్రీమతి పాలవలస యశస్వి, పెదపూడి విజయ్ కుమార్, కళ్యాణం శివ శ్రీనివాస్, బోడపాటి శివదత్, పేడాడ రామ్మోహన్, పాత్రుని పాపారావు, పేడాడ అప్పలనాయుడు, అంపిలి విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.