ఒక్క ఛాన్స్ ఇస్తే దుల్హన్ పథకం దూరమైంది

*మైనార్టీల అభ్యున్నతికి బలంగా నిలబడతాం: పవన్ కళ్యాణ్
వైసీపీ ప్రభుత్వానికి ఒక్క ఛాన్స్ ఇస్తే దుల్హన్ పథకం తీసివేసిందనీ, మైనారిటీ విద్యార్ధులు విదేశాలకు వెళ్లి చదువకునే అవకాశాలు లేకుండా చేసిందని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానించారు. మైనారిటీలను అక్కున చేర్చుకుంటామని చెప్పి ఇప్పుడు కేసులు పెట్టి బెదిరిస్తున్నారని తెలిపారు. జనసేన పార్టీ మైనారిటీలను ఓటు బ్యాంకుగా కాకుండా తోటి సోదరులుగా ఆదరిస్తామన్నారు. జనవాణి – జనసేన భరోసా కార్యక్రమంలో మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి సభ్యులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. పలు అంశాలపై అర్జీలు సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ.. ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు ఈ ప్రభుత్వం ముస్లిం సోదరుల అభివృద్ధిని దెబ్బతీసే కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్తోంది. ఆంధ్రప్రదేశ్ బాగుంటే మైనారిటీల అభివృద్ధి బాగుంటుందని నన్ను కలసిన మైనారిటీ సోదరులు చెప్పారు. జనసేన పార్టీ ఎన్నికల్లో ఓట్ల కోసం క్యాప్ లు పెట్టుకుని ఆకర్షించడం, రంజాన్ టైమ్ లో విందులు ఏర్పాటు చేసి ఆ తర్వాత వదిలేయడం చేయదు. మైనారిటీ సోదరులను జనసేన పార్టీ ఓటు బ్యాంకుగా చూడదు. వైసీపీ నాయకులు ఇఫ్తార్ విందులకు వెళ్తారు.. పెద్దల సభలో స్వయంగా ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మండలి ఛైర్మన్ ని అగౌరవపరిచిన పరిస్థితులు. రాష్ట్రంలో ఓ ముస్లిం సోదరుడి కుటుంబం మొత్తం వేదింపులు తాళలేక బలవన్మరణానికి పాల్పడిన దుస్థితి. మైనారిటీ ఆడబిడ్డల మానమర్యాదలకు భంగం కలిగితే ఇప్పటికీ ఎవరు ఆ దుశ్చర్యకు పాల్పడ్డారో నిర్ధారణ చేయలేదు. ఆడబిడ్డల మాన మర్యాదలకు భంగం వాటిల్లిన సందర్భాలు మతకలహాలకు ఆజ్యం పోస్తాయి. ముజఫర్ నగర్ లో ఈవ్ టీజింగ్ సమస్య అల్లర్లకు కారణమైంది. ఇలాంటి పరిస్థితుల్ని ఆదిలోనే తుంచేయకపోతే మతాల మధ్య సామరస్యం దెబ్బతింటుంది. జనసేన ఓటు బ్యాంకు రాజకీయాలు చేయదు గాక చేయదు. మైనారిటీ సోదరుల సమస్యల పరిష్కారానికి బలంగా నిలబడతాం. సమస్యలపై పదే పదే గళం విప్పుతాం. ప్రభుత్వ శాఖల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరానికి కృషి చేస్తామని అన్నారు.