జిల్లాకో దివ్యాంగుల పునరావాస కేంద్రం ఏర్పాటు చేయాలి

*రూ.15 వేల పింఛను ఇవ్వాలని పవన్ కళ్యాణ్ డిమాండ్
దివ్యాంగుల కోసం ప్రతి జిల్లా కేంద్రంలో ఒక పునరావాస కేంద్రం ఏర్పాటు చేయాలని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కోరారు. ముఖ్యమంత్రి సహాయ నిధిలో బలమైన శాతం దివ్యాంగులకు కేటాయించాలన్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి రూ. 15 వేల ఫించన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జనవాణి కార్యక్రమంలో దివ్యాంగుల వెల్ఫేర్ సొసైటీ సభ్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. ప్రభుత్వం నుంచి ఆదరణ కరువైన పరిస్థితుల్లో దీర్ఘకాలిక రోగాలతో బాధ పడుతున్న దివ్యాంగులు, వారి కుటుంబాలు పడుతున్న ఇబ్బందులను వివరించారు. ప్రభుత్వం నుంచి కనీస సదుపాయాలు అందేలా ఒత్తడి తేవాలని కోరారు. అనంతరం దివ్యాంగుల సమస్యల మీద శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తూ… విధివశాత్తు ప్రత్యేక పరిస్థితుల్లో దివ్యాంగులుగా పుట్టిన వారి బాధను చూస్తే చాలా బాధ కలుగుతుంది. ఎన్నో సందర్భాల్లో దివ్యాంగుల కష్టాలు విని చలించిన వాడిని. చిన్నతనంలో బిడ్డల్ని అంతా మోస్తారు? వయసు పెరిగినప్పటికీ పసి బిడ్డల మాదిరి చూసుకోవాలంటే అలాంటి బిడ్డల్ని కన్న తల్లిదండ్రుల బాధ వర్ణణాతీతం. తల్లిదండ్రులు నిస్సహాయ స్థితికి వెళ్లిపోతారు. మజిల్ డిస్నోఫీ లాంటి వ్యాధులు సోకితే కండరాలు బలం కోల్పోయే పరిస్థితి. ప్రభుత్వంలో 151 మంది ఎమ్మెల్యేలు, 30 మందికి పైగా పార్లమెంటు సభ్యులు ఉండి అలాంటి వారికి ఎంత చేయాలి. పోరాట యాత్రలో ఎంతో మంది ప్రభుత్వ ఆదరణ లేక తాము పడుతున్న ఇబ్బందులు వివరించారు. కదలలేని స్థితిలో ఉన్న వారికి రాజధాని అమరావతిలో ప్రభుత్వం తరఫున పునరావాస కేంద్రం ఏర్పాటు చేయాలన్న డిమాండ్ మా ముందుకు వచ్చింది. జనసేన పార్టీ తరఫున ప్రతి జిల్లాలో ఒక పునరావాస కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. ఎన్నికల సమయంలో జనసేన పార్టీ మేనిఫెస్టోలో దివ్యాంగులకు ప్రత్యేక స్థానం కల్పించాం. దివ్యాంగులకు ఒక వీల్ చైర్ ఇచ్చి వదిలేస్తున్నాం. వారిలో చాలా మంది మేధావులు ఉంటారు. వారికి ప్రత్యేకంగా స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలి. వారి భారం మొత్తం కుటుంబ సభ్యుల మీద పడకుండా చూడాలి. ప్రతి నెలా ఫించన్ తో పాటు ఎలక్ట్రికల్ వీల్ ఛైర్లు, వారి కోసం ప్రత్యేకంగా కేర్ టేకర్లను ఏర్పాటు చేయాలి. వైసీపీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువచ్చి దివ్యాంగులకు న్యాయం జరిగే ఏర్పాటు చేస్తామని అన్నారు. దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో ఉన్న వారు, వృద్ధులు తమ సమస్యలు చెప్పుకోవడానికి జనవాణి కార్యక్రమానికి వచ్చిన సందర్భంలో పవన్ కళ్యాణ్ స్వయంగా వేదిక దిగి బాధితుల చెంతకు వెళ్లి వారి సమస్యలు ఆలకించారు. ఓపికగా కింద కూర్చుని దివ్యాంగుల సమస్యలు వినడంతో పాటు వారి కోరిక మేరకు ప్రత్యేకంగా ఫోటోలు దిగారు.