నేతాజీ స్ఫూర్తిని భావి తరాలకు అందించాలి

స్వాతంత్ర్య సంగ్రామాన భారత యువతలో పోరాట స్ఫూర్తిని నింపిన చిరస్మరణీయ యోధుడు నేతాజీ సుభాష్ చంద్ర బోస్. ఆజాద్ హింద్ ఫౌజ్ ద్వారా సైన్యాన్ని సిద్ధం చేసిన విధానం ఆయనలోని దేశభక్తిని, స్వాతంత్ర్య కాంక్షను, రణతంత్రాన్ని వెల్లడించింది. ఆ మహనీయుని జయంతి సందర్భంగా మనఃపూర్వకంగా అంజలి ఘటిస్తున్నానంటూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. టోక్యో నగరంలో ఉన్న రెంకోజీ టెంపుల్ సందర్శించాను. అక్కడి నేతాజీ స్మారకాలను దర్శించుకున్నప్పుడు ఆ పోరాట యోధుడి త్యాగనిరతి నా మదిలో మెదిలింది. ‘పల్లె పల్లెకు పర్యటించి భరత జాతికి వీర రసం నూరి పోసిన వీరుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్’ అని కవి చక్రవర్తి గుర్రం జాషువా గారు చెప్పిన మాటలు స్ఫురణకు వచ్చాయి. ఆ మహనీయుడు మన భరత జాతికి అందించిన స్ఫూర్తినీ, మనలో నింపిన పోరాట పటిమను- భావి తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జనసేనాని పేర్కొన్నారు.