సైనికులకు యావత్ భారతదేశం సదా ఋణపడి ఉంటుంది: ఆళ్ళ హరి

జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి

దేశ సరిహద్దుల్లో కంట కునుకు తియ్యకుండా భారతదేశంలోని నూట ముప్పై కోట్ల ప్రజానీకాన్ని కంటికిరెప్పలా కాపాడుతున్న సైనికులకు యావత్ భారతదేశం సదా ఋణపడి ఉంటుందని జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు.

కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా సోమవారం శ్రీనివాసరావుతోటలోని రామనామక్షేత్రం వద్ద నున్న భారతమాత విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి విజయోత్సవ వేడుకలు నిర్వహించారు.

భరతమాత కి జై దేశం కోసం అమరులైన వీరులకు జోహార్లు అంటూ నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా ఆళ్ళహరి మాట్లాడుతూ భారతదేశ భూభాగాన్ని అక్రమించుకోవాలని చూసిన పాకిస్తాన్ ముష్కరులను మన సైనికులు వీరోచితంగా ఎదుర్కొని మన భూభాగాన్ని విడిచిపెట్టేవరకు తరిమితరిమి కొట్టారన్నారు.

ఈ యుద్ధంలో ఎంతోమంది సైనికులు తమ అవయవాలు తెగిపడుతున్నా దేశం కోసం తమ తుదిశ్వాస వరకు పోరాడుతూ సుమారు 527 మంది సైనికులు వీరమరణం పొందారని , సుమారు 1500 మందికి తీవ్రగాయాలయ్యాయని అన్నారు. దేశ రక్షణలో సైనికులు చేసిన ప్రాణ త్యాగాన్ని ప్రతీ భారతీయుడు సదా స్మరించుకుంటున్నారన్నారు.

ప్రతీఒక్కరూ పిల్లలకు సైనికుల త్యాగాల్ని తెలియచేస్తూ వారిలో దేశభక్తి పెంపొందెలా కృషి చేయాలని ఆళ్ళ హరి కోరారు. దళిత నాయకులు కొర్రపాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ సైనికుల త్యాగాలను, పరాక్రమాన్ని దేశప్రజలు నిత్యం స్మరించుకుంటూ ఉంటారన్నారు. కార్యక్రమంలో కోనేటి ప్రసాద్, పార్టీ నగర కార్యదర్సులు బండారు రవీంద్ర, షేక్ మెహబూబ్ బాషా, షర్ఫుద్దీన్, దాసరి రాము, వడ్డె సుబ్బారావు , గోపిశెట్టి రాజశేఖర్, నండూరి స్వామి, మిరియాల వెంకట్ , రేపల్లె కోటేశ్వరరావు , రవి తదితరులు పాల్గొన్నారు.