18 ఏళ్ళు నిండిన వారంతా ఓటర్లుగా నమోదు కావాలి: వంగల దాలినాయుడు

పార్వతీపురం, శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల విద్యార్థులకు ఓటు నమోదుపై అవగాహన కల్పించిన జనసేన పార్టీ నాయకులు వంగల దాలినాయుడు ప్రతి ఒక్క విద్యార్థి ఓటు విలువ తెలుసుకోవాలని జనసేన పార్టీ నాయకులు వంగల దాలినాయుడు అన్నారు. శుక్రవారం పార్వతీపురం పట్టణంలోని శ్రీ వేంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు ఓటు నమోదుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య భారతదేశంలో రాజ్యాంగం కల్పించిన అమూల్యమైనది ఓటు అన్నారు. ఆ ఓటు హక్కు ద్వారా మన పాలకుల్ని మనమే ఎన్నుకునే అవకాశం ఉందన్నారు. నీతి, నిజాయితీ కలిగిన వ్యక్తులను ఎన్నుకునే అవకాశం ఉందన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు కావాలన్నారు. అలాగే ఇంకా ఓటరుగా నమోదు కాని వారిని ఓటర్లుగా చేర్పించాలన్నారు. ఈ నెల తొమ్మిదో తేదీ వరకు ఎన్నికల కమిషన్ ఓటర్లుగా నమోదయ్యేందుకు అవకాశం ఇచ్చిందన్నారు. 2024 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారంతా ఓటరుగా నమోదు కావాలన్నారు. ఓటు నమోదు ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చన్నారు. బి ఎల్ వో వద్ద కానీ, కళాశాల వద్ద కానీ, ఆన్లైన్లో కానీ ఓటరుగా నమోదు అవ్వచ్చు అన్నారు. ఓటు హక్కు కలిగి ఉంటే భవిష్యత్తులో రాజకీయాల్లో కూడా రాణించవచ్చన్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా దేశానికి ప్రధానమంత్రి అయినా ఒకప్పటి విద్యార్థులే నన్న విషయాన్ని అవగతం చేసుకోవాలన్నారు. ఓటుపై అవగాహన పెంచుకొని ప్రతి ఒక్కరూ రాజ్యాంగం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇప్పుడు ఓటును నమోదు చేసుకుంటే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసే అవకాశాన్ని పొందవచ్చన్నారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా 18 ఏళ్ళు నిండిన వారంతా ఓటర్లుగా నమోదు కావాలన్నారు. అనంతరం విద్యార్థులు అనుమానాలను నివృత్తి చేశారు.