కూల్చివేతల ప్రభుత్వం కూలిపోతుంది

మనకు అనుకూలంగా ఓటు వేసినవారే మనవాళ్ళు.. ఓటు వేయనివారు శత్రువులు.. వారి పీచమణిచేద్దామని పాలన చేస్తే రాక్షస రాజ్యమే ఆవిష్కృతమవుతుందని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పాలన నూటికి నూరుశాతం మనవారు కాని వారిని ‘తొక్కి నార తీయండి ‘ అనే విధంగా కొనసాగుతోంది. పాలకులు తమకు ఓటు వేసిన 49.95 శాతం ఓటర్లకు మాత్రమే పాలకులం అని భావిస్తున్నట్లు వారి చర్యలు చూస్తే అర్ధమవుతోంది. ఇందుకు ప్రబల తార్కాణం- నేటి ఉదయం నుంచి ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో సాగుతున్న అరాచకమే. మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామవాసులు జనసేన మద్దతుదారులు కావడమే వై.సి.పి. ప్రజాప్రతినిధుల ఆగ్రహానికి కారణం. మార్చి 14వ తేదీన జనసేన ఆవిర్భావ సభకు చోటిచ్చి సహకరించడమే స్థానిక ప్రజాప్రతినిధి ఆగ్రహానికి కారణం. అమరావతిలోనే ఆవిర్భావ సభ జరపాలని నిర్ణయించి సభాస్థలి కోసం అన్వేషిస్తున్న తరుణంలో సభకు చోటు ఎక్కడా దొరకకుండా అధికార పార్టీ నేతలు బెదిరింపులు, హెచ్చరికలకు పాల్పడ్డారు. ఇప్పటంవాసులు సభ తమ గ్రామంలో జరుపుకోండని ధైర్యంగా ముందుకు రావడమే నేటి కూల్చివేతలకు కారణం. మార్చి 14న సభ జరిగిన తరువాత ఏప్రిల్ నెలలో రోడ్డు విస్తరణ అంటూ నోటీసులు ఇచ్చారు. ప్రధాన రహదారికి కాస్త పక్కగా రాకపోకలకు దూరంగా ఉంటూ ప్రశాంతంగా ఉండే గ్రామం ఇప్పటం. ఈ గ్రామం మీదుగా వాహనాల రాకపోకలు ఉండవు. ఇప్పటికే ఊరిలో 70 అడుగుల రోడ్డు ఉంది. దీనిని ఇప్పుడు 120 అడుగులకు విస్తరించి గ్రామానికి అదనపు హంగులు తెచ్చేయాలని స్థానిక ప్రజా ప్రతినిధి గారు ఉవ్విళ్లూరుతున్నారు. ఆయన ఉత్సాహానికి కారణం కేవలం కక్ష సాధింపు. ఆ వంకతో తమకు ఓటేయని వారి ఇళ్ల తొలగింపు. ఈ ఉదయం నుంచి పోలీస్ బలగాల సాయంతో జె.సి.బి.లతో నిర్ధాక్షిణ్యంగా కూల్చి వేస్తున్నారు. నిజానికి ప్రధాన రహదారి నుంచి ఈ గ్రామానికి వెళ్లే అప్రోచ్ రోడ్డు మాత్రం 15 అడుగులు మాత్రమే ఉంది. కూల్చివేత నోటీసులపై ఊరివారందరూ హైకోర్టును ఆశ్రయించారు. దాంతో ఆగమేఘాలమీద ఈ రోజు కూల్చివేతలు చేపట్టారు. రోడ్డు పక్కనే మంచినీటి ట్యాంక్ ఉంది. దానిని అలానే ఉంచి ట్యాంక్ పక్కన ఉన్న ఇంటిని కూడా కూలగొట్టారు. ఈ దుర్మార్గాన్ని అడ్డుకోవడానికి వెళ్లిన జన సైనికులు, వీర మహిళలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని.. దుర్మార్గానికి అండగా నిలబడ్డారు. ఇప్పటం గ్రామస్తుల ప్రజా పోరాటానికి, న్యాయ పోరాటానికి జనసేన అండగా నిలబడుతుందని ఈ సందర్బంగా స్పష్టం చేస్తున్నాను. రెండురోజుల క్రితం మా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఈ గ్రామాన్ని సందర్శించి గ్రామ సభలో ప్రసంగిస్తున్న తరుణంలో గ్రామంలో విద్యుత్ ను నిలిపివేసి తమ కుసంస్కారాన్ని ప్రదర్శించారు. ఇటువంటి దుష్ట చర్యలపై అలుపెరగని పోరాటం చేస్తాం. కూల్చివేతలతో పాలన ప్రారంభించిన ఈ ప్రభుత్వం కూలిపోయే రోజు ఎంతో దూరం లేదు. ఇప్పటం వాసులకు జనసేన అండగా నిలబడుతుందని శ్రీ పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.