జనసేన భీమ్ యాత్ర 14వ రోజు

కాకినాడ సిటి: జగన్నాధపురంలోని బాపూజీ నగర్లో బోడపాటి మరియా ఆధ్వర్యంలో గురువారం కాకినాడ సిటీ ఇన్చార్జ్ & పీఏసీ సభ్యులు ముత్తా శశిధర్ నాయకత్వంలో జనసేన భీమ్ యాత్ర నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ శ్రేణులు స్థానికులని కలిసి ఇక్కడ ఉన్న పరిస్థితులపై వాకబు చేసారు. అనంతరం స్థానికులతో మాట్లాడుతూ దళితులపై ఈ ముఖ్యమంత్రికి నిజమైన ప్రేమ ఉంటే దళిత వాడలని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు. మాటల్లో కోటలు కడతాడు ఈ ముఖ్యమంత్రి చేతల్లో మాత్రం శూన్యం అని ఎద్దేవా చేసారు. వై.సి.పి ప్రభుత్వానివి ఎంత అనాలోచితమైన చేష్టలో తెలియాలంటే మచ్చుక్కి చూస్తే విద్యార్ధుల సంఖ్య తక్కువ ఉందని కొన్ని స్కూళ్ళను దూరంగా ఉన్న ఇంకోదానిలో విలీనం చేస్తున్నారనీ, పైగా పిల్లలకి ఆంగ్లంలో బోధన అంటారనీ, అసలు పిల్లలు చదువులకోడానికి విముఖత చూపెడుతుంటే తాదూరసందులేదు మెడకో డోలు అన్నట్టుందన్నారు. దళితులను పైకి తీసుకురావాలన్న చిత్తశుద్ధి ఈ వై.సి.పి ప్రభుత్వానికి లేదని ఇట్టే తెలిసిపోతొందనీ అందుకే ఇలాంటి ప్రజావ్యతిరేక నిర్ణయాలను వ్యతిరేకిస్తూ జనసేన & తెలుగుదేశం పార్టీలు ఉమ్మడిపోరాటం చేస్తున్నాయని స్థానికులకు వివరించారు. తదుపరి స్థానిక బాబూ జగజ్జీవన్ రాం గారి విగ్రహానికి నివాళులు అర్పించి అక్కడి మట్టిని కలశంలో సేకరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సిటీ ఉపాధ్యక్షుడు అడబాల సత్యనారాయణ, బోడపాటి మరియా, బండి సుజాత, సోనీ ఫ్లోరెన్స్, దీప్తి, భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.