మామకు ఘననివాళి అర్పించిన ఏపీ సీఎం జగన్

అనారోగ్యంతో మృతిచెందిన తన మామ ఈసీ గంగిరెడ్డికి సీఎం జగన్‌ ఘన నివాళి అర్పించారు. ఈ ఉదయం పులివెందుల వెళ్లిన జగన్.. భాకారాపురంలోని వైఎస్సార్‌ ఆడిటోరియంలో జరిగిన డాక్టర్ ఈసీ గంగిరెడ్డి సంస్మరణ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈసీ గంగిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వైద్యుడిగా, సంఘసేవకుడిగా గంగిరెడ్డి చేసిన సేవలను జగన్ గుర్తుకుతెచ్చుకున్నారు. కడప జిల్లా పులివెందులలోని వైఎస్సార్‌ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన గంగిరెడ్డి సంస్మరణ సభకు సీఎం హాజరయ్యారు. సీఎం వెంట ఆయన సతీమణి భారతి, తల్లి విజయలక్ష్మి, భారతి తల్లి సుగుణమ్మ, ఎంపీలు విజయసాయిరెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఈసీ గంగిరెడ్డి బంధువులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

కాగా, పిల్లల దేవుడుగా గుర్తింపు పొందిన ప్రముఖ వైద్యుడు, పులివెందుల మాజీ ఎంపీ డాక్టర్‌ ఎద్దుల చెంగల్‌రెడ్డి గారి గంగిరెడ్డి శనివారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. గంగిరెడ్డికి భార్య, ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. ఆయన సతీమణి ఈసీ సుగుణమ్మ, కుమారుడు దినేశ్‌ రెడ్డి కూడా వైద్యులే. ఆయన కుమార్తె వైఎస్‌ భారతి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి.