జన సైనికులే జనసేనకు బలమైన పునాదులు

*అభిప్రాయ భేదాలతో సమయం వృధా చేయడం మానేద్దాం
* పవన్ కల్యాణ్ మార్గ నిర్దేశంలో కలసికట్టుగా పనిచేద్దాం
*జనసేన పార్టీ పీఏసీ సభ్యులు కొణిదెల నాగబాబు

జనసేనాని పవన్ కల్యాణ్ భావజలానికి కట్టుబడి సమాజ శ్రేయస్సు కోసం పని చేస్తున్న జన సైనికులే జనసేనకు బలమైన పునాదులు అని జనసేన పార్టీ పీ.ఏ.సీ. సభ్యులు కొణిదెల నాగబాబు స్పష్టం చేసారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా బుధవారం శ్రీకాకుళం జిల్లాలో నియోజకవర్గాల వారిగా జరిగిన సమావేశాల్లో నాగబాబు కార్యకర్తలతో ముఖాముఖి మాట్లాడారు. జనసైనికులు అభిప్రాయ భేదాలతో సమయం వృధా చేయకుండా జనసేనాని పవన్ కల్యాణ్ మార్గ నిర్దేశంలో నడుస్తూ రాజ్యాధికారం ధ్యేయంగా పని చెయ్యాలని సూచించారు. జనసేన పార్టీ గెలుపు చారిత్రాత్మక అవసరం అనే భావన ప్రజల్లో పెరుగుతోందని దానికి అనుగుణంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చెయ్యాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. వై.సీ.పీ అధికార మదంతో, రాక్షస పాలనతో వ్యవస్థలను పతనం చేస్తున్న విధానం, పర్యావరణాన్ని నాశనం చేస్తున్న తీరు పట్ల ప్రజల్లో అసహనం పెరిగిపోతోందని అన్నారు. భవిష్యత్తు తరాల ప్రయోజనం కోసం పవన్ కల్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలి అనే అభిప్రాయానికి ప్రజలు వచ్చారని అన్నారు. ప్రతీ నియోజకవర్గంలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా ప్రయోజన కార్యక్రమాలు చేపట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ ఎదుగుదలకు దోహద పడే అభిప్రాయాలు స్వీకరిస్తూనే, భవిష్యత్ కార్యకలాపాల పట్ల కార్యకర్తలకు నిర్దేశం చేసారు. రాజకీయ వ్యవహారాల కమిటీతో చర్చించి సాధ్యమైనంత తొందరలో అన్ని నియోజక వర్గాలకు, మండలాలకు ఇంచార్జీలను, కమిటీలను ఏర్పాటు చెయ్యాల్సిన ఆవశ్యకతను పవన్ కల్యాణ్ గారి దృష్టికి తీసుకు వెళతానని అన్నారు. పార్టీ రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులతో, నియోజకవర్గం బాధ్యులతో మమేకమై సమన్వయంతో పార్టీ కార్యకలాపాలు, సామాజిక కార్యక్రమాలు నిర్వహించాలని కార్యకర్తలకు సూచించారు. జనసేన పార్టీ రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు, శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, పాత పట్నం, నర్సన్న పేట, ఆముదాలవలస, శ్రీకాకుళం, రాజాం, పాలకొండ, ఎడ్చెర్ల నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులుగా, వార్డ్ మెంబర్లుగా పోటీ చేసి గెలుపొందిన ప్రజా ప్రతినిధులు, పోటీలో నిలిచిన వారు పాల్గొన్నారు.
*జనసేనలో చేరికలు..
జనసేన పార్టీ సిద్ధాంతాలు, విధానాల పట్ల ఆకర్షితులై పవన్ కల్యాణ్ గారి భావజాలానికి అనుగుణంగా పని చెయ్యాలని జనసేన పార్టీలో చేరేందుకు వచ్చిన పలువురు నాయకులను నాగబాబు గారు పార్టీ కండువాలతో సత్కరించి పార్టీలోకి ఆహ్వానించారు.